నెత్తురోడిన రహదారులు

నెత్తురోడిన రహదారులు - Sakshi


– రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

– కట్టంగూర్, చిట్యాల, రాజాపేట మండలాల పరిధిలో ఘటనలు

పెద్దకాపర్తి(చిట్యాల)

జిల్లాలోని రహదారులు మరోసారి నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  జిల్లాలోని కట్టంగూర్, చిట్యాల, రాజాపేట మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు..  చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామానికి చెందిన మేడి స్వామి(27) కంటైనర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి చిట్యాల వైపునకు లారీలో వస్తున్నాడు.  పెద్దకాపర్తి శివారులోని గాంధీ గుడి వద్దకు రాగానే లారీని రహదారి పక్కన ఆపి భోజనం చేసేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు.

బైక్‌ అదుపుతప్పడంతో..

రాజాపేట

రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన బైర మల్లేషం (30) తన భూమిని కొంత ఇతరులకు విక్రయించగా మంగళవారం యాదగిరిగుట్టలో రిజిస్టేషన్‌ చేయించి ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి పశువులకు మేత వేయడం కోసం బైక్‌పై చల్లూరు వైపు ఉన్న తన వ్యవసాయ బావిద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో బైక్‌ ఆదుపు తప్పి చల్లూరు ఏనె సమీపంలోని కల్వర్టును ఢీకొట్టి కిందపడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.  రాత్రి వరకు రాకపోవడంతో భార్య మస్తాని భర్త ఆచూకీ కోసం వెతికింది. ఉదయం బంధువుల సాయంతో వెతుకగా కల్లర్టువద్ద మల్లేశం మృతిచెంది ఉన్నాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు భార్య మస్తాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బీసన్న తెలిపారు.



కట్టంగూర్‌ ః విజయవాడ నుంచి హైదరాబాదుకు వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ మండలంలోని మాణిక్కాలమ్మగూడెం ఆంజనేయస్వామి ఆలయం వద్ద జాతీయ ర హదారి పక్కనే ఆగిఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరబాదుకు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ క్లీనర్‌ నర్సింహారెడ్డి(32) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద ..

 మండలకేంద్రంలోని నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద సూర్యాపేట నుంచి హైదరాబాదుకు వెళుతున్న ఇసుక లారీ ద్విచక్రవాహనంతో పాటు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌ పై ప్రయాణిస్తున్న వేములకొండ రాములు(50)కి,బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు ఖాసీం, ధనమ్మ, పిల్లలు స్నేహ, సాయిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. రాములు పరిస్థితి విషమించటంతో హైదరాబాదు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top