ఎట్టకేలకు హెచ్‌ఐవీ బిల్లు

ఎట్టకేలకు హెచ్‌ఐవీ బిల్లు - Sakshi


దాదాపు రెండు దశాబ్దాలుగా సామాజిక, ఆరోగ్య కార్యకర్తలు ఎదురుచూస్తున్న హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌(నివారణ, నియంత్రణ) ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదించింది. ఇది చట్టసభల మెట్లెక్కి చట్టంగా మారితే ఆ రోగాల బారిన పడినవారి విషయంలో వివక్ష చూపించేవారిపై కఠిన చర్యలుం టాయి. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగులకు వైద్యం నిరాకరించినా... విద్యాసంస్థల్లో, పనిచేసే స్థలాల్లో వారిని రానీయకపోయినా రెండేళ్ల వరకూ జైలు శిక్ష, గరిష్టంగా లక్ష రూపాయల జరిమానా విధించేందుకు ముసాయిదా బిల్లు వీలు కల్పిస్తోంది. బిల్లు అవసరం గురించి ఎన్నో ఏళ్లనుంచి డిమాండ్‌ ఉంది.



మన చట్టసభల్లో చోటు చేసుకుంటున్న దురదృష్టకర పరిణామాల వల్ల కావొచ్చు... మన ప్రభుత్వాల్లో ఉండే నిర్లిప్త ధోరణులవల్ల కావొచ్చు ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశాలకు సంబంధించిన బిల్లుల ప్రక్రియ నత్తనడకనే ఉంటుంది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది. బిల్లు ప్రవేశపెట్టాలంటూ దేశంలో అనేకచోట్ల ఉద్యమాలు సాగాయి. ఎంతో తాత్సారం తర్వాత 2006లో బిల్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత పురోగతి లేదు. చివరకు ఎనిమిదేళ్లు గడిచాక 2014 ఫిబ్రవరిలో రాజ్యసభ ముందుకొచ్చినా ఆంధ్ర ప్రదేశ్‌ విభజనపై పార్లమెంటు రణరంగంగా మారి ఇదికాస్తా మూలనబడింది. మరో రెండున్నరేళ్ల జాప్యం తర్వాత ఇప్పుడు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.



ఎయిడ్స్, హెచ్‌ఐవీ వ్యాధులు రెండూ మూడు దశాబ్దాల క్రితం మన దేశంలో అడుగుపెట్టాయి. మొట్టమొదటి కేసు చెన్నై నగరంలో 1986లో వెల్లడైనప్పుడు అది దేశాన్ని ఎంతగా కుదిపివేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటికి అయిదేళ్ల ముందు నుంచీ అది పాశ్చాత్య ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాలో విమానం బయల్దేరబోతుండగా అందులో ఎయిడ్స్‌ రోగి ఉన్నాడని తెలిసి తోటి ప్రయాణికులంతా అక్కడినుంచి పరుగులెట్టడం, అతన్ని దించేసినా అందులో ప్రయాణించడానికి నిరాకరించడం ఎవరూ మరిచిపోరు. 1985లో అప్పటి హాలీ వుడ్‌ ప్రముఖ నటుడు రాక్‌ హడ్సన్‌ ఎయిడ్స్‌ బారినపడి మరణించినప్పుడు ప్రపంచమంతా దిగ్భ్రాంతికి లోనయింది.



బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్న మన దేశంలో హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌ తలెత్తే సమస్యేలేదని సంప్రదాయవాదులు ప్రగాఢంగా నమ్ముతుండగా చెన్నై ఉదంతం అందరినీ హడలెత్తించింది. అజ్ఞానమే భయానికి కారణం అంటారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ల గురించి ఇప్పుడు ఎంతో సమా చారం ఉన్నా, అవి ఈమధ్య కాలంలో తగ్గుముఖం పడుతున్న సూచనలు కని పిస్తున్నా... వాటి గురించిన అజ్ఞానం సమాజం నుంచి ఇంకా విరగడ కాలేదు. ఆ రోగాల బారిన పడినవారి విషయంలో అమానుషంగా ప్రవర్తించడం ఆగలేదు. ఈ వివక్షను అరికట్టే  చట్టమేదీ లేకపోవడంతో వ్యాధిగ్రస్తులకు, వారి కుటుంబాలకు కనీస మానవ హక్కులు కూడా దక్కడం లేదు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల హక్కుల రక్షణ విషయంలో మన కన్నా ఎంతో ఆలస్యంగా బిల్లుల రూపకల్పన ప్రక్రియ ప్రారంభించిన అనేక దేశాలు దాదాపు పదేళ్లక్రితమే వాటిని చట్టాలుగా మార్చుకోగలిగాయి. మనం మాత్రం తిరిగి తిరిగి మొదలైన చోటికే వస్తున్నాం.



ఈ వ్యాధిగ్రస్తుల స్థితిగతులెలా ఉన్నాయో అనేక స్వచ్ఛంద సంస్థలు పలు మార్లు వెలుగులోకి తీసుకొచ్చాయి. దేశంలో ఉన్న 21 లక్షలమంది హెచ్‌ఐవీ వ్యాధి గ్రస్తుల్లో 40 శాతంమంది మహిళలు కాగా, 6.54 శాతంమంది పదిహేనేళ్లలోపు పిల్లలు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువ. వ్యాధిగ్రస్తుల్లో 55 శాతంమంది ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు. వీరికి ఇళ్లు అద్దెకివ్వరు. పిల్లలు బడికెళ్లే అవకాశం ఉండదు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు కూడా వీరిని ప్రమాదకారులుగా పరిగణిస్తారు. హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకొస్తేనే ఉద్యోగం ఇస్తామని చెప్పే సంస్థలున్నాయి. బీమా సంస్థలు ఈ రోగులకు పాలసీలు ఇవ్వడానికి నిరాకరిస్తాయి. లేదా అధిక మొత్తంలో ప్రీమియం వసూలు చేస్తాయి. బిల్లు ఇలాంటి ధోరణులను అరికడుతుంది. స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఈ రోగాల బారిన పడినవారికి వైద్యసాయం అందించేవి. వీరికి జరిగే అన్యాయాలపై పోరా డేవి. అయితే ఎన్‌డీఏ సర్కారు వచ్చాక అంతర్జాతీయంగా వచ్చే విరాళాల విష యంలో ఆంక్షలు విధించడంవల్ల కొన్ని సంస్థల కార్యకలాపాలు తగ్గిపోయాయి.  



ఈ వ్యాధిగ్రస్తులపై కొనసాగుతున్న వివక్ష గురించి ఇన్నాళ్లుగా ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పలేం. ఈ రంగంలో పనిచేస్తున్న సంస్థలు లేదా వ్యక్తులు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినప్పుడు కొంత ఆలస్యమైనా స్పందించడం, కార్యనిర్వాహకపరమైన ఆదేశాలివ్వడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఒక సమగ్రమైన చట్టం లేని లోటు అడుగడుగునా కనబడుతూనే ఉంది. బాధితులకు తమ హక్కులేమిటో తెలియపోవడం,  కనీస మానవత్వంతో మెలగాలన్న స్పృహ చుట్టూ ఉండేవారిలో లోపించడం సమస్యగా మారింది. ఇప్పుడు రూపొందిన బిల్లు చట్టమైతే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇందులో కొన్ని సమస్యలూ ఉన్నాయి. వ్యాధిగ్రస్తులకు ఉచితంగా, సంపూర్ణ వైద్యం లభించేలా చర్యలు తీసుకోవడం విషయంలో బిల్లు అస్పష్టంగా ఉంది. ‘సాధ్యమైనంతవరకూ...’ప్రభుత్వం చికిత్స అందిస్తుందన్న మాట తప్పించుకోవడానికే అవకాశమిస్తుంది.



వ్యాధిగ్రస్తుల్లోని మహిళలకు ప్రత్యేకంగా సమస్యలుంటాయని బిల్లు గుర్తించినట్టు కనబడదు. కండోమ్‌ల వాడకం గురించి చెప్పడం, పిల్లల్ని కనొద్దని సలహానీయడం తప్ప తల్లులు కాదల్చుకున్నవారికి లేదా లైంగిక నేరాలబారిన పడి గర్భిణులైనవారికి అవసరమైన చికిత్సల గురించి ఎవరూ మాట్లాడరు. బిల్లు సైతం ఈ విషయంలో మౌనంవహించింది. క్యూబా వంటి దేశాల్లో హెచ్‌ఐవీ తల్లులు  సంపూర్ణారోగ్యంతో ఉండే శిశువులను కనడానికి, పెంచడానికి వీలునిచ్చే ఔషధాలు లభిస్తున్నాయి. అలాంటివి ఇక్కడ సైతం అందుబాటులో ఉంచేందుకు చర్యలుండాలి. రాగల కాలంలో ఈ బిల్లులోని అంశాలపై మరింత కూలంకషంగా చర్చ జరిగి లోపాలను పరిహరిస్తే... అది సాధ్యమైనంత త్వరగా చట్టంగా మారితే ఆ వ్యాధిగ్రస్తులకు ఊరట దొరుకుతుంది. వారికి మెరుగైన జీవితం లభిస్తుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top