ఎన్నాళ్లీ దగా?!

ఎన్నాళ్లీ దగా?! - Sakshi


రాను రాను దేశంలో సేద్యం చేయడమే నేరమన్నట్టు తయారవుతోంది. సాగు నిమిత్తం అప్పు కోసం దేబిరించడంతో మొదలుపెట్టి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వరకూ నానా అగచాట్లూ పడి...ఎలాగోలా పంటలు పండిస్తుంటే చివరకు దళారులు, వ్యాపారులు విపణి వీధిలో గూడుపుఠాణి కట్టి రైతుల నెత్తురు పీల్చేస్తున్నారు. ఏటా ఇదే తంతు నడుస్తున్నా పాలకులకు పట్టదు. ఈ నిర్లక్ష్యానికి ఈసారి మిర్చి రైతులు బలయ్యారు. పసుపు, పత్తి రైతులు సైతం ఇలాంటి స్థితిలోనే ఉన్నారని వార్తలొస్తున్నాయి.



ఫిబ్రవరి నుంచి మార్కెట్‌లకు మిర్చి రాక మొదలై అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ నెలకల్లా అది మరింతగా హెచ్చింది. మొదట్లో క్వింటాల్‌కు దాదాపు రూ. 10,000 వరకూ ఉన్న మిర్చి ధర కాస్తా నానాటికీ క్షీణిస్తూ రూ. 2,000 వరకూ చేరుకున్నాక...రైతుల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాక  కేంద్ర ప్రభుత్వం తీరిగ్గా బుధవారం మద్దతు ధర నిర్ణయిస్తూ ప్రకటన చేసింది.



క్వింటాల్‌కు రూ. 5,000 మద్దతు ధర, రవాణా, ఇతర ఖర్చుల కోసం రూ. 1,250 చెల్లించాలని నిర్ణయించింది. పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఈ ధర వాస్తవానికి సరిపోదు. అయినా ఇప్పటికే పలువురు రైతులు అయినకాడికి అమ్ముకుని కన్నీళ్లతో ఇళ్లకు వెళ్లారు. కనీసం కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని అనేకులు మొత్తుకున్నారు. ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు పంటను వెనక్కు తీసుకెళ్లడం కూడా దండగని  మిర్చి బస్తాలను తగలబెట్టుకున్నారు. రైతన్నలు ఆగ్రహించి తిరగబడటంతో తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ అక్షరాలా రణరంగమైంది.



వారి ధాటికి అక్కడి కార్యాలయాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్, కాంటాలు ధ్వంసమయ్యాయి. దాదాపు రూ. 8 కోట్ల నష్టం వాటిల్లింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం మిర్చి రైతులు విలవిల్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు గోడు పట్టని నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి  ఈనెల 1,2 తేదీల్లో గుంటూరులో నిరశన దీక్ష చేయాల్సివచ్చింది. ఫలితంగా మిర్చికి మద్దతు ధర ప్రకటించక తప్పలేదు.



పంటకు అధిక ధర వచ్చినప్పుడు సంతోషించినట్టుగానే రేటు పడిపోయినప్పుడు తట్టుకునేలా కూడా ఉండాలని రైతన్నలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సుభాషితాలు చెబుతున్నారు. కానీ పాలకుడిగా తన కర్తవ్యమేమిటో,  రైతును కాపాడటమెలాగో మాత్రం ఆయనకు తెలియదు. అరుదుగా ఎప్పుడో మంచి ధర రావడం తప్ప ఏనాడైనా సాగు గిట్టుబాటైన సందర్భం ఉందా? వడ్డీలకు వేలకు వేలు అప్పుచేసి వ్యవసాయం చేస్తున్న రైతుకు తన వంతుగా ఆయన ఈ మూడేళ్లలోనూ చేసిందేమిటి? ఎన్నికల ప్రచారం సమయంలో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి దగా చేశారు. కనీసం రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పరుస్తామన్న వాగ్దానం అమలుచేసినా మిర్చి రైతులకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు.



ఆ నిధి సంగతలా ఉంచి మొన్న జనవరి నుంచి మార్కెట్‌లో ఎలాంటి ధోరణులు కనబడుతున్నాయో, మిర్చి రేటు ఎలా పడిపోతున్నదో తెలుస్తూనే ఉంది. ఎన్ని ఎకరాల్లో పంట వేశారో, ఎంత దిగుబడి వస్తుందో ప్రభుత్వాల వద్ద గణాంకాలుంటాయి. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఎలాంటి గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదో అంచనా వేసుకోవద్దా? వాటిని గమనంలోకి తీసుకుని అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావద్దా? తన వంతుగా చేయాల్సింది చేయకుండా ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతన్నపైనే తప్పంతా నెట్టి తాను తప్పించుకునే ప్రయత్నం చేయడం అనైతికం, అన్యాయం కాదా? కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి దాదాపు రూ. 300 కోట్లు ఖర్చుచేసి 20 లక్షల క్వింటాళ్ల మిర్చి కొంటామని, ఒక్కో రైతుకు రూ. 1,500 సాయం అందుతుందని గత నెల 20న ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ 13 రోజుల లెక్కలూ తీస్తే కేవలం 11మంది రైతులకు మాత్రమే ఆర్ధిక సాయం అందిందని తేలింది. ఈ ప్రచారాన్ని సాకుగా తీసుకుని వ్యాపారులు మాత్రం ధర మరింత తగ్గించి రైతును ముంచేశారు.   



తెలంగాణ ప్రభుత్వం సైతం రైతును ఆదుకోవడంలో విఫలమైంది. వచ్చే ఏటికల్లా కొత్త మార్కెటింగ్‌ చట్టం తీసుకొస్తామని, రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతును దగా చేసే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేయాలన్న ఆలోచన ఉన్నట్టు కూడా చెబుతున్నారు. మంచిదే. కానీ నాలుగు నెలలుగా మార్కెట్‌లో అయోమయ పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోవడంలో ఎందుకు విఫలమైనట్టు? కనీసం ఖమ్మం మార్కెట్‌ ఉదంతం తర్వాతనైనా రైతులు ఆగ్రహాన్ని గమనించి దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోలేదు? అది లేకపోగా అక్కడ జరిగిన విధ్వంసమంతా రాజకీయ పక్షాల డ్రామాగా కొట్టిపారేయడం ఏం న్యాయం? ఉభయ తెలుగు రాష్ట్రాలూ తమ వంతు ప్రయత్నాలు చేయలేదు సరిగదా రైతులకు సంఘీభావం ప్రకటించబోయినవారిపై బురదజల్లే ప్రయత్నం చేశాయి.  



మిర్చి రైతుల సమస్యలింకా పరిష్కారం కాకుండానే పసుపు, పత్తి రైతుల కడగండ్లు మొదలయ్యాయి. వాటి విషయంలో ప్రభుత్వాలు మేల్కొనేదెప్పుడో? విత్తినప్పుడే పంట మద్దతు ధర నిర్ణయించడం, దిగుబడి వచ్చాక ఆ ధరకు కొనుగోలు చేయడం కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. మన దగ్గర మాత్రం ప్రతి ఏటా రైతు దగా పడుతున్నాడు. మోసపోతున్నాడు. ఈ నష్టం ఏటా మూడు లక్షల కోట్ల రూపాయలుంటుందని ఒక అంచనా. అయినా ప్రభుత్వాలు సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి...సకాలంలో, సహేతుకమైన మద్దతు ధరలు ప్రకటించి ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలి. ఈ జడత్వాన్ని విడనాడకపోతే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top