‘చేయి’ తిరిగిన డబుల్ గేమ్!

‘చేయి’ తిరిగిన డబుల్ గేమ్! - Sakshi


 బైలైన్

 

 ప్రత్యర్థులపై ప్రయోగించే అస్త్రాలు అన్నిసార్లూ విజయవంతం కావు. గత పదేళ్లపాటు హస్తినలో అధికారానికి అతుక్కునిపోయిన కాంగ్రెస్ పాలి‘ట్రిక్స్’లో చేయి తిరిగింది కాని దేశవ్యాప్తంగా రాజకీయ యవనికపై వచ్చిన సిసలైన సవాల్‌ను గుర్తించలేకపోయింది. ముఖ్యంగా గుజరాత్ కేంద్రస్థానంగా పుట్టిన రాజకీయ భూకంపాన్ని పసిగట్టలేకపోయింది

 

 యూపీఏ సర్కారు ఎప్పుడు దారి తప్పిందో తెలుసా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ పునరధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న ఒకేఒక్క నిర్ణయంతో యూపీఏ ప్రభుత్వం గాడి తప్పిందని చెప్పవచ్చు. గత పదేళ్లలో యూపీఏ సంకీర్ణ సర్కారు నడిచినంతకాలమూ సోనియా కత్తికి ఎదురే లేదు. ఆమెలో ప్రతిక్షణం అధికారదర్పం స్పష్టంగా కనబడింది. దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ సింహాసనం చాటున ఉంటూ సోనియా తెరవెనుక పెత్తనం చేయడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. అందరికీ కనిపించేలా అధికారహోదా వెలగబెట్టారు. ప్రధానిని ఎంపిక చేయడం దగ్గరనుంచీ.... ఎవ రికి ఏ మంత్రిపదవిని  కట్టబెట్టాలి దాకా అంతా ఆమె కనుసన్నల్లోనే సాగింది. ప్రభుత్వానికి సంబంధించి విధానపరమైన, కీలక అంశాలపై అంతిమ నిర్ణయం ఆమెదే. అధికార పార్టీలో సీనియర్ మంత్రుల మధ్య కీచులాటలు సర్వసాధారణమే. ఇవి మరీ శ్రుతిమించి ప్రధాని కూడా పరిష్కరించలేని పరిస్థితి వస్తే మంత్రుల మధ్య తగాదాలను ఆమే పరిష్కరించేవారు.



 ప్రధాని అయ్యేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొందరపడడానికి తగిన కారణం ఏమీ కనిపిం చడం లేదు. 2014 ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన కొన్నేళ్లపాటు హ్యాపీగా సెలవుల్లో టూర్లు తిరగొచ్చు! ఢిల్లీలో ‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్ సంఘటన జరిగి నప్పుడు దేశమంతా అల్లకల్లోలమయ్యింది. ఢిల్లీ ప్రధాన వీధుల్లోకి యువతీ యువకులంతా వచ్చి తమ నిరసననూ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేశారు.



అలాంటి కీలక సమయంలో ఈ ‘యువరాజు’ ఏమయ్యాడు?



 పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్ష పార్టీ లేకపోతే దేశానికి తీవ్రముప్పు వాటిల్లుతుందని సోనియా గ్రహించడం తెలివైన విషయమే అని చెప్పాలి. అయితే ఈ క్రమంలో ఆమె ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు. ఒక నాటకానికి తెరలేపారు. అది ఎలాగంటే....ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా నటించారు. సోనియా, ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది. ఈ రెండు పాత్రల కలబోతతో కేంద్ర రాజకీయ తెరపై ఒక విచిత్ర నాటకీయ చిత్రం ఆవిష్కృతమయ్యింది.



 చేసింది శూన్యం



 దేశ రక్షణ విధానాలకు సంబంధించిన అంశాలలో ప్రధానమంత్రి మన్మోహన్ వైఖరిని సోనియా బాహాటంగా తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు బలూచిస్థాన్‌లో అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న తెగలకు భారత్ ఆయుధాల రూపంలో సాయం చేస్తోందని పాకిస్థాన్ గతంలో అనేకసార్లు ఆరోపణలు చేసింది. 2009లో ఈజిప్టులోని షర్మెల్ షేఖ్ నగరంలో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సభలో ప్రధాని మన్మోహన్ సింగ్  బలూచిస్థాన్‌పై పాక్‌కు ‘అవాంఛనీయ అనుకూలత’ ఇస్తూ ప్రసంగించడం సోని యాకు ఆగ్రహం తెప్పించింది. తాను ఎంపిక చేసిన ప్రధానినే ఆమె బహిరంగంగా మందలించడానికి సైతం వెనుకాడలేదు. కాని పాకిస్థాన్ పట్ల మన్మో హన్ అనుసరించిన మెతక విధానాన్ని మార్చేందుకు నిజానికి ఆమె చేసింది ఏమీ లేదు. మరో విషయం.... బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు మార్క్సిస్టు పార్టీ ఎంపీ గురుదాస్ దాస్ గుప్తా ప్రతిపాదించిన కొన్ని ప్రజాకర్షక తీర్మానాలను సోనియా వేనోళ్ల పొగిడారు. కాని అమల్లోకి

వచ్చేసరికి ఆమె చేసింది శూన్యం.



 రాజకీయాల్లో ప్రత్యర్థులపై ప్రయోగించే అస్త్రాలు అన్నిసార్లూ విజయవంతం కావు. అసలు విషయం ఏమంటే... గత పదేళ్లపాటు హస్తినలో అధికారానికి అతుక్కునిపోయిన కాంగ్రెస్ పాలి‘ట్రిక్స్’లో చేయి తిరిగింది కాని దేశవ్యాప్తంగా రాజకీయ యవనికపై వచ్చిన సిసలైన సవాల్‌ను గుర్తించలేకపోయింది. ముఖ్యంగా గుజరాత్ కేంద్రస్థానంగా పుట్టిన రాజకీయ భూకంపాన్ని పసిగట్టలేకపోయింది!

 బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇప్పటికే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. శీల హననం ద్వారా మోడీని దెబ్బతీయవచ్చని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. కాబట్టి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  గత పదేళ్లుగా పోలీసులు, కోర్టులు, విద్యావేత్తలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఎన్నడూ లేనంతగా ఒక రాజకీయ నాయకుడిని నిశితంగా స్క్రుటినీ చేస్తున్నాయి. ఈ పరిశీలన వెనుక అసలు ఉద్దేశం... గుజరాత్ మతకలహాల వెనుక పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం కాదు, ఈ అల్లర్లకు ఏదోరకంగా మోడీ కారకుడని, ఆయన్ని దోషిగా నిలబెట్టేందుకు జరిగే ప్రయత్నమే. మోడీని నేరస్తుడిగా చిత్రించాలన్న ఉన్మాదం ఎంతవరకు వెళ్లిందంటే ఈ దిశగా అన్ని ప్రయత్నాలూ బెడిసికొట్టాయి.



 కాంగ్రెస్ మునిగే నౌక



 గుజరాత్ అల్లర్లలో మోడీ ప్రమేయంపై నిర్దిష్టమైన ఆధారాలు లేకపోవడంతో ఆయన ప్రత్యర్థులు జావగారిపోయారు. కాని ఈ ప్రక్రియ మాత్రం ఒక దుర్మార్గపూరిత అస్త్రంగా మారింది. రాహుల్ గాంధీ ప్రచారసామగ్రిలో ఇదొక ప్రధాన అస్త్రమయ్యింది. ఈ ప్రచారానికి  ఓటర్ల నుంచి స్పందన కూడా సానుకూలంగా లేదని వార్తలొస్తున్నాయి. వంద పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రస్తుతానికి తేలిన వాస్తవ పరిస్థితి ఏమిటంటే... కాంగ్రెస్ ఆనవాలు కూడా దొరక్కుండా మునిగిపోతున్న నౌకగా కనిపిస్తోంది. మోడీ ప్రధాని అయితే ఈ దేశంలో ఆర్థిక రంగంలో తీసుకురాబోయే మార్పులపై, కల్పించే ఉద్యోగాలపై ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రచార పటాటోపం ప్రదర్శించినా ఎన్నికల్లో వారికి భంగపాటు తప్పకపోవచ్చు.



 ఈ ఎన్నికలలో ఉద్యోగాలిస్తామని ఊదరగొడుతున్నారు. ఏ పార్టీ నాయకుడు నోరు తెరిచినా ఉద్యోగాల మాటే. ప్రస్తుత ఎన్నికల్లో అన్ని వర్గాలూ అభివృద్ధి చెందేలా చేస్తామని కూడా వాగ్దానాలు చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వానికి మన్మోహన్‌సింగ్ నాయకత్వం వహించగా, పార్టీ నేతగా సోనియా జోక్యంతో తలెత్తిన గందరగోళం వల్ల కేంద్ర ప్రభుత్వ పాలనావ్యవస్థ దారీ తెన్నూ లేకుండా తయారయ్యింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యింది. ఈ ఎన్నికల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. యువతను దేశ ప్రగతి అనే ఇంజిన్‌కు చోదకులుగా మార్చాలే తప్ప ఈ ప్రయాణంలో వారిని రైల్వే స్టేషన్ బయట వదిలేయరాదు. ఒక మధ్యతరగతి వ్యక్తి కారులో ముంబై వచ్చి అద్భుతమైన వ్యాఖ్య చేశాడు. ఇలాంటి పాలన మరో ఐదేళ్లు కొనసాగితే ముంబైలోని మధ్యతరగతి మాయమైపోతుంది!

 ఈ ఎన్నికలు భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సంబంధించినవని గుర్తించాలి. అందుకే యువతీయువకులు మార్పుకు ఓటేస్తున్నారు.  



 ఎంజే అక్బర్

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top