అద్భుత విజయం

అద్భుత విజయం


సంక్లిష్టమైన ప్రయోగాల్లో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  శాస్త్రవేత్తలు ఆ పరంపరలో మరో ముందడుగేశారు. భూ వాతావరణం లోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని ఇంధనాన్ని మండించగల స్క్రామ్ జెట్ ఇంజిన్ రూపకల్పనలో అరుదైన విజయాన్ని నమోదు చేశారు. నిజానికి ఇదొక నమూనా ప్రయోగం. ఈ సాంకేతికత పూర్తిగా పట్టుబడితే దాన్ని ఆధారం చేసుకుని భవిష్యత్తులో అంతరిక్ష రంగంలో దేశాన్ని తిరుగులేని శక్తిగా రూపొందించాలన్నది వారి సంకల్పం.


 


2030కల్లా పునర్వినియోగ వాహక నౌక(ఆర్‌ఎల్‌వీ)ను అంతరిక్షం లోకి పంపడమే లక్ష్యంగా ఇది ఇస్రో ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం. ఆ కృషిలో ఇప్పుడు తొలి అడుగు పడింది. రాకెట్‌లకూ, పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకలకు మాత్రమే కాదు... భవిష్యత్తులో ప్రయాణికులను తీసుకెళ్లడానికి ఉపయోగించే అంతరిక్ష విమానాలు, క్షిపణులవంటివాటికి కూడా ఈ సాంకేతి కతను వినియోగించడం పెద్ద కష్టం కాదు. వాస్తవానికి గత నెలలోనే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.



ధ్వని వేగానికి ఆరు రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే రెండు దశల రోహిణి 560 సౌండింగ్ రాకెట్‌కు రెండు స్క్రామ్ జెట్ ఇంజిన్‌లను అమర్చి ఈ ప్రయోగం నిర్వహించారు. భూ వాతావరణంలోని ఆక్సిజన్‌ను గ్రహించి దాన్నే ఇంధనంగా వినియోగించుకోవడం ఇందులోని విశిష్టత. భవిష్యత్తులో వినియోగించే పునర్వినియోగ వాహక నౌక దాదాపు 20,000 కిలోల బరువుండే ఉపగ్రహాలను మోసుకుపోవాల్సి ఉంటుంది. దాన్ని సాధ్యమైనంత తక్కువ వ్యయంతో...అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చుతో పోలిస్తే పదిరెట్లు తక్కువ వ్యయంతో పంపడం ఇప్పుడు ఇస్రో ముందున్న లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టం కాదని శాస్త్రవేత్తలు తాజా ప్రయోగంతో చాటి చెప్పారు. రాకెట్లు ఎన్నో టన్నుల ఇంధనాన్ని, దాన్ని మండించడానికి తోడ్పడగల ఆక్సిడైజర్లను కూడా మోసుకెళ్లక తప్పదు. ఈ రెండు కారణాలూ ఉపగ్రహాలకు పరిమితులు ఏర్పరుస్తున్నాయి. అందులో అమర్చగల పరికరాల సంఖ్యను కుదిం చక తప్పని స్థితి కల్పిస్తున్నాయి. స్క్రామ్ జెట్ ఇంజిన్లు ఆ సమస్యను అధిగమించ డానికి ఉపయోగపడతాయి.



కేవలం ఇంధనాన్ని అందజేస్తే పెను వేగంతో వెళ్లేట పుడు వాతావరణంలోని ఆక్సిజన్‌ను సంగ్రహించి దాని సాయంతో ఇంధనాన్ని సొంతంగా మండించుకోగల సామర్థ్యం స్క్రామ్ జెట్ ఇంజిన్లకు ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ సక్రమంగా సాగడానికి రాకెట్‌లో కంప్యూటర్‌ను అమర్చారు. ముందే నిర్దేశించిన ప్రోగ్రాంకు అనుగుణంగా అది ఇస్తున్న ఆదేశాలను ఇంజిన్లు పాటించి దీన్ని విజయవంతం చేశాయి. రాకెట్‌లోని తొలి దశ దూసుకెళ్లడానికి సంప్రదాయక క్రయోజెనిక్ ఇంజిన్ తోడ్పడితే రెండో దశ సక్రమంగా ముందు కెళ్లడానికి స్క్రామ్ జెట్ ఇంజిన్లు వినియోగపడ్డాయి. ఈ ప్రయోగం ద్వారా ప్రపం చంలో ఇంతవరకూ అమెరికా, రష్యాలకూ, యూరోప్ అంతరిక్ష సంస్థకూ మాత్రమే అందుబాటులో ఉన్న అత్యంతాధునిక సాంకేతికత మనకూ సాధ్యమేనని నిరూపిం చినట్టయింది. ఈ విషయంలో పురోగతి సాధించడానికి చైనా తదితర దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టు లేదు.




ఇస్రో శాస్త్రవేత్తలు మొన్న మే నెలలోనే పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్‌ఎల్‌వీ-టీడీ)ను జయప్రదంగా ప్రయోగించారు. అంతరిక్ష నౌకను పంపిన ప్రతిసారీ రాకెట్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం లేని స్థితిని ఏర్పర్చడం... స్క్రామ్ జెట్ ఇంజిన్ల వాడకానికి అనువైన ఏర్పాట్లకు సిద్ధం కావడం దీని లక్ష్యం. ఇప్పుడున్న పద్ధతిలో రాకెట్ నిర్మాణానికి బోలెడు వ్యయంతోపాటు ఎంతో సమయం కూడా అవసరం అవుతోంది. ఆర్‌ఎల్‌వీ-టీడీ ఆ రెండింటినీ ఆదా చేసేందుకు తోడ్పడే ప్రయోగం. ఒక వాహక నౌక ఉపగ్రహాన్ని అనుకున్న కక్ష్యలో ఉంచి, వెనక్కి మర లడం... మరో ప్రయోగానికి సైతం ఉపయోగపడటం ఈ సాంకేతికతలోని కీలకాంశం. ప్రస్తుత ప్రయోగం దానికి కొనసాగింపు. జూన్‌లో జరిపిన పీఎస్ ఎల్‌వీ-సీ34 ప్రయోగం కూడా ఎంతో ముఖ్యమైనది. ఉపగ్రహ వాహక నౌకతో ఒకేసారి 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం దాని విశిష్టత.



మొత్తంగా 1,288 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాలను పంపడం అంతవరకూ కేవలం అమెరికా, రష్యాలకు మాత్రమే సాధ్యమైంది. పైగా వారికంటే ఎంతో తక్కువ వ్యయంతో ఈ బహుళ ఉపగ్ర హ వాహకనౌకను మన శాస్త్రవేత్తలు పంపగలిగారు. అంతక్రితం పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ నిర్మాణాల విషయంలో సైతం వారు నమోదు చేసిన విజయాలు అపురూపమైనవి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలు సుదీర్ఘకాలంపాటు ఎవరి కంటా పడనీయని క్రయోజెనిక్ పరిజ్ఞానంలో వారు నైపుణ్యాన్ని సాధించారు. అతి శీతల స్థితిలో సైతం ఇంజిన్లను సక్రమంగా పనిచేయించడం క్రయోజెనిక్ పరిజ్ఞానంలోని కీలకాంశం. దీన్ని ఛేదించనిదే అంతరిక్షంలో ప్రగతి సాధించడం సాధ్యంకాదు. అందువల్లే ఆ పరిజ్ఞానాన్ని అగ్రరాజ్యాలు ఎవరికీ అందనీయలేదు. మన శాస్త్రవేత్తలు వారి గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టారు. దాని ఆధారంగా జీఎస్‌ఎల్‌వీపై పట్టు సాధించారు.



ఇవన్నీ అంతరిక్ష రంగంలో మన కీర్తిప్రతిష్టలను పెంచడం ఒక్కటే కాదు... దండిగా ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. ఒకపక్క ఉపగ్రహాలను పంపడానికయ్యే వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు ఇతర దేశాలు తమ తమ ఉపగ్రహాలను పంపడానికి మనవైపు చూసే స్థితిని శాస్త్రవేత్తలు కల్పించారు. అంతరిక్ష రంగంలో నమోదయ్యే విజయాలు బహుళ రంగాల్లో అభివృద్ధి సాధించడానికి తోడ్పాటునందిస్తాయి. స్వావలంబనకు బాటలు పరిచి అగ్ర రాజ్యాలపై ఆధారపడే స్థితిని తొలగిస్తాయి. ఆదివారం జరిగిన ప్రయోగం పద కొండేళ్ల శ్రమ ఫలితం. ఈ సాంకేతికతను సాధించడానికి మన శాస్త్రవేత్తలు ఈ కాలంలో పెట్టిన వ్యయం రూ. 35 కోట్లు మాత్రమే. కానీ అది వినియోగంలోకొస్తే దేశానికి వందల కోట్లు ఆదా అవుతాయి. వేలకోట్ల రాబడి వస్తుంది. మన శాస్త్రవేత్తలు ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని నమోదు చేయాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top