‘చాలెంజ్’కు చుక్కెదురు


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తూ వస్తున్న విధానాలు ఎప్పటిలాగే బెడిసికొట్టాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల టెండ ర్లలో ‘స్విస్ చాలెంజ్’ విధానం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సోమ వారం హైదరాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ విధానంలో ఏమాత్రం పారదర్శకత ఉండటంలేదు గనుక దాన్ని ప్రోత్సహించవద్దని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నిరుడు సూచించింది.

 

ఈ విధానం నల్లడబ్బు పెరుగుదలకు దోహదపడుతున్నదని దేశంలోని పౌర సమాజ ఉద్యమకారులు చాన్నాళ్లనుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంపై దేశంలోనే కాదు... విదేశాల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  వీటన్నిటి పర్యవసానంగానే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్ నేతృత్వంలో 9మందితో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దేశంలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులను పరిశీలించింది. ఆ రంగంలో పనిచేస్తున్న పలువురు ఉన్నత శ్రేణి నిపుణులను సంప్రదించింది.

 

ఆ తర్వాత నిరుడు నవంబర్‌లో సవివరమైన నివేదిక సమర్పించింది. దేశంలో అరడజను రాష్ట్రాలు ఈ విధానం ద్వారా వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల్ని అమలు చేస్తున్నాయి. జాప్యం లేకుండా పనులు పూర్తికావడానికి ఈ విధానం ఉత్తమమైనదని 2009లో సుప్రీంకోర్టు అభిప్రాయపడిన తర్వాత ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని చాలా ప్రభుత్వాలు అమలు చేయడం ప్రారంభించాయి. అయితే అదే తీర్పులో న్యాయస్థానం కొన్ని సవరణలు కూడా సూచించింది. ముఖ్యంగా ఎంపికైన ప్రాజెక్టుల పర్యవేక్షణకు నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు కావా లని అభిప్రాయపడింది.

 

ఈ విధానం ఉత్తమమైనదని సుప్రీంకోర్టు భావించడానికి కొన్ని కారణాలు న్నాయి. సంప్రదాయ విధానంలో ప్రభుత్వం ఒక ప్రాజెక్టును గుర్తించి, దాని నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయిస్తుంది. నిర్మాణ వ్యయమెంతో మదింపు వేస్తుంది. టెండర్లు పిలుస్తుంది. అనుభవమూ, సామర్థ్యమూ గల సంస్థ లను గుర్తిస్తుంది. అందులో తక్కువ వ్యయానికి పూర్తి చేస్తామన్న వారిని ఎంపిక చేస్తుంది. అయితే ఈ ప్రక్రియకు సుదీర్ఘకాలం పడుతుంది. సకాలంలో పనులు పూర్తికావు. నిర్మాణ వ్యయం పెరుగుతుంది.

 

‘స్విస్ చాలెంజ్’ దీనికి పూర్తిగా భిన్నం. ప్రాజెక్టుకు సంబంధించిన ఆలోచన ఎవరికైనా రావొచ్చు. అలా వచ్చిన సంస్థ నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదిస్తుంది. అందుకయ్యే వ్యయం, సమకూరే ప్రయో జనాలు వగైరాలతో సవివరమైన నివేదిక అందజేస్తుంది. ఉపయోగకర మైనదని ప్రభుత్వం కూడా భావిస్తే దాన్ని ఆమోదిస్తుంది. ఆ సంస్థ సూచించినకంటే తక్కువ వ్యయానికి ఎవరైనా పూర్తిచేస్తామని ముందుకొస్తే అవకాశం ఇస్తామని ప్రకటి స్తుంది. అందుకు వేరే సంస్థ సంసిద్ధత తెలిపితే మొదటి సంస్థను ‘మీరు ఆ ధరకు చేస్తారా...’ అని ప్రశ్నిస్తుంది.

 

దానికి అంగీకరిస్తే వారికే ఇస్తుంది. అది గిట్టుబాటు కాదని వెనక్కు తగ్గితే తక్కువ వ్యయానికి చేస్తామన్న సంస్థకు ప్రాజెక్టు కట్టబెడు తుంది. ఈ విధానంలో ప్రాజెక్టు ఆలోచన మొదలుకొని అనేక అంశాల్లో ప్రభుత్వం పాత్ర తగ్గిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించినవారికి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే ఇందులో చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా మొదట్లో అంగీకరించిన ధరకు పూర్తి చేయడం సాధ్యంకాదని సంస్థ మధ్యలో మొండికేస్తే ప్రభుత్వం నిస్స హాయ స్థితిలో పడుతుంది.

 

ఏ కారణం చేతనైనా ప్రభుత్వమే కాంట్రాక్టు రద్దు చేయాలనుకుంటే భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అమరావతి విషయంలో ఈ పరిహారం 150 శాతం వరకూ ఉంది. పారదర్శకతకే చోటుండదు. అసలు ప్రాజెక్టు ఆలోచనే కొత్తది గనుక దాన్ని మదింపు వేయడానికి, ఒక అంచనాకు రావడానికి పోటీ సంస్థలకు సమయం పడుతుంది. ఈలోగా గడువు ముగిసిపోతుంది. పేరుకే ‘చాలెంజ్’ తప్ప మొదట ప్రతిపాదించిన సంస్థే పోటీ లేకుండా దాన్ని తన్నుకుపోతుంది. ఇలాంటి సమస్య లుండబట్టే 2011లో కేంద్రం కొన్ని పరిమితులు విధించింది. తప్పనిసరైతే తప్ప ‘స్విస్‌చాలెంజ్’ వైపు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

 

విశేషమైన పాలనానుభవం ఉన్నదని తరచు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ‘స్విస్ చాలెంజ్’ పేరు అలాగే ఉంచి దానికి మరింత భ్రష్ట రూపాన్ని కనిపెట్టారు. సింగపూర్ కన్సార్టియం సంస్థలకు రాజధాని నిర్మాణం కట్టబెట్టాలన్న నిర్ణయం ముందే తీసుకుని ఆ దిశగా పావులు కదిపారు. కన్సా ర్టియంకు దాదాపు రూ. 6,000 కోట్ల విలువైన భూమిని అప్పగించడం మాత్రమే కాదు... ప్రాజెక్టుకు అవసరమైన నీరు రోడ్లు, విద్యుత్ వగైరా సౌకర్యా లన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది.

 

కన్సార్టియం పెట్టుబడి ఇందులో కేవలం రూ. 306 కోట్లు. వాస్తవానికి ఆ కంపెనీలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రూ. 300 కోట్ల విలువైన భూముల్ని లెక్కేస్తే వాటి పెట్టుబడి నిజానికి రూ. 6 కోట్లే! ప్రాజెక్టు పూర్తయ్యాక వచ్చే ఆదాయంలో ఆ కంపెనీల వాటా 58 శాతమైతే, ప్రభుత్వానిది 42 శాతం మాత్రమే. ఇంతకన్నా అన్యాయమైన, పనికిమాలిన ఒప్పందం వేరే ఉంటుందా? పైగా దాని వివరాలు గోప్యంగా ఉంచారు. కన్సార్టియంకు దీటుగా, అంతకన్నా తక్కువ వ్యయానికి తాము పూర్తిచేయగలమని ఏ సంస్థ అయినా ముందుకు రావాలంటే వారికి తగినంత సమాచారం అందుబాటులో ఉంచాలన్న ఇంగిత జ్ఞానం పాలకులకు లేకపోయింది.

 

ప్రతిపక్షాలు కాదుగదా... ఇఏఎస్ శర్మ వంటి విజ్ఞులు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబే లేదు. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం నిలదీస్తే నీళ్లు నమిలి స్టే ఇచ్చే స్థితిని తెచ్చుకున్నది బాబు ప్రభుత్వమే. లొసు గులున్నాయని చెబుతున్నవారిని అభివృద్ధి నిరోధకులుగా, ఉన్మాదులుగా ముద్ర వేస్తూ ఇన్నాళ్లూ కాలక్షేపం చేసిన ప్రభుత్వం నిజాయితీగలదైతే న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగేది. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే వేరుగా ఉండేది. అందుకు బదులు స్టే ఉత్తర్వులపై అప్పీల్‌కెళ్లాలని సర్కారు భావిస్తోంది. ఈ దశలో అయినా కేంద్రం జోక్యం చేసుకుని హితవు చెప్పాలి. లేనట్టయితే ఈ మకిలి తనకూ అంటుతుందని గ్రహించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top