వధ పేరుతో రాజకీయ వంటకం

వధ పేరుతో రాజకీయ వంటకం - Sakshi


రెండో మాట

సమాజంలో కొందరికి ‘అంత్యజులు’ (ఆఖరివాళ్లు) ముద్రవేసి మానవులన్న మాట మరిచి, వారిని సమాజ బహిష్కృతులుగా ఎప్పటికీ పరిగణించేందుకే– దళిత, మైనారిటీ ప్రజా బాహుళ్యం ఆహార అలవాట్లపై సరికొత్త మార్గంలో దండయాత్ర ప్రారంభమైందని భావించాల్సి వస్తోంది. అప్పుడు వేదం వింటే చెవుల్లో సీసం పోయమన్నారు. నేడు గోమాంసం తింటే నోట్లో సున్నం కొట్టమంటున్నారు. యాజ్ఞవల్క్య మహామునికి మాత్రం గొడ్డు మాంసం అంటే మహా ప్రీతి అని వైదికార్యులే పేర్కొన్నారు.



‘వధ నిమిత్తం విక్రయించేందుకు పశువులను సంతలకు తరలించడాన్ని నిషేధిస్తూ గత నెల (మే 23న) జారీ చేసిన అధికారిక ప్రకటనను పునఃసమీక్షించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ ప్రకటన ఉద్దేశం ప్రజల ఆహారపు అలవాట్లను మార్పించడం మాత్రం కాదు. ఈ అంశం తన గౌరవానికి భంగకరమని ప్రభుత్వం భావించడం లేదు.’

– హర్షవర్ధన్‌ (కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, 4–6–17)



‘జంతువులను క్రూరంగా హింసించే పద్ధతిని నిరోధించే పేరుతో కేంద్రం తాజాగా రూపొందించిన నిబంధనల ప్రకారం ముందుకు వెళితే ఆహార అవసరాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం పశువులను వినియోగించడం దుర్లభమవుతుంది. ఎందుకంటే, ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం తన పశువులపైన యాజమాన్య హక్కును నిరూపించుకోవడం సామాన్య రైతులకు కష్టసాధ్యమైన విషయం. జంతు బలి నిషేధం పేరుతో ప్రభుత్వం తలపెట్టిన చర్య– గ్రామీణ ఆర్థికవ్యవస్థలో కీలకమైన పశుసంపద వ్యాపార లావాదేవీల నిర్వహణ కోసం ఏర్పడిన సంతలను దెబ్బతీసి, వాటిపై ఆధారపడిన దళిత, మైనారిటీ వర్గాల జీవన మార్గాన్నే దెబ్బతీస్తుంది. ప్రభుత్వ చర్య వల్ల ఇప్పటికే క్రయవిక్రయ మార్కెట్‌లో ధరలు 60 శాతం పడిపోయాయి.’

– పాలగుమ్మి సాయినాథ్‌ (ప్రసిద్ధ పత్రికా రచయిత, 4–6–17)



ఎలాంటి ప్రయోజనం లేకుండా వ్యాపారి వరదలో ప్రయాణానికి సిద్ధపడడు. అలాగే రేపటిరోజున జరిగే అర్థంతర, మధ్యంతర ఎన్నికలలో పాక్షిక ప్రయోజనాల కోసమే బీజేపీ పాలనా వ్యవస్థ కుల, మత, వర్గ, వర్ణ వివక్షా విధానాలను బాహాటంగానే అనుసరిస్తున్నది. అవే వేధింపులు. అదే హింసాకాండ. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు ఇలాంటి అలవాటు ఉంది. ఆ ఉభయపక్షాలు మనకు తెలియకుండానే, మన కళ్లముందే దేశ విభజన సిద్ధాంతాన్ని మరింత గోప్యంగా, మరొక దారిలో చాపకింద నీరులా తీసుకువస్తున్నాయి. అందుకే జంతు హింసా నిరోధక చట్టానికి సవరణ పేరుతో, సరికొత్త నిబంధనల పేరుతో విభిన్న ఆహారపు అలవాట్లపైన దాడి చేయడానికి, సమాజ విభజన కోసం జరుగుతున్న ప్రయత్నం గురించి చైతన్య భారతం తక్షణం మేల్కొనవలసి వచ్చింది.



అది రాష్ట్రాల పరిధిలోనిది

నిజానికి జంతుబలులనూ, యజ్ఞయాగాదుల పేరిట జరిగే జంతు హింసనూ సుప్రీంకోర్టు ఎప్పుడో నిషేధించింది. అయినా ఇంకా కొనసాగుతూ ఉండడానికి అసలు కారణం– పాలక రాజకీయ పక్షాలు (కాంగ్రెస్, బీజేపీ) మైనారిటీల, దళితుల ఓట్ల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను సుగ్రీవాజ్ఞలుగా శిరసావహించడానికి నిరాకరిస్తూ రావడమే. ఇప్పుడు కూడా పశువుల విక్రయాన్ని నిషేధించే నిబంధన వెనుక రహస్యం–దళితవర్గాల, ముస్లిం మైనారిటీల, ఆదివాసీ సంచారజాతుల మాంసభక్షణ అలవాట్లను మార్చడమే.


గోమాంసం సహా, విభిన్న పశుజాతుల మాంసం వీరు తీసుకుంటారన్నది సత్యం. గోమాంస ఉత్పత్తులు, తోళ్ల మీద ఆధారపడిన దేశవాళీ చర్మకారుల వృత్తులు, పాదరక్షల పరిశ్రమ వంటి వాటితో జరిగే ఎగుమతుల విలువ లక్ష కోట్ల రూపాయలని (ఏడాదికి) ఒక అంచనా. ఇవన్నీ ఎలా ఉన్నా, పశువుల క్రయవిక్రయాలకు సంబంధించి పాలనాపరంగా వినిపించిన పెద్ద అబద్ధం ఒకటి ఉంది. ఇది ఈ నిషేధం దరిమిలా జరిగిన చర్చలలో వెల్లడైంది. మద్రాసు హైకోర్టులో జరిగిన ఈ చర్చ విన్న తరువాత కేంద్రం తాజా నిబంధనలలో రెండింటిని నాలుగు వారాలపాటు అమలు కాకుండా ఆ కోర్టు నిలిపివేసింది.


కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తూ ఒక దరఖాస్తును హైకోర్టుకు సమర్పించారు. ఆ సందర్భంలోనే న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వ పరిధిని గురించి గుర్తు చేశారు. ‘పశువధ అంశమే కేంద్రం పరిధిలోనిది కాదు, రాజ్యాంగం ప్రకారం అది రాష్ట్రాల పరిధిలోనిది మాత్రమే, సెక్యులర్‌ భారతదేశంలో ఇది రాష్ట్రాల జాబితాలోనిదే’అని న్యాయమూర్తులు స్పష్టం చేయవలసి వచ్చింది. పిటిషనర్‌ తరఫున వాదించిన మరొక సీనియర్‌ న్యాయవాది, ‘కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలోను పశువులను విక్రయించడానికి వీలులేకుండా సంతల పరిధిని నిర్వచించార’ని పేర్కొన్నారు. ‘నేను అమ్మదలుచుకున్న పశువులను నా ఇంటి దగ్గర కూడా అమ్మలేను, కొనలేను. ఇదీ నా పరిస్థితి’అని కూడా ఆయన న్యాయమూర్తులకు విన్నవించారు.




ఈ వివాదంలో మరొక కోణం ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పేమా ఖందూ కేంద్ర ప్రకటనను విమర్శించారు. ‘పశుహింస నిషేధం పేరుతో ఈశాన్యభారత వాస్తవ సమస్యలను పక్కదారులు పట్టిస్తున్నారు’అని బీజేపీ ముఖ్యమంత్రి పేమా ప్రధాని మోదీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని దక్షిణ, తూర్పు భారత రాష్ట్ర ప్రభుత్వాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌లు కూడా వ్యతిరేకించాయి.

 

వేదమంత్రాలతో మాయ

విచిత్రాలన్నీ మన దేశంలోనే జరుగుతూంటాయనిపిస్తుంది. బౌద్ధ, జైన ధర్మాలు భారత భూమిని ప్రగతిశీల దృక్పథంతో సాకినంతకాలం (రెండువేల సంవత్సరాలు); ఆచరణలో అహింసకూ, సామాజికుల మధ్య సమధర్మానికీ, న్యాయానికీ పాదులు తీసి, నీరుపెట్టి పోషించినంతకాలం; యజ్ఞయాగాదులను, పశుబలులను నిషేధించి సమాజంలో శాంతిని నెలకొల్పినంతకాలం ఎలాంటి గొడవలూ లేవు. కానీ యజ్ఞయాగాల ఆధారంగా రాజ్య విస్తరణ తలపెట్టినప్పుడు, బౌద్ధ ధర్మ వ్యాప్తివల్ల తమ ఉదర పోషణకు ఇబ్బందులెదురయ్యాయని యాజ్ఞికులు, ఛాందసులు గ్రహించడం మొదలైనప్పుడు ఆ బౌద్ధానికి వ్యతిరేకంగా కత్తులు దూశారు.


ఈ సందర్భంగా వేదమంత్రాల పేరుతో ప్రజలను ఎలా మూర్ఖులుగా (ఛాందసులుగా) మలచవచ్చునో నిరూపించడానికి ఒక ‘గారడీ’ ప్రయోగం చేశాడు: ‘భారతదేశంలో నేను గనుక కొన్ని వేద మంత్రాలను తీసుకొని, గారడీ చేసి వాటికి విపరీతార్థాన్ని చెప్పడం మొదలెడితే.. ఆలోచనా శక్తి లేని మూర్ఖులు (ఛాందసులు) తండోపతండాలుగా నా వెంట నడుస్తారు, నమ్మండి’’ అన్నారు స్వామీ వివేకానందులు. యూపీ, మరో నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో లబ్ధి కోసం బీజేపీ చెప్పిన నల్లధనం మంత్రం కూడా వివేకానందుడు చెప్పిన ప్రయోగం లాంటిదే.


వేద కాలంనాటి (తొలి వైదికం, అనంతర వైదిక యుగాలు) భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసిన దేశీయ, పాశ్చాత్య మహా మహా పండితులు రైస్‌ డేలిస్, విట్నా, మాక్స్‌ముల్లర్‌లతో పాటు, రామకృష్ణ పరమహంస, తులసీదాసు, రాహుల్‌ సాంకృత్యాయన్, లక్ష్మణ శాస్త్రి, జోషీ, పండిత శ్రీరామ శర్మ ఆచార్య, స్వామి రామతీర్థ, విద్యానంద ‘విదేహ’– ఇలా ఎందరెందరో మహానుభావులు వైజ్ఞానికంగా, వాస్తవ ప్రపంచానికి హేతుయుక్తంగా వేదాలకు భాష్యాలు చెప్పారు. పాలక వర్గాల మాదిరిగా పెడార్థాలు తీయలేదు.


బుద్ధుడి ప్రగతిశీల భావనా ప్రపంచం లాంటివే స్వామి ‘రామతీర్థ’ ప్రవచనాలు కూడా. అందుకే ఆది వైదికం వేరు. అనంతర వైదికం స్వార్థ బుద్ధులతో కూడిన విద్య అయింది. ‘మూఢులు కాకండి. కళ్లు మూసుకుని దేనినీ నమ్మకండి. వేదాలను కొంతమందిలా గుడ్డిగా వల్లించకండి. ఇతరుల ప్రమాణాలను తీసుకొని దేనినీ నమ్మకండి. నీవే స్వయంగా ప్రయోగశాలలో పరీక్షించు. నీ స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను అమ్ముకోవద్దు’అన్నాడు స్వామి రామతీర్థ.



 గోమాంస భక్షణ, యజ్ఞయాగాదుల్లో పశుబలులు కొత్తగా వచ్చినవి కావు, విదేశీ ఆర్య సంస్కృతి దిగుమతితో ప్రారంభమై, వైదిక యుగానంతర వైదికం నుంచీ రుషులు అసంఖ్యాకంగా అన్ని రకరకాల మాంస రుచుల్ని మరిగినవారే. ‘సుర’(కల్లు) లేనిదే ‘జర కిక్కు’ లేదు. ఛాందస వర్గాలన్నీ నాడు ఈ ఆహారపు అలవాట్లను సమర్థించినవే. ఏ ‘మిల్‌’అనే బ్రిటిష్‌ వలసవాద చరిత్రకారుడు భారత చరిత్రను సమన్వయ దృష్టితో కాకుండా ముస్లిం యుగం, బ్రిటిష్‌ యుగం, హిందూ యుగంగా మత ప్రాతిపదికమీద విభజిం చినది మొదలు ఈ రోజుదాకా అదే విభజనను ఆధునిక భారత పాలకులు కూడా కొనసాగిస్తున్నారు. అందుకే డాక్టర్‌ అంబేడ్కర్‌ ‘మేధావులనబడే మహర్షులు కూడా ఏమీలేని అశ్లీల వేదాలను పట్టుకుని పాకులాడుతూ, మహోన్నతంగా పరిగణించడం ఆశ్చర్యకరం’అన్నాడు.



ఆవు ఒక్కటే పవిత్రమైనదా?

సమాజంలో కొందరికి ‘అంత్యజులు’(ఆఖరివాళ్లు) ముద్రవేసి మానవులన్న మాట మరిచి, వారిని సమాజ బహిష్కృతులుగా ఎప్పటికీ పరిగణించేందుకే– దళిత, మైనారిటీ ప్రజా బాహుళ్యం ఆహార అలవాట్లపై సరికొత్త మార్గంలో దండయాత్ర ప్రారంభమైందని భావించాల్సి వస్తోంది. అప్పుడు వేదం వింటే చెవుల్లో సీసం పోయమన్నారు. నేడు గోమాంసం తింటే నోట్లో సున్నం కొట్టమంటున్నారు. యాజ్ఞవల్క్య మహామునికి మాత్రం గొడ్డు మాంసం అంటే మహా ప్రీతి అని వైదికార్యులే పేర్కొన్నారు. చివరికి ‘గౌ’ అసలర్థం వేరు. వేదభాషలో ఒక్కో మాటకు అనేక అర్థాలున్నందున నేడు బీజేపీ శాఖీయులు ప్రచారం చేసే ‘గౌ’శబ్దాన్ని వేద భాషలో ‘ఆవు’కు ఉపయోగించనే లేదని వేదమూర్తి పండిత శ్రీరామశర్మ ఆచార్య రాస్తున్నారు. ‘గౌ’ అనే మాటను ఆవునుంచి లభించే పాలు, పెరుగు, పేడ, మూత్రం, దూడలు అనే అర్థంలో వాడారని స్పష్టం చేశారు. ‘యజ్ఞం’ మాటకు ‘సేవ’ అని, నవ కల్యాణం అనీ అర్థం. కానీ నేటి ‘యజ్ఞం’ ప్రభు వర్గాలకు, వారి ‘సేవ’ల్లో మునిగి సంపాదనా సేవలో తేలుతూన్న పాలకులు, ఛాందసులూ తరించడానికి చిట్కాలయ్యాయి. హేతువాదం నశించింది. ప్రాణికోటిలో ప్రతి జీవి ఒక ప్రాణిగా పవిత్రమైనదే. ఆవు ఒక్కటే పవిత్రమైనది కాదు.



సీనియర్‌ సంపాదకులు

ఏబీకే ప్రసాద్‌

abkprasad2006@yahoo.co.in

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top