Alexa
YSR
‘పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సంపాదకీయంకథ

తెలివైన నిర్ణయం

Sakshi | Updated: June 20, 2017 01:58 (IST)
తెలివైన నిర్ణయం

రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను సోమవారం ప్రకటించి ఎన్‌డీఏ పక్షాలనే కాదు.. బీజేపీ శ్రేణులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆశ్చర్యపరిచారు. దీంతో దాదాపు నెలరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. మూడేళ్లక్రితం ఎన్‌డీఏ అధికారంలో కొచ్చిన కొత్తలో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అడ్వాణీ పేరు వినబడినా అదంతా మరుగున పడి చాలా కాలమైంది. ఈమధ్య ఎవరెవరి పేర్లో మీడియాలో షికారు చేశాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ మొదలుకొని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ము వరకూ పలువురు తెరపైకి వచ్చారు.

అభ్యర్థి ఎంపిక కోసం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడులతో కమిటీ ఏర్పాటు చేసినా దాని పాత్ర నామమాత్రమని అందరికీ తెలుసు. ఎవరి ఊహకూ అందని విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో తమకెవరూ సాటిరారని కోవింద్‌ ఎంపిక ద్వారా మోదీ, అమిత్‌ షా మరోసారి నిరూపించారు. అభ్యర్థి ఎవరో ముందుగా చెబితే... ఆ వ్యక్తి తమకు ఆమోద యోగ్యమైతే ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని దాదాపు నెల్లాళ్లక్రితం 18 విపక్షాలు సమావేశమై ప్రకటించాయి. ఈమధ్య కేంద్రమంత్రులు కలిసినప్పుడు కూడా ఆ పక్షాల నేతలు అదే మాట చెప్పారు. కానీ ఈ విషయంలో ఎవరినీ సంప్రదించ దల్చుకోలేదని ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడం ద్వారా బీజేపీ స్పష్టం చేసింది.

కోవింద్‌ ఎంపిక రాజకీయంగా విపక్షాలకు గత్యంతరం లేని స్థితిని ఏర్పరి చిందన్నది వాస్తవం. ఆ పదవికి కావాల్సిన అపార రాజకీయ అనుభవంతోపాటు అన్ని అర్హతలూ కోవింద్‌కు పుష్కలంగా ఉన్నాయి.  పైగా ఆయన దళిత కులాల్లో అల్పసంఖ్యాకులుగా ఉన్న వర్గానికి చెందినవారు. కనుకనే బీజేపీ ప్రకటన వెలువడ్డాక విపక్షాలకు చెందిన నాయకులెవరూ మరో మాట చెప్పలేకపోయారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, షీలా దీక్షిత్‌లాంటివారైతే ఆయన ఎంపిక మంచి నిర్ణయమని ప్రశంసించారు.

మరో మూడు రోజుల్లో సమావేశమై తమ వైఖరిని చెబుతామని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్‌ కాలేజిలో మొత్తం 10,98,903 ఓట్లుంటే దాదాపు 5,90,000 ఓట్లు ఎన్‌డీఏ ఖాతాలో ఉన్నాయి. రాష్ట్రపతి పదవి వంటి అత్యున్నత పీఠానికి ఏకగ్రీవ ఎన్నికైతేనే మంచిదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తొలుత ప్రకటించి, గెలుపు అవకాశమున్న ఎన్‌డీఏకే మద్దతునిస్తామని తెలిపింది. తెలంగాణలో పాలకపక్షమైన టీఆర్‌ఎస్‌ కూడా ఎన్‌డీఏకు మద్దతునిస్తున్నట్టు చెప్పింది. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ సైతం గత నెలలో మోదీని కలవడానికి ఢిల్లీ వచ్చినప్పుడు ఏకగ్రీవ ఎన్నికే అన్నివిధాలా మంచిదని చెప్పడం మరవకూడదు.

కోవింద్‌ ఎంపికతో కాంగ్రెస్‌ మీరాకుమార్‌ లేదా మరో దళిత నేతను ప్రతి పాదించవచ్చునని కథనాలు వెలువడుతున్నాయి. సిద్ధాంతపరంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే వామపక్షాలు అలాంటి ప్రతిపాదన వస్తే ఆమోదించే అవకాశం కూడా లేకపోలేదు. బిహార్‌కు చెందిన మీరాను ఎంపిక చేస్తే అదే రాష్ట్రానికి చెందిన జేడీ(యూ) వైఖరి ఎలా ఉంటుందో తెలియదు. పోటీ పడటం అన్నది ప్రజాస్వామిక సంప్రదాయమే. ఆ విషయాన్ని ఎవరూ కాదనరు. కానీ కోవింద్‌ లాంటి యోగ్యుడైన అభ్యర్థిని కాదనడం...కేవలం పోటీ కోసం పోటీ అన్నట్టు వ్యవహరించడం వాటి ప్రతిష్టను పెంచవు. రాజకీయంగా సైతం మంచి నిర్ణయం అనిపించుకోదు.

రాష్ట్రపతి పదవికి దళితుణ్ణి ఎంపిక చేయడంలోనే మోదీ, అమిత్‌షాల రాజకీయ చతురత వెల్లడవుతుంది. గత మూడేళ్లుగా అక్కడక్కడా చోటుచేసుకుంటున్న ఘట నలు బీజేపీకి ఇబ్బంది కలిగిస్తున్నాయన్నది వాస్తవం. హైదరాబాద్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య మొదలుకొని గుజ రాత్‌లోని ఉనా వరకూ జరిగిన ఎన్నో ఉదంతాలు ఆ పార్టీని దళిత వ్యతిరేకి అన్న అభిప్రాయం కలగజేయడానికి ఆస్కారమిచ్చాయి. ఎన్నో సందర్భాల్లో మోదీ స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడలేదు.

ఇలాంటి సమయంలో దేశంలో అత్యున్నత పదవికి దళితుణ్ణి, అందులోనూ ఆ వర్గాల్లో అల్పసంఖ్యాక కులానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం ద్వారా తాము దళితుల కోసం పాటు పడుతున్నామన్న సందేశం పంపినట్టయింది. పైగా ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పర్చిన ఉత్తరప్రదేశ్‌లో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ బలాన్ని సుస్థిరపరచుకోవడం, దళిత వర్గాల్లో మరింత పట్టు సాధించడం బీజేపీకి ప్రధానం. బీజేపీలోనే అందరికీ పరిచితులైన దళిత నాయకులు అనేకమంది ఉన్నారు. కానీ వారిలో కోవింద్‌ని ఎంపిక చేయడం ద్వారా సొంత ముద్ర ఉండేలా మోదీ, అమిత్‌షా చూసుకోగలిగారు.

కోవింద్‌ అనామకుడనీ, ఎవరికీ తెలియదని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. అందులో అవాస్తవమేమీ లేదు. రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా, అనేక పార్ల మెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించినా, 2002లో ఐక్యరాజ్యసమితిలో మన దేశ ప్రతినిధిగా పాల్గొన్నా, బీజేపీ దళిత మోర్చా జాతీయాధ్యక్షుడిగా పనిచేసినా, రెండేళ్లక్రితం బిహార్‌ గవర్నర్‌గా నియమితులైనా రాజకీయ నాయకుల్లో సైతం చాలామందికి ఆయన గురించి తెలియదు. నిత్యం వార్తల్లో ఉండాలని కోరుకునే రాజకీయ రంగంలో కోవింద్‌లాంటివారు అరుదు.

ఆయన మీడియా ముందు కొచ్చిన సందర్భాలు దాదాపు లేవు. కానీ అందుకే ఆ పదవికి ఆయన అనర్హుడని వాదించడం విజ్ఞత అనిపించుకోదు. నిజానికి ప్రతిభాపాటిల్‌ను కాంగ్రెస్‌ నాయ కత్వం రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసినప్పుడు ఆమె గురించి కూడా ఎవరికీ తెలియదు. ఇవన్నీ పక్కనబెడితే తొలిసారి కేఆర్‌ నారాయణన్‌ని రాష్ట్రపతి చేయ డంతోపాటు రెండోసారి సైతం ఆ పదవికి దళితుణ్ణి ఎంపిక చేసిన ఘనత బీజేపీ దక్కించుకుంది. కోవింద్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించడం ద్వారా విపక్షాలు సత్సం ప్రదాయం నెలకొల్పితే మంచిదే.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

డీప్‌..డీప్‌..డిప్రెషన్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC