కదిలించిన ఛాయాచిత్రం

కదిలించిన ఛాయాచిత్రం - Sakshi


నిండా మూడేళ్లు రాకుండానే నూరేళ్లు నిండాయి గానీ... టర్కీలోని మధ్యదరా సముద్ర తీరానికి విగతజీవుడై కొట్టుకొచ్చిన సిరియా బాలుడు కళ్లు మూసుకు పోయిన ప్రపంచం చెంప ఛెళ్లుమనిపించాడు. ఆకలి, అనారోగ్యం, అస్థిరతల నుంచీ... అడుగడుగునా తారసపడి కబళిస్తున్న మృత్యువునుంచీ అయినవాళ్లను కాపాడుకుందామని అనునిత్యం వేల సంఖ్యలో వస్తున్న శరణార్థుల గోడు పట్టనట్టే నటిస్తున్న యూరప్ దేశాలను బోనెక్కించాడు.


 


ఆ బాలుడి ఛాయాచిత్రం శుక్రవారం పత్రికల్లో, చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమై యూరప్ ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేసింది. ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. యుద్ధ విమానాలు జారవిడిచే బాంబులు, ఐఎస్ ఉగ్రవాదులూ, కుర్దులూ మారణాయుధాలతో, మానవ బాంబులతో సాగిస్తున్న నరమేథంతో నాలుగేళ్లుగా అట్టుడుకుతున్న సిరియానుంచి ప్రాణ భయంతో పడవెక్కి వస్తున్న ఒక కుటుంబంలోనివాడు ఆ మూడేళ్ల బాలుడు.



పేరు అయలాన్ కుర్దీ. ఆ విషాద ఉదంతంలో ఆ బాలుడితో పాటు ఐదేళ్ల వయసున్న అన్న, అమ్మ కూడా చనిపోగా అతని తండ్రి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయలాన్ కుర్దీ మాదిరే నిత్యం పదుల సంఖ్యలో... ఒక్కోరోజు వందల సంఖ్యలో పౌరులు మృత్యువాత పడుతున్నారు. రాకాసి అలలు కాటేసినప్పుడు మాత్రమే కాదు... తీరప్రాంత గస్తీ దళాలు ఒడ్డుకు చేరుకుంటున్నవారిని నిర్దయగా వెనక్కి నెట్టేసినప్పుడు కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి.


 


పడవల్లో లెక్కకు మిక్కిలిగా ఉండటంవల్ల ప్రయాణ మార్గంలో ఊపిరాడక మరికొందరు చనిపోతున్నారు. ఇటీవలే ఒక రిఫ్రిజిరేటర్ ట్రక్కులో దొంగచాటుగా వస్తున్న 79 మంది ఊపిరాడక మరణించారు. ఈ ఏడాది ఇంతవరకూ మధ్యదరా సముద్ర తీరాన్ని దాటే క్రమంలో 2,600 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఈ ఏడాది సిరియా, లిబియా, నైజీరియా, గాంబియా వంటి దేశాల నుంచి ఇంతవరకూ 3,50,000 మంది యూరప్‌లోకి ప్రవేశించారని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.



వివిధ దేశాలనుంచి వెల్లువలా వస్తున్న శరణార్థులు యూరప్ సరిహద్దుల్లో నిరీక్షిస్తున్న దృశ్యాలు ఈమధ్య కాలంలో సర్వసాధారణమయ్యాయి. చావునుంచి తప్పించుకొచ్చే ఆ శరణార్థులకు ముందుగా ముళ్లకంచెలు స్వాగతం పలుకుతుండగా అటు తర్వాత పోలీసుల వాటర్ క్యానన్‌లు, రబ్బర్ బుల్లెట్లు వెన్నాడతాయి. వీటిని దాటుకుని ఏదైనా గ్రామంలోకి ప్రవేశిస్తే జాత్యహంకారుల దూషణలు, దాడులు తప్పవు. ఈ క్రమంలో ఒక కుటుంబంగా వచ్చినవారు చెల్లాచెదురై ఒకరికొకరు ఆచూకీ లేకుండా పోతున్నారు.


 


ఈమధ్యే ఫ్రాన్స్ చానెల్  అలా ఒంటరైన ఒక తల్లి గోడును ప్రపంచానికి చూపింది. తన భర్త, పిల్లలు ఏమయ్యారో... వాళ్లయినా ఒకే దగ్గర ఉన్నారో...చెట్టుకొకరూ, పుట్టకొకరుగా అయ్యారో తెలియక ఆమె తల్లడిల్లింది. ప్రపంచానికి మానవ హక్కుల గురించి లెక్చెర్లిచ్చే యూరప్ దేశాల అధినేతలు...మరీ ముఖ్యంగా బ్రిటన్, జర్మనీలు ఈ సంక్షోభం విషయంలో అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయి. హంగేరి దేశం శరణార్థుల్ని తరిమికొడుతోంది. రైల్లో వచ్చినవారిని బోగీలనుంచి వెలుపలికి రాకుండా కట్టడి చేస్తోంది. తిండి, నీరు లేక అలమటిస్తున్నా పట్టించుకోవడంలేదు. టర్కీ కూడా అలాగే వ్యవహరిస్తోంది. బల్గేరియా, ఇస్తోనియావంటి దేశాలైతే శరణార్థుల్లోని క్రైస్తవుల్ని స్వీకరిస్తాం తప్ప ముస్లింలకు చోటులేదంటున్నాయి. శరణార్థుల్ని యూరప్‌లోని అన్ని దేశాలూ వాటి వాటి ఆర్థిక స్తోమత, జనాభా, నిరుద్యోగిత వంటి అంశాల ఆధారంగా పంచుకోవాలని వస్తున్న సూచనలను బ్రిటన్, జర్మనీ తిరస్కరిస్తున్నాయి.


 


ఇప్పుడు పసివాడి మృతదేహం ఫొటో బయటికొచ్చాక యూరప్ దేశాలు తమ వైఖరిని మార్చుకోక తప్పలేదు.  ఆశ్రయం కల్పించాల్సిన శరణార్థుల సంఖ్యను పెంచుతామని ప్రకటించాయి. అయితే, ఇది అస్పష్టమైన హామీ. నిత్యం వచ్చిపడుతున్న శరణార్థుల సంఖ్య ఆధారంగా నెలకు ఎంతమంది వస్తున్నారో లెక్కేసి, వారిని ఎక్కడ ఎలా సర్దాలో నిర్దిష్టమైన పథకాన్ని రూపొందిస్తే తప్ప ఈ సమస్య కొలిక్కిరాదు. ఎక్కడో సాగుతున్న అంతర్యుద్ధం పర్యవసానాలను తామెందుకు భరించాలని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. యూరప్ దేశాలు కూడా మునుపటిలా లేవని... గ్రీస్, స్పెయిన్ వంటివి దివాలా స్థితికి చేరుకున్నాయని గుర్తు చేస్తున్నారు.



యూరప్‌కు సమస్యలున్నమాట వాస్తవమే అయినా వాటినుంచి తప్పించుకోవడానికి అవి అనుసరించిన విధానాల పర్యవసానంగానే సిరియా, లిబియా తదితర దేశాలు అంతర్యుద్ధంలో చిక్కుకున్నాయి. అమెరికాతో కలిసి ఆ దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి తమకు అనుకూలంగా ఉండే పాలకుల్ని ప్రతిష్టించాలని చూశాయి. ప్రత్యర్థి పక్షాలకు మారణాయుధాలు అందజేయడం, బాంబు దాడులకు పాల్పడటంవంటి మతిమాలిన చర్యలవల్ల అక్కడి సాధారణ జనజీవనం ఛిద్రమైంది. సిరియా జనాభా దాదాపు 2 కోట్లు కాగా అందులో దరిదాపు సగంమంది గత నాలుగేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం పర్యవసానంగా నిరాశ్రయులయ్యారు. 2,30,000 మంది మృత్యువాతపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.



 శరణార్థులుగా వస్తున్నవారు తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పనిచేస్తూ యూరప్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తాము ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితుల్నే ఇప్పుడు సిరియా, లిబియా తదితర దేశాల ప్రజలకు కల్పించడమేకాక...పర్యవసానంగా అక్కడినుంచి వస్తున్నవారిని మళ్లీ ఆ నరకంలోకి నెట్టాలని యూరప్ దేశాలు చూడటం అత్యంత అమానుషం. కఠినమైన నిబంధనలతో ఆ దేశాలు వ్యవహరిస్తున్న తీరువల్ల మనుషుల్ని అక్రమంగా రవాణా చేసే ముఠాలు చాటుమాటు మార్గాల్లో చేరేస్తామని చెప్పి బాధితుల నుంచి విపరీతంగా దండుకుంటున్నాయి. శరణార్థులు దొంగలు, దోపిడీదార్లు కాదు. పుట్టెడు కష్టాలతో వచ్చినవారిని మనుషులుగా గుర్తించడానికి నిరాకరించడం అనాగరికం, అమానవీయం. ఇప్పుడు మూడేళ్ల పసివాడు తన మరణంతో తీసుకొచ్చిన ఈ కదలిక అయినా యూరప్‌లో మానవీయతను మళ్లీ చిగురింపజే యగలదని ఆశిద్దాం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top