అసంపూర్ణ ‘సర్వే’క్షణం!

అసంపూర్ణ ‘సర్వే’క్షణం! - Sakshi


బడ్జెట్‌కు ఒకటి రెండు రోజుల ముందు రివాజుగా పార్లమెంటు ముందుంచే ఆర్ధిక సర్వే ముగుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో వివిధ రంగాల పనితీరును సవివరంగా సమీక్షించడంతోపాటు రాబోయే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమ్యాలను కూడా రేఖామాత్రంగా స్పృశిస్తుంది. సర్వే ఏకరువు పెట్టే అంశాలను ఆధారం చేసు కుని కొత్త బడ్జెట్‌లో ఏ బండలు పడబోతున్నాయో, ఎలాంటి వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉందో ఆర్థిక నిపుణులు అంచనా వేస్తారు. నవంబర్‌ 8 రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం సామాన్య పౌరులు నిన్న మొన్నటి వరకూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. నోట్ల అలభ్యత వల్ల అనేకానేక రంగాలు కుంటుబడ్డాయి. సంఘటిత రంగం మాటెలా ఉన్నా 94 శాతంమందికి ఉపాధి కల్పించే అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతింది.



ఈ అనిశ్చిత వాతావరణం దేశ ఆర్ధిక వ్యవస్థపై చూపిన ప్రభావమేమిటో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే వెల్లడిస్తుందని అందరూ ఆశించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ముగుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 0.5 శాతం కోత పడిందని, మొత్తంగా వృద్ధిరేటు 6.5 శాతం ఉన్నదని సర్వే అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో అది తిరిగి సాధారణ స్థితికి చేరుకుని దాదాపు 7.5 శాతానికి చేరుతుందని భావించింది. నిరుడు సమర్పించిన ఆర్ధిక సర్వేను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 2016–17లో దాదాపు 7.5 శాతం జీడీపీని సాధిస్తామని, ఆ తదుపరి రెండేళ్లలో దీన్ని 8 నుంచి 10 శాతం వరకూ తీసుకెళ్తామని భరోసా ప్రకటించింది.



సంక్షోభం వైపుగా పయనిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకోకుండా దాన్ని రూపొందించారని అప్పట్లోనే విమర్శలొచ్చాయి. ప్రధాన దేశాలు వృద్ధిలో క్షీణతను నమోదు చేస్తున్న తరుణంలో రాబోయే కాలం బ్రహ్మాం డంగా ఉంటుందని అంచనాకు రావడంలో అర్ధం లేదు. తాజా ఆర్ధిక సర్వే ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పైపైకి ఎగబాకటం, ప్రధాన దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు తలెత్తడం వగైరాలను దృష్టిలో పెట్టుకుంది. కానీ పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని సరిగా మదింపు వేసినట్టు కనబడదు. ఆ చర్య అనంతరం టోకు వర్తకం దాదాపు 80 శాతం పడిపోయిందని, ఉత్పాదకతలో దాదాపు 45 శాతాన్ని ఆక్ర మించే అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో జీడీపీకి కేవలం 0.5 శాతం మాత్రమే కోత పడిందని చెప్పడం సరైందేనా? అది కనీసం 2 శాతం వరకూ ఉండొచ్చునని ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట. దానికి తోడు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసు కుంటున్న నిర్ణయాలు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి.



వెనువెంటనే సాఫ్ట్‌వేర్‌ రంగంపైనా, తదు పరి ఇతర రంగాలపైనా ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే వచ్చే ఆర్ధిక సంవత్సరంనుంచి జీఎస్‌టీ అమలు, దాని పర్య వసానంగా పన్ను వసూళ్లలో కనబడే పెరుగుదల వంటివాటిపై సర్వే ఆశలు పెట్టుకున్నట్టు కనబడుతోంది. నల్లడబ్బును అరికట్టాలంటే కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులు చెల్లించే ప్రత్యక్ష పన్ను లను తగ్గించడం తప్పనిసరవువుతుంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆగ్రహించిన మధ్యతరగతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆదాయ పన్ను పరిమితిని గణనీయంగా పెంచే అవకాశం లేకపోలేదు.



సర్వే ప్రస్తావించిన అంశాలను గమనిస్తే ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయ బోతున్నదన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. అలాంటపుడు జీఎస్‌టీపై అతిగా ఆశలు పెట్టుకోవడమే అవుతుంది. పెద్ద నోట్ల రద్దు కలిగించిన ఇబ్బంది స్వల్పకాలమైనదేనని, దీర్ఘకాలంలో నల్ల డబ్బును అది గణనీయంగా తగ్గించ డంతోపాటు పన్ను వసూళ్లను మెరుగు పరు స్తుందని సర్వే భావిస్తోంది. పెద్ద నోట్ల చలామణి యథాతథమయ్యాక మళ్లీ పూర్వ స్థితి ఏర్పడుతుందని కూడా అంచనా వేస్తోంది.



కానీ ఒకసారి ఉపాధి అవకాశాలు తగ్గి, లాభాలు పడిపోయి, ఉత్పాదకత మందగించినప్పుడు నోట్ల చలామణి దానంతటదే సాధారణ పరిస్థితిని తీసుకు రాలేదు. వస్తువులు, సేవల వినిమయంలోనైతేనేమి, పెట్టుబడుల విషయంలో అయితేనేమి గతంలో ఉన్న చొరవ, ధైర్యం ఉండవు. కనుక డిమాండ్‌ సాధారణ స్థితికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. ఈ ఆర్ధిక సర్వే కన్నా ఒక రోజు ముందు సోమవారం కాంగ్రెస్‌ ఆర్ధిక నివేదికను విడుదల చేసింది. అది కూడా వృద్ధి రేటు 6.6 శాతం కంటే తక్కువుంటుందని అంచనా వేసినా వెనువెంటనే ఆర్ధిక వ్యవస్థ కోలుకునే అవకాశం లేదని తెలిపింది.



నిరుపేదలకు నెలవారీగా నిర్దిష్ట నగదు మొత్తాన్ని చెల్లించడానికి ఉద్దేశించిన సార్వజనీన కనీస ఆదాయ పథకం(యూబీఐ) గురించి కూడా సర్వే మాట్లాడింది. అయితే అందుకింకా సమయం ఆసన్నం కాలేదని చెప్పడం ద్వారా ప్రస్తుత బడ్జెట్‌లో అది ఉండకపోవచ్చునన్న సంకేతాన్నిచ్చింది. అసలు ఇలాంటి పథకాలు మన దేశంలో ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఒకవేళ అమలు చేసినా పేరుకు సార్వజనీన పథకమన్న పేరు పెట్టినా పరిమిత వర్గాలకు, అది కూడా రకరకాల ఆంక్షలతో మాత్రమే అమలు చేయక తప్పదు. లేనట్టయితే ఈ పథకానికయ్యే వ్యయం అపరిమితంగా ఉంటుంది. లక్షిత వర్గాలకు నేరుగా నగదును అందజేసే ఇలాంటి పథకాలు సాధారణంగా ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే బడ్జెట్‌లలోనే ఉంటాయి. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ దాన్ని ఆపి ఉంచే అవకాశం ఉంది. ఇక ప్రజారోగ్యంపై మన దేశం చేసే వ్యయం ప్రపంచ దేశాలన్నిటి ముందూ తీసికట్టుగా ఉన్నదని సర్వే అంటున్నది. అది జీడీపీలో ఒక శాతం కన్నా కాస్త ఎక్కువగా మాత్రమే ఉన్నదని చెబుతోంది. మొత్తానికి సర్వేలో ప్రస్తావించిన అనేక అంశాల విషయంలో బడ్జెట్‌ ఎలాంటి కార్యాచరణను ప్రతిపాదించబోతున్నదో, ఏఏ రంగాల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నదో మరికొన్ని గంటల్లో వెల్లడవుతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top