హితోక్తులు వింటారా?!

హితోక్తులు వింటారా?! - Sakshi


మానవాళిని కలవరపరుస్తున్న భూతాపోన్నతిపై ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా ముందుకు కదలాల్సిన ఆవశ్యకత కనిపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టినట్టు నిర్మొహమాటంగా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు సంపన్న దేశాలు అదనపు బాధ్యత తీసుకోనట్టయితే, ఏకపక్ష చర్యలకు పూనుకుంటే సమస్యలు ఎదురవుతాయని పారిస్‌లో ప్రారంభమైన వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన సరిగానే హెచ్చరించారు. సంపన్న దేశాలకు కాసుల కాంక్షే తప్ప పర్యావరణ పరిరక్షణ ధ్యాస ఏరోజూ లేదు. శిలాజ ఇంధనాలను ఎడాపెడా వాడుతూ... ఆ క్రమంలో విడుదలయ్యే కర్బన ఉద్గారాల గురించి అవి పట్టించుకోలేదు.


 


కాలుష్యం పర్యవసానంగా భూగోళానికి ముప్పు ముంచుకొస్తున్నదని... రాగల కాలంలో సముద్ర మట్టాలు పెరిగి ముంబై, కోల్‌కతా, ఢాకా వంటి నగరాలన్నీ మునుగుతాయని ఆమధ్య ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్ ప్రభుత్వ బృందం (ఐపీసీసీ) నివేదిక హెచ్చరించింది. గత నెలలో విడుదలైన ఒక స్వచ్ఛంద సంస్థ నివేదిక సైతం నిష్టుర సత్యాలను వెల్లడించింది. ఉష్ణోగ్రత మరో నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకుపైగా జనం ఉంటున్న ప్రాంతాలన్నీ సముద్రాల్లో కలిసిపోతాయని ఆ సంస్థ హెచ్చరించింది.


 


ఇందులో మన దేశానికి చెందిన తీరప్రాంత వాసులు అయిదున్నర కోట్లమంది కూడా ఉంటారు. వాస్తవానికి ఇదెవరో పరిశోధన చేసి చెప్పాల్సిన అంశం కూడా కాదు. అందుకు సంబంధించిన ఛాయలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. మండు వేసవిలో తుఫాన్లు, వరదలు... చలిపులి చంపుకు తినే శీతాకాలంలో భానుడి భగభగలు... వట్టిపోతున్న వానాకాలం మనల్ని దిగ్భ్రాంతిపరుస్తున్నాయి. ఎడారులు విస్తరిస్తున్నాయి. సముద్రాలు వేడెక్కుతున్నాయి. అడవులు కార్చిచ్చులబారిన పడుతున్నాయి. హిమనదాలు కరుగుతున్నాయి.  ఇవన్నీ మానవాళికి ప్రకృతి చేస్తున్న హెచ్చరికలు. వాటిని గుర్తించి సరిచేసుకోవడమా, నాశనం కావడానికి సిద్ధం కావడమా అన్నది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో కూడా సంపన్న దేశాలు కుటిల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. తమ బాధ్యతలనుంచి తప్పుకోవడానికి తోవలు వెదుక్కుంటున్నాయి.


 


పారిస్‌లో ఈ నెల 11 వరకూ కొనసాగే శిఖరాగ్ర సదస్సు ముందు బృహత్తర కర్తవ్యాలున్నాయి. పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకంటే 2 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలన్నది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఇదంతా 2100 నాటికి సాధించాలని, అందుకోసం అన్ని దేశాలూ సమష్టిగా కదలాలని అనుకున్నారు. అయితే ఆ లక్ష్యాన్ని నీరుగార్చేందుకు సంపన్న దేశాలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. పారిస్ శిఖరాగ్ర సదస్సుకు ముందే ఈ ఎత్తుగడలు మొదలైపోయాయి. పారిస్‌లో రేపన్నరోజున వైఫల్యాలు ఎదురైతే అందుకు పూర్తి బాధ్యతను భారత్‌పై నెట్టి తప్పుకోవాలని అమెరికా భావిస్తున్నదని నాలుగురోజుల క్రితమే నిపుణులు హెచ్చరించారు.


 


వాతావరణ సదస్సులో భారత్ ఒక సవాలుగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వ్యాఖ్యానించడం దీన్ని నిర్ధారిస్తున్నది. అందుకే ఉద్గారాల భారాన్ని భారత్‌వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై మోపాలని చూడటం తప్పని మోదీ చెప్పాల్సివచ్చింది. వాస్తవానికి వాతావరణంపై 1992లోనే రియోడి జెనైరోలో ప్రపంచ దేశాలన్నీ మొట్టమొదటి సమావేశం నిర్వహించుకుని ఒక కార్యాచరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్షీణిస్తున్న వాతావరణాన్ని సరిచేసేందుకు ప్రభుత్వాలన్నీ ముందుకు రావాలని ఆ సదస్సు పిలుపునిచ్చింది.


 


ఆ తర్వాత 1997లో క్యోటోలో జరిగిన శిఖరాగ్ర సదస్సు 1990నాటితో పోలిస్తే 2012కల్లా 5 శాతం ఉద్గారాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఆ సదస్సు నిర్ణయాలను అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్ సైతం అంగీకరించి సంతకం చేశారు. కానీ అమెరికన్ కాంగ్రెస్ దానికి మోకాలడ్డింది. క్యోటో నిర్ణయాలు దశాబ్దంపాటు స్తంభించిపోవడానికి అమెరికా అనుసరించిన వైఖరే ప్రధాన కారణం. తాము యధేచ్ఛగా వాతావరణంలోకి వదిలిపెడుతున్న ఉద్గారాలవల్ల ప్రపంచానికి వచ్చే ముప్పేమీ లేదని రిపబ్లికన్‌లు మూర్ఖంగా వాదిస్తూ వచ్చారు. అశాస్త్రీయమైన అంచనాలతో అభివృద్ధిని అడ్డుకోవడం తగదని మొండికేశారు.


 


ఇన్నాళ్లకు ఆ దేశానికి జ్ఞానోదయమైంది. కర్బన ఉద్గారాల్లో తమ దేశం రెండో స్థానంలో ఉన్న సంగతి తెలుసునంటూ ఇప్పుడు ఒబామా మాట్లాడుతున్నారు. దాని పరిష్కార బాధ్యతనూ నెత్తినెత్తుకుంటామంటున్నారు. మంచిదే. కానీ పేద దేశాలకు ఆర్థిక సాయంవంటి చర్యలు మాత్రమే సరిపోవు. కర్బన ఉద్గారాల్లో తమ వాటా ఎంతో తేల్చి దానికి అనుగుణమైన నిష్పత్తిలో వాటిని తగ్గిస్తామని వాగ్దానం చేయాలి. ప్రధాని మోదీ చెప్పింది ఇదే. ఆ పని చేయకుండా కాలుష్యాన్ని సాకుగా చూపి వర్ధమాన దేశాల అభివృద్ధిని అడ్డుకోవడానికీ లేదా కాలుష్యాన్ని నియంత్రించే సాంకేతికతను పెద్ద ధరకు అమ్ముకోవడానికీ ప్రయత్నించడం అనైతికత అనిపించుకుంటుంది.


 


 చమురు, సహజవాయువు, బొగ్గువంటి వనరుల విచ్చలవిడి వాడకం వల్లనే కర్బన ఉద్గారాలు అసాధారణ స్థాయిలో పెరిగాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మూడు వనరులనూ ఎడా పెడా వాడుకుని సంపద పోగేసుకున్నవి అమెరికా, బ్రిటన్, కెనడా, రష్యా, జర్మనీ దేశాలేనని ఐపీసీసీ నివేదిక తెలిపింది. ఈమధ్య కాలంలో చైనా సైతం కర్బన ఉద్గారాల పెరుగుదలకు కారకురాలవుతోంది. వీరంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కాలుష్యాన్ని తగ్గించుకోవడమేకాక వర్ధమాన దేశాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాల్సిన అవసరం పెరిగింది. అవి మినహా ఏం చేస్తామన్నా ఉత్త బడాయి మాటలుగానే మిగులుతాయి. నరేంద్ర మోదీ హితవచనాలను సంపన్న దేశాలు తలకెక్కించుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top