భేషైన కార్యాచరణ


పర్యావరణ విధ్వంసం పర్యవసానంగా భూగోళానికి ప్రమాదం ముంచుకొస్తున్నదని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మన దేశం ప్రపంచానికే ఆదర్శవంతమనదగ్గ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. 2030 నాటికల్లా కర్బన ఉద్గారాలను 33 నుంచి 35 శాతం తగ్గిస్తామని వాగ్దానం చేస్తూ వాతావరణ విధానాన్ని వెల్లడించింది. 2020కల్లా 20 నుంచి 25 శాతం ఉద్గారాల తగ్గింపునకు కృషి చేస్తామని ఇప్పటికే అంగీకరించిన భారత్ ఇప్పుడు ఈ స్థాయిలో ముందుకు రావడం మెచ్చదగిందే. సాంకేతికతపరంగా చూసినా... నిధులరీత్యా ఆలోచించినా ఇది సాహసోపేతమే. వీటిమధ్య సమతుల్యతను సాధించాలని చూడటం నిజానికి తాడు మీద నడకలాంటిది. పరిశ్రమల్లో వెలువడే కాలుష్య కారకాలను సమర్థవంతంగా వడబోసే మెరుగైన సాంకేతికత మన దేశం వద్ద మాత్రమే కాదు...ఏ వర్థమాన దేశం దగ్గరా లేదు. ఇప్పుడు అమల్లో ఉన్నవి ఏమాత్రం సరిపోవు.

 

 ఆ రంగంలో ఎన్నో పరిశోధనలు చేయించి, అందుకోసం భారీగా నిధులు వెచ్చించిన సంపన్న దేశాలు ఆ టెక్నాలజీ అమ్మకం ద్వారా లాభాలు గడించాలని చూస్తున్నాయి. గతి తప్పుతున్న రుతువులకూ...తరచు సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలకూ, పెరుగుతున్న ప్రాణాంతక వ్యాధులకూ వాతావరణంలో వచ్చి చేరుతున్న కాలుష్యమే కారణం అని అనుకున్నప్పుడు... అలాంటి కాలుష్యాన్ని నివారించడంలో వ్యాపార ప్రయోజనాలను చూసుకోవడం సరైంది కాదు. సంపన్న దేశాలు అనుసరించే ఈ వైఖరివల్ల వర్థమాన దేశాలు కేవలం సాంకేతిక పరిజ్ఞానం కోసమే భారీగా నిధులు ఖర్చు చేయాలి. లేదా దాంతో సంబంధం లేకుండా పరిశ్రమల్ని స్థాపించి కాలుష్య కారక దేశంగా ముద్రేయించుకోవాలి. అదే జరిగితే అంతర్జాతీయంగా ఆంక్షలకు లోనయ్యే స్థితి కూడా ఏర్పడవచ్చు. దానికి భయపడి అభివృద్ధి ప్రాజెక్టుల జోలికి పోకుంటే ఆర్థికాభివృద్ధి అసాధ్యమవుతుంది. ఉపాధి కల్పన సమస్యగా మారుతుంది.

 

 మన దేశం ప్రకటించిన వాతావరణ విధానంలో మరికొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. 2030నాటికి తాను ఉత్పత్తి చేయబోయే ఇంధనంలో పునరుత్పాదక ఇంధనం వాటా 40 శాతం ఉంటుందని తెలిపింది. దాంతోపాటు ఇదే కాలంలో అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడం ద్వారా 250 కోట్ల టన్నుల నుంచి 300 కోట్ల టన్నుల వరకూ కర్బన ఉద్గారాలు హరించుకుపోయేలా చేస్తానని హామీ ఇచ్చింది. ఈ వాగ్దానాలను నెరవేర్చాలంటే వచ్చే పదిహేనేళ్లలో మన దేశానికి టెక్నాలజీతోపాటు రెండున్నర లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయి. ఇది నిరుటి మన స్థూల దేశీయోత్పత్తికన్నా ఎక్కువ. కాలుష్య నివారణ మహా యజ్ఞం విజయవంతానికి అవసరమయ్యే ఈ మొత్తాన్ని దేశీయంగా, అంతర్జాతీయ వనరుల ద్వారా మన దేశం సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మన దేశం మరేమి సాధించవచ్చునన్నది పారిస్ సదస్సులో జరగబోయే చర్చలు, వాటి ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.



వ్యవసాయం, మత్స్య, అటవీ, జల వనరులు, మౌలిక సదుపాయాల రంగాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడానికి 20,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని అంచనా. దేశంలో 25 సోలార్ పార్కులను అభివృద్ధి చేసి, రైతులకు సౌరశక్తితో నడిచే పది లక్షల పంపు సెట్లు ఇవ్వడం, దేశంలోని 55,000 పెట్రోల్ బంకులను సౌరశక్తి ఆధారితంగా మార్చడం వగైరాలు తాజాగా ప్రకటించిన లక్ష్యాల్లో ఉన్నాయి. 2030 నాటికి 200 గిగావాట్ల పునరుత్పాదన ఇంధన వనరుల స్థాయిని సంతరించుకోవాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇదేమంత కష్టం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 2022నాటికి 175 గిగావాట్ల విద్యుత్‌లో అధిక భాగాన్ని సౌరశక్తిద్వారా సాధించాలని గతంలోనే మన దేశం సంకల్పించుకుంది. ఆ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడ్డాయి. కనుక 2030 నాటికి అనుకున్న కంటే ఎక్కువే ఈ రంగంలో సాధించడానికి అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో విద్యుదుత్పాదనకు బొగ్గు వాడకంపై ఆధారపడక తప్పదని మన దేశం అంటున్నది.

 

 అయితే, ఆ రంగంలో మెరుగైన టెక్నాలజీని వాడతామని హామీ ఇస్తున్నది. 2030నాటికి కర్బన ఉద్గారాలను 33 నుంచి 35 శాతం తగ్గించగలమని మన దేశం చెప్పినా...ఇవన్నీ అనుకున్న ప్రకారం అమలైతే ఆ లక్ష్యాన్ని మన దేశం అవలీలగా అధిగమించగలదని నిపుణులు భావిస్తున్నారు. లక్ష్య సాధనలో ఎన్నో అవరోధాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి చేసే ప్రయత్నంవల్ల సాగు భూములపై ప్రభావం పడుతుందన్న ఆందోళన రైతాంగంలో కలగవచ్చు. అలాంటి సమస్యల పరిష్కారంలో ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది.

 

  2030 నాటికి భూతాపోన్నతి పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడటమే లక్ష్యంగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాలని, అందుకు ప్రతి దేశమూ తన వంతుగా చేయబోతున్నదేమిటో చెప్పాలని ఐక్యరాజ్య సమితి సదస్సు లోగడ నిర్దేశించింది. పారిశ్రామిక దేశాలు లాభాపేక్షతో కర్బన ఉద్గారాలను భారీయెత్తున విడిచిపెడుతున్న పర్యవసానంగా పర్యావరణం ధ్వంసమవుతున్నది.

 

 ఉద్గారాల స్థాయి ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగితే ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని... అకాల వర్షాలు పోటెత్తి వ్యవసాయోత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచంలో కోట్లాదిమంది జీవిక అస్తవ్యస్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించిన కర్బన కాలుష్యంలో 70 శాతానికిపైగా వాటా సంపన్న దేశాలదే. అందువల్ల గణనీయంగా తగ్గించుకోవాల్సిన బాధ్యత వాటిపైనే ఉంది.



అయితే నిరుడు జరిగిన లిమా సదస్సులో అవి పేచీకి దిగాయి. ఫలితంగా వాతావరణ కార్యాచరణకు సంబంధించి ధనిక, పేద దేశాలకు వేర్వేరుగా ఉండే నిబంధనలు నీరుగారాయి. 2012లో వెలువడిన ఉద్గారాల గణాంకాలు చూస్తే కాలుష్య కారక దేశాల్లో అగ్రభాగాన ఉన్నదెవరో తెలుస్తుంది. ఆ ఏడాది చైనా 28.6 శాతం, అమెరికా 15.1 శాతం, యూరప్ దేశాలు 10.9 శాతం కర్బన ఉద్గారాలను విడుదల చేస్తే మన దేశం వాటా 5.7 శాతం మాత్రమే.  సంపన్న దేశాలు తమ బాధ్యతను గుర్తెరిగేలా చేయడంలో ఇతర వర్థమాన దేశాలతో కలిసి మన దేశం పారిస్ సదస్సులో గట్టిగా పోరాడవలసి ఉంటుంది. లిమా సదస్సులా కాకుండా పారిస్ నిర్దిష్టమైన మార్గ దర్శనాన్ని ప్రకటించేలా చూడాల్సి ఉంటుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top