సిరియాలో చావు కేక

సిరియాలో చావు కేక - Sakshi


ఆరేళ్ల క్రితం రాజుకుని ఆనాటినుంచీ నిరంతరం మండుతూనే ఉన్న సిరియా మరో సారి పతాక శీర్షికలకెక్కింది. పత్రికల్లో, చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో కనబడు తున్న ఛాయాచిత్రాలు, వీడియోలు ప్రతి ఒక్కరినీ విచలితుల్ని చేస్తున్నాయి. నాలుగైదేళ్ల పసివాళ్లు మొదలుకొని ఆడా మగా తేడా లేకుండా వందలాదిమంది నడి వీధుల్లో, ఆస్పత్రుల్లో నురగలు కక్కుకుంటూ గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యాలు... ఊపిరి తీసుకోవడం కోసం వారు చేస్తున్న విఫలయత్నాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుల శరీరాలపై పేరుకుపోయిన విషవాయు అవశేషాలను తొలగించడం కోసం అగ్నిమాపక దళ సిబ్బంది వారిపై పైపులతో నీటిని స్ప్రే చేస్తున్న దృశ్యాలు అక్కడి పౌరులు పడుతున్న నరకయాతనను వెల్లడిస్తున్నాయి. తోటి మనుషులపై ఇంత అమానుషంగా, ఇంత దుర్మార్గంగా వ్యవహరించగలిగిన రాక్షసులున్నారని తెలిసి అందరూ నిర్ఘాంతపోతున్నారు.



ఆ ఛాయా చిత్రాలను, వీడియోలను చూసే ధైర్యం చేయగలిగితే... చూశాక తిరిగి మామూలు మనిషి కావడం అంత సులభం కాదు. వాయువ్య సిరియాలో తిరుగుబాటుదార్ల అధీనంలో ఉన్న పట్టణంలో మంగళవారం ఉన్నట్టుండి రసాయన ఆయుధాలు ప్రయోగించ డంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఇంతవరకూ 75మందిని పొట్టనబెట్టు కోవ డంతోపాటు వందలాదిమందిని తీవ్ర అస్వస్థుల్ని చేసిన ఈ దాడికి బాధ్యులు తిరుగుబాటుదార్లా, ప్రభుత్వ సైన్యమా అన్నది 24 గంటలు గడిచాక కూడా తేలలేదు.



ఎప్పటిలాగే కారకులు మీరంటే మీరని ఇరు పక్షాలూ ఆరోపించు కుంటున్నాయి. సైన్యమే ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిపిందని తిరుగుబాటుదార్లు అంటుంటే తిరుగుబాటుదార్ల అధీనంలోని ఆయుధ గిడ్డంగిపై వైమానిక దాడి జరిగినప్పుడు ఈ విషవాయువు వెలువడిందని సిరియా అధినేత అసద్‌కు వత్తాసు పలుకుతున్న రష్యా చెబుతోంది. భద్రతామండలి ఈ దురంతంపై అత్యవసర సమావేశం నిర్వహించడానికి కొన్ని గంటల ముందు రష్యా చేసిన ఈ ప్రకటన వెనకున్న కారణం స్పష్టమే... ఎప్పటిలా అసద్‌ను కాపాడటమే.



సిరియాలో నాలుగేళ్లక్రితం కూడా ఇలాగే రసాయన ఆయుధ దాడి జరిగింది. అందులో 1,400 మంది మరణించారు. బాధితులకు ఆసరాగా వైద్య సేవలంది స్తున్న స్వచ్ఛంద సంస్థల సిబ్బందిపై అడపా దడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్కదానిపైనా విచారణగానీ, శిక్షగానీ లేదు. తాజా నరమేథం కూడా ఆ జాబితాలో చేరినా ఆశ్చర్యంలేదు. ఏదైనా విషాదం చోటు చేసుకున్న వెంటనే తీవ్రంగా ఖండించడం, చర్యలు తీసుకోవాలనడమే తప్ప ప్రపంచ దేశాలు ఏనాడూ సిరియాపై చిత్తశుద్ధి ప్రదర్శించలేదు.



ఎప్పటికప్పుడు చర్చలంటూ హడివుడి, ఏదో మేరకు ఒప్పందం కుదిరిందనుకునేలోగా అదికాస్తా అటకెక్కి మళ్లీ నరమేథం సాగడం రివాజుగా మారింది. ఆరేళ్ల ఈ అంతర్యుద్ధంలో ఇంతవరకూ అయిదు లక్షలమందికిపైగా జనం మరణించగా జనాభాలో సగంమంది దేశం విడిచి వెళ్లిపోయారు. సిరియాలో ఏమూల ఏ పట్టణాన్ని, గ్రామాన్ని గమనించినా వల్లకాటిని తలపిస్తాయి. ఎవరు ఎవరిపై దాడులు చేస్తున్నారో, ఎందుకు చేస్తు న్నారో బయటివారికే కాదు... అక్కడివారికీ తెలియని స్థితి. అక్కడ అసద్‌ ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ తిరుగుబాటుదార్ల గ్రూపు ఫ్రీ సిరియన్‌ ఆర్మీ (ఎఫ్‌ఎస్‌ఏ)కి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆయుధ సామగ్రి అందజేశాయి.



అవి ఆ గ్రూపులోని అల్‌ కాయిదా అనుకూల సంస్థలకూ, ఐఎస్‌ ఉగ్రవాదులకూ చేరాయి. అటు అసద్‌ వెనక రష్యా మోహరించింది. అతడికి ఆదినుంచీ సర్వ విధాలుగా సాయం చేస్తోంది. వాస్తవానికి తాను ఈ పోరాటంలో గెలవలేనని, అసద్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడం అసాధ్యమని అమెరికాకు ఏనాడో అర్ధమైనా సౌదీ అరేబియాను సంతృప్తిపరచడం కోసం ఈ తతంగం నడుపుతూ వచ్చింది. అటు పొరుగునున్న టర్కీ సైతం కుర్దులను అణిచేసే పేరుమీద సిరియా భూభా గంలో నిప్పులు చిమ్ముతోంది. ఇజ్రాయెల్‌ కూడా అక్కడ తన వంతు విధ్వంసానికి తహతహలాడుతున్నదని కొద్దిరోజులక్రితం సిరియా సేనల దాడిలో ధ్వంసమైన ద్రోన్‌ బయటపెట్టింది.



సిరియాలో అంతర్యుద్ధాన్ని ఆపడానికి 2013లో అమెరికా, రష్యాల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు అందరూ సంతోషించారు. అక్కడి రసాయన ఆయుధాల నిల్వలను స్వాధీనపరచుకుని ధ్వంసం చేస్తానని ఆ సందర్భంగా రష్యా హామీ ఇచ్చింది. అంతవరకూ యుద్ధ సన్నాహాలు చేస్తూ వచ్చిన అమెరికా వెనక్కి తగ్గింది. కానీ ఆ ఒప్పందం ఎన్నాళ్లో నిలబడలేదు. మరికొన్ని రోజులకే అదికాస్తా ఆవిరైంది. బాధాకరమైన విషయమేమంటే ఇరుపక్షాలూ ఆహారం, మందులు తీసుకెళ్తున్న ట్రక్కులపై కూడా దాడులు చేస్తున్నాయి. విధ్వంసం జరిగాక బాధ్యులం తాము కాదంటే తాము కాదని బుకాయిస్తున్నాయి. అమెరికాలో ట్రంప్‌ ఏలుబడి మొద లయ్యాక సిరియాపై దాని వైఖరి మారింది.



లోగడ తిరుగుబాటుదార్లకు వత్తాసుగా నిలబడి అసద్‌ను కూలదోయడానికి ప్రయత్నించిన అమెరికా ఇప్పుడు రష్యాకు చేరువైంది. ఐఎస్‌ ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టడమే వారిద్దరి లక్ష్యంగా కనబడు తోంది. అమెరికా దూరమైంది గనుక తిరుగుబాటుదార్లు ఒంటరి అయినట్టే. సహ జంగానే ఈ పరిణామం అసద్‌కు ఎక్కడలేని బలాన్నీ ఇస్తున్నది. తాజా విషాదం తర్వాత అసద్‌కు వ్యతిరేకంగా ప్రకటన చేసినా, అక్కడ ఇన్నేళ్లనుంచి ఇన్ని వంద లకోట్లు ఖర్చు పెట్టాక ఒరిగిందేమిటని ట్రంప్‌ ట్వీట్లు ఇస్తున్నారు.



ఏతావాతా తమ భూభాగంపై అగ్రరాజ్యాలు ఆడిన జూదంలో సిరియా పౌరులు సర్వస్వం కోల్పో యారు. నానావిధ రూపాల్లో చుట్టుముట్టిన మృత్యువు నుంచి వారిని కాపాడే శక్తి ఇప్పుడు ప్రపంచ ప్రజానీకానికే ఉంది. దాదాపు కోటిన్నర జనాభాగా మిగిలిన ఓ చిన్న దేశంలో అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న ఈ దురంతాలపై దేశదేశాల్లోనూ బలమైన నిరసన పెల్లుబకాలి. ఈ ఘోరం ఆపడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించేలా అన్నిచోట్లా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఈ నరమేథానికి అడ్డుకట్టపడుతుంది. సిరియా మళ్లీ చిగురిస్తుంది. తాజా విషాదం ఆ దిశగా అంద రినీ కదిలిస్తుందని ఆశించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top