ఆచితూచి అడుగులు

ఆచితూచి అడుగులు - Sakshi


మెరికా అధ్యక్ష బాధ్యతలను డోనాల్డ్‌ ట్రంప్‌ స్వీకరించాక తొలిసారి ఆ దేశ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అంచనాలకు మించిన ఆదరణే లభించింది. ఈ పర్యటన విజయవంతం కావడం కోసం గత అయిదు నెలల వ్యవధిలో మన విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్, ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పలుమార్లు అమెరికాను సందర్శించి అక్కడి సీనియర్‌ అధికారులతో మంతనాలు జరిపారు. ఇరు దేశాల సంయుక్త ప్రకటనను గమ నించినా, అధినేతల వ్యాఖ్యల్లో కనబడిన సౌహార్దత చూసినా ఈ పర్యటన ఫలవంతమైందని చెప్పాలి.


కొన్ని ప్రధాన అంశాల విషయంలో ట్రంప్‌ ఊహకందని రీతిలో వ్యవహరిస్తుండటం, తమ పార్టీకే చెందిన గత అధ్యక్షుల వైఖరికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం గమనిస్తున్నవారికి ఈసారి ప్రధాని పర్యటన విషయంలో పెద్దగా హడావుడి కనబడకపోవడానికి కారణమేమిటో సులభంగానే అర్ధమవుతుంది. పాకిస్తాన్‌ కనుసన్నల్లో పనిచేస్తున్న మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ మొజాహిదీన్‌ నాయకుడు సయ్యద్‌ సలాహుద్దీన్‌ను ‘ప్రపంచ ఉగ్రవాది’గా పరిగణిస్తూ   మోదీ–ట్రంప్‌ల శిఖరాగ్ర చర్చలకు ముందు అమెరికా తీసుకున్న నిర్ణయం మనకు అనుకూలమైనదే. అయితే దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.


ఎందుకంటే గతంలో అంతర్జాతీయ నేరగాడు దావూద్‌ ఇబ్రహీం, లష్కరే తొయిబా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ల విషయంలో కూడా అమెరికా ఈ మాదిరి చర్యే తీసుకుంది. అయినా మనకు ఒరిగిందేమీ లేదు. దావూద్‌ తమ దేశంలో లేడని పాక్‌ బుకాయించడంతోపాటు, హఫీజ్‌ సయీద్‌పై కంటి తుడుపు చర్యలతో సరిపెట్టింది. తనను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌), తాలిబన్‌ వంటి సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్న అమెరికా పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఈ ఉగ్రవాదుల గురించి మాటలకే పరిమితం అవుతోంది. అయినా మన యుద్ధం అమెరికా చేసిపెడు తుందని కోరుకోవడం అత్యాశ. అఫ్ఘానిస్తాన్‌లో సాగిస్తున్న సైనిక చర్యల్లో మనం భాగస్తులం కావాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే మన భద్రత రీత్యా అందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు.కనుకనే పాకిస్తాన్‌ విషయంలో అది మాటలకే పరిమితమవుతోంది.


ఉన్నంతలో సంయుక్త ప్రకటన ‘పొరుగు దేశాల్లో జరిగే ఉగ్రవాద దాడులకు స్థావర ప్రాంతంగా మారకుండా చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలూ పాక్‌ను కోరుతున్నార’ని చెప్పడమే చాలా ఎక్కువ. ఒబామా హయాంలో నిరుడు, అంతకు ముందూ వెలువడిన సంయుక్త ప్రకటనలు అన్యాపదేశంగా మాత్రమే పాకిస్తాన్‌ను ప్రస్తావించాయి. ముంబై, పఠాన్‌కోట ఉగ్రవాద దాడులకు బాధ్యు లైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోమని  పిలుపునిచ్చాయి. ఆ రెండు ఉదం తాల వెనకా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులున్న సంగతి అందరికీ తెలిసిందే అయినా అప్పట్లో నేరుగా చెప్పలేదు.


సలాహుద్దీన్‌ విషయంలో నిజంగా అమెరికా కఠినంగా వ్యవహరిస్తే, పాక్‌పై ఒత్తిళ్లు తీసుకొస్తే అది మన అభిప్రాయాలకు విలువనిస్తు న్నదనుకోవచ్చు. పరోక్షంగానే కావొచ్చుగానీ ప్రపంచంలోనే అతి పెద్ద ఉమ్మడి మార్కెట్‌కు దారితీసే ‘వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌’(ఓబీఓఆర్‌) ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మన ఆందోళనలకు సంయుక్త ప్రకటన చోటిచ్చింది. చైనా ఆధ్వ ర్యంలో రూపుదిద్దుకుంటున్న ఆ ప్రాజెక్టు పాక్‌ అధీనంలోని ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం మీదుగా వెళ్లడం విషయంలో మన దేశానికి అభ్యంతరాలున్నాయి. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోమని చైనా కోరినా దేశ సార్వభౌమత్వానికి చేటు తెచ్చే రీతిలో ప్రాజెక్టు నిర్మాణం ఉన్నందున అది సాధ్యం కాదని భారత్‌ తెలిపింది.


ఇప్పుడు సంయుక్త ప్రకటన నేరుగా ఆ ప్రాజెక్టు తీరును విమర్శించకపోయినా దేశాల సార్వభౌమత్వాలనూ, ప్రాదేశిక సమగ్రతలనూ, న్యాయపాలననూ గౌర వించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి పార దర్శకంగా ఉండాలని సూచించింది. అయితే ఇలా అనడంలో అమెరికా ప్రయో జనాలు కూడా ఉన్నాయి. ఈ సిల్క్‌ రూట్‌ సాకారమైతే వ్యాపార, వాణిజ్య రంగాల్లో చైనా అమెరికాకు గట్టి పోటీనిస్తుంది. అందువల్లే ఓబీఓఆర్‌పై అమెరికాకు సైతం అభ్యంతరాలున్నాయి. ఇక సాగర తీరాల్లో పటిష్టమైన నిఘాకు పనికొచ్చే 22 గార్డియన్‌ ద్రోన్‌ విమానాల విక్రయానికి అమెరికా సుముఖత వ్యక్తం చేయడం మన నావికా దళానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అంశాన్ని చాన్నాళ్లుగా అమెరికా నానుస్తూ వస్తోంది.


ఇక మన ఐటీ రంగ నిపుణులకు పెద్ద అవరోధంగా మారిన హెచ్‌ 1బీ వీసా నిబంధనల అంశం అందరూ ఆశించినట్టు ప్రస్తావనకు రాలేదు. ఇరు దేశాల అధినేతల చర్చల్లోగానీ, సంయుక్త ప్రకటనలోగానీ ఇది ఉంటుందని, మనవారికి కాస్తయినా వెసులుబాటు లభిస్తుందని చాలామంది ఆశించారు. నిజానికి ఈ పర్య టన సందర్భంగా విడుదలైన వైట్‌హౌస్‌ పత్రం తమ ఐటీ రంగంలో భారతీయ అమెరికన్ల పాత్రను ఘనంగా ప్రస్తావించింది. సిలికాన్‌ వ్యాలీ సాంకేతిక విప్లవంలో వారి సృజనాత్మకత ఎన్నదగినదని చెప్పింది. పెంటియం చిప్, ఫైబర్‌ ఆప్టిక్స్, అత్యాధునిక హెడ్‌ఫోన్ల రూపకల్పనలో మన నిపుణుల పాత్రను ప్రశంసించింది.


కానీ హెచ్‌ 1బీ వీసాలకు సంబంధించిన నిబంధనల సడలింపుపై అది నోరె త్తలేదు. దీనిపై రాగలకాలంలో మనవైపుగా మరిన్ని ఒత్తిళ్లు తీసుకురాక తప్పదు. మరోపక్క అమెరికా వ్యవసాయోత్పత్తులకూ, సరుకులూ, సేవలకూ మార్కెట్‌ సౌలభ్యం కల్పించాలని, మేధోహక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ వాణిజ్యానికి చోటీయాలని, అందుకు రెండు దేశాలూ మున్ముందు మరింత కృషి చేయాలని ప్రకటన సూచించింది. ఈ విషయంలో మనం ఇంతవరకూ అనుసరిస్తూ వస్తున్న విధానాలను సమీక్షించు కోవాల్సి వస్తుంది. దౌత్యం అన్నాక ఇచ్చిపుచ్చుకోవడం తప్పనిసరి. కానీ అది సంబంధాల్లో అసమానతలకు దారితీయకూడదు. ఆ విషయంలో మనం జాగురూకత వహించక తప్పదు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top