సుష్మా ప్రతిపాదన

సుష్మా ప్రతిపాదన - Sakshi


ఇరుగు పొరుగు దేశాల మధ్య సరిహద్దులకు సంబంధించి సమస్యలు తలెత్తడం సహజమైనా అవి నిరవధికంగా కొనసాగడం, వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎవరికీ మంచిది కాదు. అందువల్లే భారత్‌–చైనా వివాదం విషయంలో రెండు దేశాలూ తమ తమ సైన్యాలను వెనక్కి పిలిపించాలని, ఆ తర్వాత చర్చలు ప్రారంభించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌  రాజ్య సభలో గురువారం చేసిన ప్రకటన ఆహ్వానించదగింది. ఇరు దేశాల మధ్య భూటాన్‌ ట్రై జంక్షన్‌లో ఉద్రిక్తతలు తలెత్తి నెలరోజులు దాటుతోంది. ఆనాటి నుంచీ రెండు దేశాల వైపునా దాని గురించి ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. చైనా చేస్తున్న ప్రకటనల్లో సామరస్య ధోరణి కంటే దూకుడు పాలు ఎక్కువ. మన దేశం కూడా అందుకు దీటుగానే జవాబిచ్చింది. భారత్‌ 1962 నాటి అనుభవా లను మర్చిపోకూడదని చైనా అంటే... ఇది 2017 అని గుర్తుపెట్టుకోవాలని మన దేశం బదులిచ్చింది. భారత్‌ సైన్యం వెనక్కు వెళ్తే తప్ప రెండు దేశాల మధ్యా జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక చర్చలుండవని చైనా అంటే... అసలు అలాంటి ప్రతిపాదన మేం చేయలేదని భారత్‌ చెప్పింది.



 భూటాన్‌కు చైనాతో దౌత్య సంబంధాలు లేవు. అయినా ఆ రెండు దేశాల మధ్యా ట్రైజంక్షన్‌ వివాదంపై చాన్నాళ్లుగా చర్చలు సాగుతూ ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం ఇప్పుడు వివాదాస్పద ప్రాంతమైన డోక్లాంపై భారత్‌–చైనా–భూటాన్‌ల మధ్య చర్చలు జరగడాన్ని, ముగ్గురం కలిసి ఈ ట్రై జంక్షన్‌ సరిహద్దులను ఖరారు చేసుకుందామని నిర్ణయించుకోవడాన్ని తాజాగా సుష్మా స్వరాజ్‌ గుర్తు చేశారు. దీన్ని కాదనుకుని ఉన్నట్టుండి తమ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) జవాన్లు ఎందుకు చొరబడవలసి వచ్చిందో చైనా వివరించి ఉంటే బాగుండేది. వివా దాస్పద ప్రాంతంలో పీఎల్‌ఏ జవాన్లు రహదారి నిర్మాణానికి ప్రయత్నిస్తుంటే మన దేశంతో ఉన్న ఒడంబడికను అనుసరించి భూటాన్‌ మన సాయం కోరింది.



అది చైనాకు అభ్యంతరకరంగా ఉంది. ఈ రహదారి నిర్మాణం వల్ల ఒక్క భూటా న్‌కు మాత్రమే కాదు... మా భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందన్నది మన దేశం వాదన. చైనా తన హద్దుల్ని దాటి వస్తే మన ఈశాన్య రాష్ట్రాలకు సమీపంగా ఉన్న సిలిగుడి కారిడార్‌లో ప్రవేశించడానికి చైనాకు సులభమవుతుందని భారత్‌ చెబుతోంది. వివాదం ఏర్పడినప్పుడు పరస్పరం చర్చించుకుంటే ఇరు పక్షాల మధ్యా ఉండే అపోహలైనా, అనుమానాలైనా సమసిపోతాయి. ఇన్నాళ్లుగా అను సరిస్తూ వస్తున్న విధానాన్ని విడనాడి, నాలుగేళ్ల క్రితం కుదిరిన ఒడంబడికను కూడా కాదని కొత్త ప్రాంతానికి విస్తరించి రహదారి నిర్మించాల్సిన అవసర మేమిటో చైనా హేతుబద్ధంగా వివరిస్తే బాగుండేది. అందుకు బదులుగా మాతో ఫలానా సంవత్సరంలో వచ్చిన యుద్ధంలో ఓడిపోయారని గుర్తు చేసి బెదరగొడ దామనుకుంటే ప్రయోజనం ఉండదు.



ఈ వివాదం గురించి చైనా అధికారికంగా చెబుతున్నదానికంటే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పత్రిక ద్వారా మాట్లాడుతున్నది ఎక్కువ. సుష్మా స్వరాజ్‌ ప్రకటన చేసి 24 గంటలు గడవకుండానే ఆ పత్రిక తమ సైనిక బలం గురించి, దానికున్న సామర్ధ్యం గురించి ఏకరువు పెట్టింది. చైనా సైనిక వ్యయం భారత్‌తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువని, జీడీపీ అయిదురెట్లు ఎక్కువని లెక్కలిచ్చింది. యధాప్రకారం యుద్ధం రావడం, అందులో మీరు ఓడి పోవడం ఖాయమంటూ హెచ్చరికలు చేసింది. యుద్ధంలో అమెరికా, జపాన్‌ల మద్దతు లభిస్తుందన్నది భారత్‌ భ్రమేనని చెప్పింది. అది చైనా ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకుని ఈ మాటలు చెప్పడంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఉంటే గింటే అక్కడి ప్రభుత్వానికుండాలి. కానీ అమెరికా, జపాన్‌ల మనోభావాలను కూడా తానే చెప్పాలన్న తహతహ ఎందుకో అర్ధంకాదు. ఇలా ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని, సైనిక వ్యూహాన్ని తామే నిర్దేశించాలన్న ఉత్సాహం మన దేశంలో కొన్ని మీడియా సంస్థలకూ, కొందరు వ్యక్తులకూ కూడా ఉంది. సామాజిక మాధ్యమాల జోరు పెరిగాక ఇది మరింతగా ఎక్కువైంది. చైనా సరుకులు కొనొద్దని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది. ఇది అసమంజసం. ప్రభుత్వం ఏదైనా చేయడానికి ముందే ఇప్పటికిప్పుడే ఏదో జరిగిపోవాలని వీరు ఆశిస్తున్నారు.



అధికారిక స్థాయిలోనూ, అనధికార స్థాయిలోనూ దేశాలు పరస్పరం సంప్ర దించుకోవడం... వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం విప రీతమేమీ కాదు. అధికారిక స్థాయిలో జరిగే చర్చలకు చాలా ముందే అనేకసార్లు తమ దూతల ద్వారా లోపాయికారీగా సంభాషించుకోవడం ఏ రెండు దేశాల మధ్యనైనా సర్వసాధారణం. దౌత్యం అన్నది అనేక నైపుణ్యాల సమాహారం. ఆ రంగంపై ఆసక్తి ఉండటం ఒక్కటే సరిపోదు. అందుకు తగిన శిక్షణ, అవతలిపక్షం చేసే వాదనలను విశ్లేషించగల సామర్ధ్యం, సంభాషణా చాతుర్యం, వాస్తవంగా వివాదం ఏర్పడ్డ ప్రాంతానికి సంబంధించిన చరిత్రపైనా, అక్కడ కాలాను గుణంగా చోటుచేసుకున్న మార్పులపైనా అవగాహన అవసరం. ఏ మాట ఏ అర్ధాన్నిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.



అప్పుడు మాత్రమే అవతలి పక్షం చేస్తున్న వాదనలోని లోపాల్ని, నిర్హేతుకతను ఎత్తి చూపడం సాధ్యమవుతుంది. ఇప్పుడు విదేశాంగ కార్యదర్శిగా ఉన్న జయశంకర్‌ లోగడ చైనాలో భారత రాయబారిగా పనిచేశారు. అక్కడి నేతలతో, ఉన్నతాధికారులతో చర్చించిన అను భవం ఆయనకుంది. ఇక్కడ కాకపోవచ్చుగానీ సరిహద్దుల్లో చైనాతో ఇతరచోట్ల వచ్చిన వివాదాలపై ఇరు దేశాలూ సంభాషించుకోవడం, అంగీకారానికి రావడం గతంలో జరిగాయి. ఇప్పుడు సైతం ఆ సంప్రదాయం కొనసాగాలి. పరస్పరం రెచ్చగొట్టుకునేలా మాట్లాడటం, హెచ్చరికలు చేయడం ఎటువైపు నుంచి జరిగినా మంచిది కాదు. సుష్మా స్వరాజ్‌ చేసిన సూచనలోని సహేతుకతను గుర్తించి ప్రతిష్టకు పోకుండా చర్చలకు అనువైన వాతావరణానికి చైనా దోహదపడాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top