మెరుగైన జట్టే గెలిచింది

ఆస్ట్రేలియా జట్టు విజయోత్సాహం - Sakshi


సంపాదకీయం


 వందకోట్లకుపైగా స్వప్నాలు భగ్నమైన సందర్భమిది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత జట్టు కనీసం సెమీఫైనల్‌కు చేరినా గొప్పే అనుకున్నవాళ్లూ లేకపోలేదు. ఆ రోజు పరిస్థితి అంత దారుణంగా ఉంది. ముక్కోణపు టోర్నీలో ఘోర వైఫల్యాలు, అన్ని విభాగాల్లో తడబాటుతో అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడింది. నిజానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పిచ్‌లపై ఉపఖండ జట్టు టైటిల్ గెలవాలను కోవడం అత్యాశే. అయినా ఐసీసీ పుణ్యమాని డ్రాప్‌ఇన్ పిచ్‌లు ఎదురవడంతో భారత్‌కు సగం తలనొప్పి తగ్గింది. దీనిని బాగా ఉపయోగించుకుంటూ ఒక్కసారిగా బలమైన జట్టుగా మారింది. ఏదో టానిక్ తాగినట్లు ప్రతి మ్యాచ్‌లోనూ అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఆటతీరు చూపించారు. సెమీస్‌లో ఆస్ట్రేలియా ఎదురైనా అవలీలగా గెలవగలమనే ధీమాను కల్పించారు. కానీ దురదృష్టం... ఈ ఒక్క మ్యాచ్‌తోనే పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయి.

 

 ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోని టాస్ ఓడిపోగానే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుంటే తొలుత బ్యాటింగ్ చేయడమే మేలు. ధోని టాస్ గెలిచి భారత్ ముందు బ్యాటింగ్ చేసుంటే సెమీస్ ఫలితం మరోలా ఉండేదేమో! ఒత్తిడి లేకపోతే భారత బ్యాట్స్‌మెన్ 300 పరుగులు అలవోకగా చేయగలరని ఈ టోర్నీలో చాలాసార్లు నిరూపించారు. ఆసీస్ 300 పరుగులు దాటగానే భారత్ ఒత్తిడిలోకి వెళ్లింది. క్రికెట్‌లో ఒత్తిడిది చాలా కీలక పాత్ర. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ అంటే ఇది రెట్టింపవుతుంది. భారత జట్టు లక్ష్యఛేదనలో తొలి గంట బాగా ఆడింది. కోట్లాది మందిలో ఆశలు పెంచింది. కానీ ఒత్తిడికి చిత్తయింది. 40 రోజుల పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించిన... ప్రత్యర్థులపై ఆకలిగొన్న పులుల్లా విరుచుకుపడిన బ్యాట్స్‌మెన్ కీలక సమయంలో గాడితప్పారు.

 

 ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. సచిన్, సెహ్వాగ్, యువరాజ్ లాంటి సీనియర్ క్రికెటర్లు లేకుండా యువరక్తంతో బరిలోకి దిగింది. గత ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులు నలుగురు ధోని, రైనా, అశ్విన్, కోహ్లి మాత్రమే ఈసారి జట్టులో ఉన్నారు. మిగిలిన వాళ్లందరికీ ఇదే తొలిసారి. అయినా ఆ అనుభవలేమి ఆటతీరులో కనిపించకపోవడం విశేషం. ఈ యువ క్రికెటర్లందరికీ ఈ టోర్నీ ఓ గొప్ప అనుభవం. విదేశీ గడ్డపై భారత బౌలర్లు ముఖ్యంగా పేసర్లు రాణించలేరనేది చాలా కాలంగా ఉన్న విమర్శ. ఈసారి భారత పేస్ త్రయం షమీ, ఉమేశ్, మోహిత్ కలిసి ఇది తప్పని నిరూపించారు. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా భారత బౌలర్లు వరుసగా ఏడు మ్యాచ్‌లలో భిన్న ప్రత్యర్థుల్ని ఆలౌట్ చేశారు. ఇందులో స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాల పాత్ర కూడా మరవలేం. బౌలింగ్ పరంగా ఈ ప్రపంచకప్ భవిష్యత్ మీద ధీమా పెంచింది. అదేవిధంగా ఫీల్డింగ్‌లోనూ భారత్ చాలా మెరుగ్గా కనిపించింది.

 

 ఆట అన్నాక ఒక జట్టు ఓడాల్సిందే. రెండు మంచి జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎక్కడా చిన్న తప్పు కూడా చేయని జట్టే ముందంజ వేస్తుంది. ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించింది. భారత్ కంటే మెరుగ్గా ఆడింది. ఫైనల్‌కు చేరడానికి తనకు పూర్తి అర్హత ఉన్నదని నిరూపించింది. గత ప్రపంచకప్‌లతో పోలిస్తే ఈసారి టోర్నీ అభిమానులను విశేషంగా ఆకర్షించింది. పరుగులు ప్రవాహంలా రావడంతో మ్యాచ్‌లన్నీ హోరాహోరీగా సాగాయి. పిచ్‌ల స్వభావంలో మార్పుతో పాటు... ఫీల్డింగ్ నిబంధనల కారణంగా బ్యాట్స్‌మెన్ రాజ్యంగా వన్డే క్రికెట్ మారింది. ఈసారి ప్రపంచకప్ దీనికి వేదికగా కనిపించింది. మరోవైపు చిన్న జట్లు కూడా టోర్నీలో ఆకట్టుకున్నాయి. ఐర్లాండ్ చివరి మ్యాచ్ వరకూ నాకౌట్ రేసులో నిలబడితే... బంగ్లాదేశ్ ఏకంగా క్వార్టర్స్‌కు చేరింది. అఫ్ఘానిస్తాన్, యూఏఈలాంటి జట్లు కూడా ఆకట్టుకున్నాయి. అయితే వచ్చేసారి నుంచి ప్రపంచకప్‌లో పది జట్లే ఉంటాయనే వార్త వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చిన్న జట్లకు ఇదే చివరి ప్రపంచకప్ అనే సందేహం కూడా ఉంది.

 ఇక పెద్ద జట్ల విషయానికొస్తే టోర్నీ ఆరంభంలో సెమీస్‌కు చేరతాయని భావించిన నాలుగు జట్లే అక్కడి దాకా వచ్చాయి. ఎప్పుడూ టైటిల్ గెలవని ఇంగ్లండ్ ఈసారి అత్యంత ఘోరంగా లీగ్ దశలోనే నిష్ర్కమించింది. ఇక దక్షిణాఫ్రికా సెమీస్‌లో హోరాహోరీగా పోరాడి న్యూజిలాండ్ చేతిలో ఓడినా... అభిమానుల మనసులు గెలిచింది. మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ ఇంకా తమ క్రికెట్ గాడిలో పడలేదని ఈ టోర్నమెంట్ ద్వారా నిరూపించింది. క్రికెట్ అనేది జట్టుగా ఆడాల్సిన ఆట. వ్యక్తుల మీద ఆధారపడితే విజయాలు రావు. క్రిస్‌గేల్ లాంటి వ్యక్తి మీద ఆధారపడ్డ కరీబియన్లు మరోసారి దెబ్బతిన్నారు. ఇక దాయాది పాకిస్తాన్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్ చేతిలో ఓడింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని దక్షిణాఫ్రికాకూ షాకిచ్చింది. కానీ క్వార్టర్స్‌లో ఆసీస్ జోరుకు తలవంచక తప్పలేదు. ఈ ప్రపంచకప్ తర్వాత ఎంతో మంది గొప్ప క్రికెటర్లు ఆటకు దూరం అవుతున్నారు. శ్రీలంక దిగ్గజాలు సంగక్కర, జయవర్ధనేలతో పాటు పాక్ క్రికెటర్లు మిస్బా, ఆఫ్రిది కూడా తమ ఆఖరి వన్డే మ్యాచ్ ఆడేశారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా ఈ టోర్నీ కొత్త పుంతలు తొక్కింది. మూడో అంపైర్‌తో మైదానంలోని అంపైర్ మాట్లాడే సంభాషణను కూడా ఈసారి టీవీ ప్రేక్షకులు వినగలిగారు.

 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి రెండు ఆతిథ్య జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ ఆదివారం జరగబోతోంది. 1987 తర్వాత ఫైనల్‌లో ఆసియా జట్టు లేకపోవడం ఇదే ప్రథమం. ఈ మధ్యలో జరిగిన ప్రతి టోర్నీలోనూ ఏదో ఒక ఆసియా జట్టు తుది సమరానికి వచ్చింది. కంగారూలకు ప్రపంచకప్ కొత్త కాదు. ఇప్పటికే రికార్డు స్థాయిలో నాలుగుసార్లు గెలిచింది. కానీ న్యూజిలాండ్ ఫైనల్‌కు రావడం ఇదే తొలిసారి. ఫామ్, బలం పరంగా రెండు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి కివీస్, ఆసీస్‌ల ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top