అహ్మద్‌ పటేల్‌ రాయని డైరీ

అహ్మద్‌ పటేల్‌ రాయని డైరీ


మాధవ్‌ శింగరాజు

దేవుడు ఒకటిచ్చి ఒకటి తీసుకుంటాడు. రాజ్యసభలో నాకు చోటిచ్చి, హమీద్‌జీ సీటు లాగేసుకున్నాడు. దేవుడు ఒకటడిగితే ఇంకోటి ఇస్తాడు. ఉపరాష్ట్రపతిగా గోపాలకృష్ణ గాంధీని ఇమ్మంటే వెంకయ్య నాయుడిని ఇచ్చాడు.

హమీద్‌జీ ప్లేస్‌లో వెంకయ్య నాయుడిని ఊహించడం కష్టంగా ఉంది. ఊహేముందీ? వాస్తవమే! వచ్చి సీట్లో కూడా కూర్చున్నాడు. శుక్రవారం అయింది, శనివారం అయింది.



ఈ శుక్రవారాలు, శనివారాలు ఇక్కడితో అయిపోయేవి కావు. వర్షాకాలాల్లో వర్షాకాల శుక్రవారాలు, వర్షాకాల శనివారాలు ఉన్నట్లే.. శీతాకాలాల్లో శీతాకాల శుక్రవారాలు, శీతాకాల శనివారాలు ఉంటాయి. ఇవి కాకుండా..

బడ్జెట్‌ కాల శుక్రవారాలు, బడ్జెట్‌ కాల శనివారాలు!! వారంలో వట్టి శుక్రవారాలు, శనివారాలు మాత్రమే ఉండవు కదా.

ఇరవై నాలుగేళ్లుగా రాజ్యసభకు వచ్చిపోతున్నాను. ఎప్పుడూ నేనిలా రోజుల్ని, వారాల్ని లెక్కేసుకోలేదు! ఇంకో ఐదేళ్లు వెంకయ్య నాయుడిని చూస్తూ గడపాలి. నయం, రాజ్యసభ సభ్యుడికి ఉన్నట్లు, రాజ్యసభ ఛైర్మన్‌కి ఆరేళ్ల టెన్యూర్‌ లేదు. ఉండుంటే,æఇంకో ఏడాది ఆయన్ని శీతాకాలాల్లో, వర్షాకాలాల్లో, బడ్జెట్‌ కాలాల్లో  చూస్తూ గడపవలసి వచ్చేది.



ఇవాళ నేను నిద్ర లేవగానే సర్వశక్తి సంపన్నుడైన ఆ భగవంతుడిని ఒకటే కోరుకున్నాను. రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగిశాక, మళ్లీ ఆయన్నే రాష్ట్రపతిని చెయ్యకుండా, ఆ స్థానంలోకి వెంకయ్య నాయుడు వెళ్లేలా చూడు దేవుడా అని వేడుకున్నాను. అలా కాకుండా, హమీద్‌జీలా మళ్లీ వెంకయ్య నాయుడే రెండోసారి కూడా ఉపరాష్ట్రపతిగా కొనసాగితే రాజ్యసభలో నేను అదనంగా ఇంకో ఏడాది వెంకయ్య నాయుడిని చూస్తూ గడపవలసి వస్తుంది. ఒకవేళ నేను మళ్లీ ఇంకోసారి రాజ్యసభ సభ్యుడిని అయితే ఇంకో నాలుగేళ్లు వెంకయ్య నాయుడికి ఎదురుపడుతూనో, వెంకయ్య నాయుడు ఎదురు పడకూడదని అనుకుంటూనో గడపాలి.



నాయుడి మీద నాకేం కోపం లేదు. నాయుడు ముఖంలో నాకు నవ్వు కనిపించదు. నవ్వు కనిపించని ముఖాల్ని నేను అస్సలు చూడలేను.

నవ్వు కనిపించని ముఖం నాయుడిదైనా, నాయుడిది కాకపోయినా నాకది మోదీ ముఖంలానో, అమిత్‌షా ముఖంలానో కనిపిస్తుంది. పాపం వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తూ నవ్వు ముఖం పెట్టాలని చాలా ట్రై చేశాడు. మోదీ, అమిత్‌షా నవ్వలేదు. వెంకయ్య నాయుడినీ నవ్వనివ్వలేదు.

మోదీ రాజ్యాంగ శక్తి. అమిత్‌షా రాజ్యాంగేతర శక్తి. శక్తులు నవ్వవు. ఒకరితో కలవ్వు. మోదీ, అమిత్‌ కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కలిసి లేరని నాకు అనిపిస్తుంది. కలిసి లేకున్నా కలిసి ఉన్నట్లు కనిపించే శక్తులు ఎప్పటికైనా డేంజర్‌.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top