‘ఏకీకృత’ సాక్షాత్కారం

‘ఏకీకృత’ సాక్షాత్కారం - Sakshi


  ప్రారంభించే ఏ పథకాన్నయినా అత్యంత ఆకర్షణీయంగా, అందరి దృష్టీ పడేలా తీర్చిదిద్ది అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీకెవరూ సాటిరారు. మరికొన్ని గంటల్లో అమల్లోకి రాబోతున్న వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) చట్టంపై కూడా వివిధ మాధ్యమాల్లో గత కొంతకాలంగా భారీయెత్తున ప్రచారం జరుగుతోంది. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలన్న సంకల్పంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి చేపట్టబోతున్న కీలక ఆర్ధిక సంస్కరణగా జీఎస్‌టీ ఇప్పటికే అందరికీ పరిచయమైంది. దానంతటికీ పరాకాష్టగా ఈ ఏకీకృత పన్నుల వ్యవస్థ అమల్లోకి రాబోయే శుక్రవారం అర్ధరాత్రి క్షణాల్లో పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో భారీ కార్య క్రమాన్ని కూడా ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సమక్షంలో జరిగే సభలో ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ఎంపీలు, ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు.


చరిత్రాత్మకమైన ఆ హాల్‌లోనే స్వాతంత్య్ర సమరయోధుల సమక్షంలో 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్య్ర దినోత్సవం, అధికార బదిలీ జరిగాయి. దేశ ప్రజలనుద్దేశించి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగించారు. ఆ సంద ర్భాన్ని పురస్కరించుకునే 1972లో రజతోత్సవం, 1997లో స్వర్ణోత్సవం నిర్వహిం చారు. జీఎస్‌టీ అమలును దాంతో సమం చేస్తూ ఇప్పుడీ ఉత్సవం ఏర్పాటు చేస్తున్నారు.

దీని అమలుకు మార్గం సుగమం చేసే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు అన్ని పార్టీల సహకారంతో నిరుడు ఆగస్టులో పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రాల చట్టసభలు సైతం దానికి ఆమోదముద్ర వేశాయి. పదహారేళ్ల నాడు కేవలం ఒక ఆలోచనగా, ప్రతిపాదనగా ముందుకొచ్చిన ఈ చట్టం అమల్లోకి రాబోతున్న ఈ తరుణంలో మాత్రం విపక్షాలు నిర్లిప్త వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహించి ఈ చట్టానికి నారూ నీరూ పోసిన కాంగ్రెస్‌ సెంట్రల్‌హాల్‌లో జరిగే ఉత్సవానికి వెళ్లాలా వద్దా అని చివరివరకూ తర్జన భర్జనపడింది. ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి అందులో పాలుపంచుకుని ఇంత పెద్ద సంస్కరణకు తానే బీజం వేశానని చాటుకోవాలా లేక దానికి దూరంగా ఉండి పోయి తనకు అభ్యంతరాలున్నట్టు తెలియజెప్పాలా అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయింది. చివరకు ఆ సమావేశాన్ని బహిష్కరించబోతున్నట్టు ప్రక టించింది. తృణమూల్, వామపక్షాలు, మరికొన్ని ఇతర పార్టీలు సైతం దానికి దూరంగా ఉంటున్నాయి. వివిధ వర్గాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకో కుండా అమలు చేస్తున్న ఈ వ్యవస్థ వల్ల చిన్న వర్తకులు, వ్యాపారులకు వేధింపులే మిగులుతాయన్నది ఈ పార్టీల వాదన.  


తొలి స్వాతంత్య్రోత్సవ సందర్భం సంగతలా ఉంచి కేంద్రంలో ఎవరు అధికా రంలో ఉన్నా కీలక నిర్ణయాలన్నీ అర్ధరాత్రుళ్లు వెలువడటం మనకు ఆనవాయి తీయే. ఈ కొత్త పన్నుల వ్యవస్థ వల్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మరో రెండు శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే కొత్త వ్యవస్థతో సమస్యలుం టాయని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ సైతం అంగీకరిస్తున్నారు. ఒకటి రెండు నెలల్లో అంతా సర్దుకుంటుందని చెబుతున్నారు. అందులో వాస్తవమేమిటో రాగల రోజుల్లో తేలిపోతుంది. ఒకటి మాత్రం నిజం...దీని రాకతో నానా రకాల పేర్లతో, పద్ధతుల్లో అమల్లో ఉన్న సంక్లిష్ట పన్నుల వ్యవస్థ దాదాపుగా ముగిసిపోతుంది. వ్యాపార, వాణిజ్య వర్గాలకు నిత్యానుభవమైన పన్ను అధికారుల వేధింపులు మటు మాయమవుతాయి. అదే సమయంలో అగ్గిపెట్టె మొదలుకొని స్వర్ణాభరణాల వరకూ వసూలయ్యే పన్నులు ప్రతి ఒక్కరినీ తాకుతాయి. వాటి బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కిరాణా దుకాణం మొదలుకొని భారీ మాల్‌ వరకూ అందరూ ఆన్‌లైన్‌లో లెక్కలు చూపాలి. వినియోగదారులకు చేరే సరుకులు, సేవల్ని మొత్తం 1,200 రకాలుగా వర్గీకరించి వాటిపై ఆరు విధాలుగా–0.25 శాతం, 3, 5, 12, 18, 28 శాతం చొప్పున పన్నులు విధించి వసూలు చేయబోతున్నారు.


కొన్ని టిపై ఇప్పటికే ఉన్న సెస్సులు ఈ పన్నులకు అదనం. జీఎస్‌టీ రాకతో పాత పన్నుల వ్యవస్థ సంపూర్ణంగా అంతరిస్తుందన్న ప్రచారం పాక్షిక సత్యమే. విద్యుత్, మద్యం, రియల్‌ఎస్టేట్‌ వంటివి జీఎస్‌టీ నుంచి మినహాయించారు. పెట్రో ఉత్పత్తులపై సైతం ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే పన్నులు విధిస్తారు. భవిష్యత్తులో జీఎస్‌టీ పరి ధిలోకి తెస్తామని కేంద్రం చెబుతున్నా అదెంతవరకూ సాధ్యమో తెలియదు. అదే గనుక జరిగితే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ తదితరాల ధరలు దాదాపు సగానికి పడిపోతాయి. అదే సమయంలో పెట్రో ఉత్పత్తిదారులు, చమురు శుద్ధి సంస్థలు, పంపిణీదారులు ఒకేసారి రూ. 25,000 కోట్ల మేర నష్టపోతారు. ఆ ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా జనం నుంచి వసూలు చేస్తున్నాయి. ఇదంతా గణనీయంగా తగ్గుతుంది.  


జీఎస్‌టీ రాకతో తమ అవసరాలు, లక్ష్యాల మేరకు పన్నులు విధించుకునే హక్కును రాష్ట్రాలు  కోల్పోతాయి. వాటి ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. వాటి ఆర్ధిక స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. ఇప్పటికే రాష్ట్రాలు మున్సిపాలిటీల స్థాయికి దిగజారాయి. ఫెడరల్‌ వ్యవస్థ నామమాత్రంగా మిగిలింది. అయితే ఇది తాత్కాలికమేనని, మార్కెట్ల, పెట్టుబడుల వృద్ధితో భవిష్యత్తులో వాటికొచ్చే ఆదాయం బాగా పెరుగుతుందని కొందరు ఆర్ధిక నిపుణులు లెక్కలు చెబు తున్నారు. దాని మాటెలా ఉన్నా ప్రభుత్వాల ఆదాయం పడిపోతే మొదటగా కోతలు పడేది సంక్షేమ రంగంపైనే.


అదే జరిగితే పేద ప్రజానీకం ఇబ్బందుల్లో పడతారు. ఇక బడా పారిశ్రామిక సంస్థలనూ, బడుగు వ్యాపార సంస్థలనూ ఒకే గాటన కట్టే జీఎస్‌టీ తీరు చేనేతవంటి అనేక రంగాలకు తీరని నష్టం చేకూరుస్తుందన్న భయాందోళనలున్నాయి. ఆ రంగాల మొరను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు జీఎస్‌టీపై సాగిస్తున్న హడావుడి గమనిస్తే కొన్నేళ్లక్రితం అమల్లోకొచ్చిన వ్యాట్‌ గుర్తుకొస్తుంది. ఆచరణలో జీఎస్‌టీ కూడా వ్యాట్‌లా జనం గుండెలపై కుంపటి అవుతుందా, వారికి కాస్తయినా ఉపశమనమిస్తుందా అన్నది చూడాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top