మాటల మంటలు

మాటల మంటలు - Sakshi


అవసరమనుకున్నపుడు మాట్లాడటం ద్వారా...కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండిపోవడంద్వారా తాను అనుకున్నదాన్ని ప్రజలకు చేరేయడంలో ప్రధాని నరేంద్ర మోదీని మించినవారు లేరు. నిరుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనే ఆ సంగతి రుజువైంది. దురదృష్టవశాత్తూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఆయన కేబినెట్ సహచరుల్లో, పార్టీ ఎంపీల్లో కొందరికి ఆ విద్య పట్టు బడినట్టు లేదు. ఏదో అంశంలో నోరు జారడం... ఆనక దాన్ని సమర్థించుకోలేక తామూ, తమతోపాటు ప్రభుత్వాన్నీ ఇరకాటంలో పడేయటం వారిలో చాలా మందికి అలవాటుగా మారింది.



సాధ్వీ నిరంజన్ జ్యోతి మొదలుకొని గిరిరాజ్ సింగ్ వరకూ అలాంటివారు ఈ ఏడాది కాలంలో చాలామంది లెక్క తేలారు. తాజాగా ఆ జాబితాలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ కూడా చేరారు. మిగిలిన వారు సృష్టించిన వివాదాలన్నీ ఇక్కడివారికి ఆగ్రహం కలిగిస్తే...పారికర్ సృష్టించిన వివాదం సరిహద్దులు దాటి పాకిస్థాన్‌ను తాకింది. ఆ దేశం ఘాటుగా స్పందిం చింది. నిజానికి మనోహర్ పారికర్‌కు మంచి పేరుంది. వివేకవంతుడన్న ముద్ర ఉంది. చెప్పదల్చుకున్నది చెప్పడం తప్ప అతిగా మాట్లాడే అలవాటు ఆయనకు లేదంటారు. అలాంటి వ్యక్తి నోరు జారడమే ఇప్పుడు వింత.



ఉగ్రవాదులను ఏరేసేందుకు ఉగ్రవాదులనే ఉపయోగించుకుంటామని, ముల్లును ముల్లుతో తీయాలన్నదే తమ అభిమతమని ఈమధ్య మనోహర్ పారికర్ ఒక వేదిక పైనుంచి మాట్లాడుతూ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి దౌత్య విధానాలతోపాటు ఇతరేతర పద్ధతులను కూడా అనుసరిస్తామని చెబుతూ అలా అనడంవల్ల దానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందు కు ఉగ్రవాద ముఠాలను తయారుచేశామని లేదా చేస్తున్నామని ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ చెప్పదు. అలా చేయడం బాధ్యతారాహిత్యం అవుతుందని  సామా జిక నిపుణులు హెచ్చరిస్తారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఉగ్రవాద ముఠా లను ఉసిగొల్పుతున్నదని మన దేశం అనేకానేకసార్లు ఆరోపించింది.



ముంబై నగరంలో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులు ఆ బాపతువారేనని మన ప్రభుత్వం ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఆ దాడుల సందర్భంగా సజీవంగా పట్టుకున్న కసబ్‌ను విచారించి ఎన్నో రహస్యాలను రాబట్టింది. అమె రికాకు పట్టుబడిన డేవిడ్ హెడ్లీ ముంబై దాడుల్లో పాక్ సైన్యం పాత్ర గురించి చాలా వివరంగా వెల్లడించాడని కథనాలు వెలువడ్డాయి. అయినా సరే పాక్ ప్రభుత్వం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూనే ఉంది. ఉగ్రవాదులకు సహకరించినట్టుగా ఆధా రాలు చూపమని దబాయిస్తున్నది. పాకిస్థాన్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఉగ్రవాదులను చేరదీయడంవల్ల కలిగిన దుష్ఫలితాలను ఆ దేశం అనుభవిస్తున్నది. నిత్యం ఎక్కడో ఒకచోట ఉగ్రవాదులు రెచ్చిపోయి చేస్తున్న దాడులవల్ల ఆ దేశం అతలాకుతలం అవుతున్నది. ఆమధ్య కంటోన్మెంట్ ప్రాంతంలోకి సైనిక దుస్తుల్లో చొరబడిన ఉగ్రవాదులు ఒక పాఠశాలపై దాడిచేసి పిల్లలను, టీచర్లను పొట్టన బెట్టుకోవడం ప్రపంచదేశాలను దిగ్భ్రాంతిపరిచింది.



పారికర్ చెప్పినదాన్లో నిజానికి కొత్తేమీ లేదు. కశ్మీర్‌లో మిలిటెంట్ల బెడద ఎక్కు వగా ఉన్న 90వ దశకంలో కూకా పారీ అనే మిలిటెంట్ ఆధ్వర్యంలో గ్రూపును ఏర్పరిచి వారితో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయించడం, అందుకు సైన్యం తోడ్పాటును అందించడం చరిత్ర. అలాగని కూకా పారీకి తమ ఆశీస్సులున్నాయని సైన్యంగానీ, ప్రభుత్వంగానీ ఏనాడూ ఒప్పుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్‌లను ఎదుర్కోవడానికి నాలుగేళ్లక్రితం సల్వాజుడుం పేరుతో మిలిటెంట్ల గ్రూపు తయారుకావడం... గిరిజన గ్రామాల్లో అది సృష్టించిన విధ్వంసం, అరాచకాలు అందరికీ తెలిసినవే. సల్వాజుడుంతో తమకు సంబంధంలేదని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ మూ, అక్కడి పోలీసు యంత్రాంగమూ చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు సుప్రీంకోర్టు కఠినంగా హెచ్చరించడంతో ఆ సంస్థ మూతబడింది.



ఇలాంటి గ్రూపు లను తయారుచేసి ఉగ్రవాదుల బెడదను ఎదుర్కొంటామంటే అమలులో ఉన్న రాజ్యాంగంగానీ, చట్టాలుగానీ అంగీకరించవు. నిజానికి విధ్వంసాన్ని, ఇతర ఉగ్రవాద చర్యలనూ ఎదుర్కొనాలంటే పటిష్టమైన నిఘా వ్యవస్థ, ఎప్పటికప్పుడు దాడులు జరిపి అరెస్టు చేయడం, పట్టుబడినవారి నేరాలపై సాక్ష్యాధారాలు సేకరిం చి శిక్షపడేలా చూడటం ముఖ్యం. అలాంటపుడే ఆ సంస్థలు అదుపులోకి వస్తాయి. అందుకు భిన్నంగా ఆ సంస్థల కార్యకలాపాలను ఎదుర్కొనడానికి ప్రైవేటు ముఠా లను పెంచిపోషిస్తే అరాచకం తలెత్తుతుంది. తమను అడిగేవారు లేరన్న ధీమాతో, తమకు ఏ చట్టమూ వర్తించదన్న భరోసాతో ఆ ముఠాలు చెలరేగి పోతాయి. అక్రమ వసూళ్లు, బెదిరింపులు, హత్యలువంటివి చోటుచేసుకుంటాయి. పర్యవసానంగా సామాన్య పౌరులకు సైతం చట్టబద్ధ పాలనలో విశ్వాసం పోతుంది.



అంతిమంగా రాజ్యం బలహీనపడుతుంది. పారికర్ ఇవన్నీ ఆలోచించారో లేదోగానీ తాను అలా అనడంలోని ఉద్దేశం వేరని ఆ వెంటనే సవరించుకోవడానికి ప్రయత్నించారు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తమ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద ఘటనల్లో భారత్ ప్రమేయం ఉన్నదనడానికి ఇదే రుజువని పాకిస్థాన్ చెప్పడం మొదలుపెట్టింది. బలూచిస్థాన్‌లో వేర్పాటువాదులను భారత్ ప్రోత్సహిస్తున్నదని పాక్ ఎప్పటినుంచో అంటున్నా అందుకు తగిన ఆధారాలను ఇంతవరకూ చూపలేకపోయింది. పారికర్ పుణ్యమా అని ఇన్నాళ్లకు దానికొక అవకాశం చిక్కింది. ఉపన్యాసం వింటున్నవారిని మంత్రముగ్ధుల్ని చేయాలని, వారి అభినందలూ, కరతాళధ్వనులూ అందుకోవాలని ఎంత ఉబలాటమున్నా కాస్త వెనకా ముందూ చూసుకుని మాట్లాడటం ముఖ్యం. తమ మాటలవల్ల ఎలాంటి పర్యవసానాలు సంభవిస్తాయో తెలుసుకోలేనివారు మంచి రాజకీయ నేతలు కాలేరు. మనోహర్ పారికర్‌కు ఈపాటికే ఈ సంగతి బాగా అర్ధమై ఉండాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top