గాడిలో పడటానికే ఏడాది

గాడిలో పడటానికే ఏడాది - Sakshi


సుదీర్ఘమైన చారిత్రక ఉద్యమం అనంతరం తెలంగాణ రాష్ట్రం అవతరించి సంవత్సరం పూర్తి కావస్తున్న దశలో రకరకాల స్వరాలు వినిపిస్తున్నాయి. ‘ఇందుకేనా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు పణం పెట్టి పోరాడింది?’ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తేడా ఏమీ కనిపించడం లేదు. సమైక్య రాష్ట్రంలో ఉన్నట్టే అనిపిస్తున్నది’ అంటూ మరి కొందరు వాడి వేడి విమర్శలు కురిపిస్తున్నారు. నిరసన ధ్వనులను పట్టించుకో కుండా తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల సంబురాలకు సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏడాది పాలనను ఎట్లా అంచనా వేయాలి? తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 2014లో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికతో ప్రభుత్వం పని తీరును బేరీజు వేయాలా? పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనతో పోల్చాలా? 2001లో పార్టీని స్థాపించినప్పటి నుంచి మొన్నటి ఎన్నికల వరకూ తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చేసిన వాగ్దానాల పరంపర అమలు జరుగుతున్న తీరును తరచి చూడాలా?



తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినవారే అందరికంటే ముందుగా నిరాశ చెందినట్టు కనిపిస్తున్నారు. ఇది సహజం. ఎన్నో ఆశలతో ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు పోరాటం చేసినవారికి తమ ఆశలు అడియాసలు కావడం మనస్తాపం కలిగిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల భావజాలాలను విశ్వసించే విభిన్న వర్గాలు పాల్గొన్నాయి. ఉద్యమం మలిదశలో టీజాక్ వేదికగా తెరాస, భారతీయ జనతా పార్టీ, సీపీఐ, న్యూడెమాక్రసీ, మరి కొన్ని వామపక్షాలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాయి. విద్యార్థులూ, ఉద్యో గులూ, నిరుద్యోగులూ, సామాజిక కార్యకర్తలూ, కళాకారులూ, వివిధ వృత్తుల వారూ శక్తివంచన లేకుండా సమరం చేశారు. ప్రతి ఉద్యమకారుడికీ ఒక ప్రత్యేక దృక్పథం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉండాలో, ఏయే లక్ష్యాల కోసం కొత్త ప్రభుత్వం కృషి చేయాలో, ఏయే వర్గాలను ముందుగా ఆదుకోవాలో, ఏయే సమస్యలకు అగ్రతర ప్రాధాన్యం ఇవ్వాలో స్పష్టమైన అభిప్రాయం ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రశేఖరరావుకూ ప్రత్యేక నేపథ్యం ఉంది. తనదైన దృక్పథం ఉంది. ఆలోచనలు ఉన్నాయి. ఆకాంక్షలు ఉన్నాయి. శైలి ఉంది. ఈ అంశాలన్నీ ఆయనను నడిపిస్తున్నాయి.



అలవికాని వాగ్దానాలు

సుదీర్ఘకాలం సాగిన ఉద్యమంలో వివిధ వర్గాలతో కలసి నడిచే సమయంలో సందర్భానుసారం సముచితమని తోచిన వాగ్దానాలు కేసీఆర్ చేశారు. నంద మూరి తారకరామారావు రాజకీయరంగ ప్రవేశం చేసినప్పుడు నక్సలైట్లూ దేశ భక్తులే అన్నట్టు కేసీఆర్ సైతం నక్సలైట్లతో సమాలోచనలు జరిపి వారి ఎజెండాను అహింసాత్మకంగా అమలు చేస్తానంటూ వాగ్దానం చేసి ఉండవచ్చు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేసి తీరుతానంటూ భీషణ ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు. ఇటువంటివే ఇంకా అనేకం. ఉద్యమబాటలో అందరినీ కలుపుకొని పోయే క్రమంలో చేసిన వాగ్దానాలను ముఖ్యమంత్రి హోదాలో అమలు చేయడం అసాధ్యం.



 ఉద్యమ ఫలితంగా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వంపైన ప్రజలకు అసాధారణమైన స్థాయిలో, అసమంజసమైన రీతిలో ఆశలు ఉంటాయి. తెలం గాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సరళంగా చెప్పినట్టు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తికోసం సాగిన పోరాటానికి ప్రధాన ప్రేరకాలు మూడు: నీరు, నిధులు, నియామకాలు. ఈ మూడు రంగాలలో తెరాస ప్రభుత్వం ఏమి సాధిం చిందో పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం సమంజసం. ఒక వేళ ఏమీ సాధిం చకపోతే అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి.



 తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో మరొకరిని ఊహించు కోవడం కష్టం. పదమూడేళ్ల ఉద్యమం తర్వాత ఏర్పడిన తెలంగాణకు ముఖ్యమంత్రి కాదగిన వ్యక్తి ఉద్యమానికి సారథ్యం వహించిన కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్ నాయకులు కొందరు ఆ పదవిని ఆశించి ఉండవచ్చును కానీ ప్రథమ తాంబూలం కేసీఆర్‌కి ఇవ్వాలన్నదే జనాభిప్రాయం. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నా, సోనియాగాంధీ ఆశించినట్టు కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనమైనా ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి మాత్రం కేసీఆర్‌కే దక్కేది. ఈ విషయం ఎన్నికల ముందు ప్రకటించాలన్న కేసీఆర్ షరతును కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించకపోవడంతో విలీనం జరగలేదు. ఒంటరి పోరాటం చేసిన తెరాస అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. కేసీఆర్ రాజకీయ స్వభావంపైన అవగాహన ఉన్నవారికీ, ఆయన మనస్తత్వం తెలిసినవారికీ ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగించదు. కేసీఆర్ పట్ల అంచనా లేకుండా తాము ఆశించినట్టు ముఖ్యమంత్రి, ప్రభుత్వం వ్యవహరించాలని కోరుకుంటున్నవారికే ఆశాభం గం, ఆగ్రహం కలుగుతున్నాయి.



 సృజన, సాహసం

 కేసీఆర్‌ది ఇతర నేతలకంటే భిన్నమైన ధోరణి. గోలకొండపై జెండా ఎగుర వేసినప్పుడే తన సృజన, చారిత్రక స్పృహ, సాహసం ఏపాటివో చాటుకున్నారు. తెలంగాణలో బొగ్గ నిక్షేపాలూ, ఖనిజ సంపదా, ఇతర వనరులూ ఏవి ఎక్కడ ఎంత ఉన్నాయో క్షుణ్ణంగా తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్. జలవనరుల గురించి ఆసువుగా మాట్లాడగలరు. అంకెలు అలవోకగా చెప్పగలరు. ఆందుకే మాట వరసకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా ఆయన వినే దాని కంటే చెప్పేదే ఎక్కువ ఉంటుంది. ఉద్యమ కాలంలో కూడా సభలూ, ఎన్ని కలపైనే ఆయన దృష్టి పెట్టారు కానీ పార్టీ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. పార్టీ కార్యక్రమం, యంత్రాంగం, డబ్బూ ఉన్నప్పటికీ ప్రభంజనం (వేవ్) ఉంటేనే ఎన్నికలలో విజయం సాధించగలమనీ, వేవ్‌ను సృష్టించే వాగ్ధాటి, వ్యూహం అవసరమనీ ఆయన నమ్మకం. అందుకే ఉద్యమంలో దీర్ఘకాలిక విరా మాలు ఉండేవి. ఆరు మాసాలకు ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడం, మధ్యలో అప్పుడప్పుడు పదునైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అస్తమయం తర్వాతే, కేసీఆర్ నిరాహారదీక్ష, 2009 డిసెంబర్ 9న నాటి దేశీయాంగమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించడం, కోదండరామ్ నాయ కత్వంలో సంయుక్త రాజకీయ కార్యాచరణ సంఘం (జేఏసీ) ఏర్పడటం వంటి పరిణామాలు సంభవించాయి. అంతవరకూ ఉద్యమాన్ని నింపాదిగానే అయిన ప్పటికీ వ్యూహాత్మకంగా నడిపించిన కేసీఆర్ పరీక్షా సమయం వచ్చే సరికి అనూహ్యంగా విజృంభించారు. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని ఒంటరి పోరా టానికి సిద్ధపడి, సుడిగాలి పర్యటనలతో అపూర్వమైన రీతిలో ప్రచారం సాగించి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు. అంతటితో ఉద్యమ నేత పాత్ర ముగిసింది. ప్రభుత్వ సారథిగా కేసీఆర్ రెండో అవతారం ఎత్తి ఏడాది గడి చింది. ఉద్యమంలో ఆయన సహచరులతో సంప్రదించి తీసుకున్న నిర్ణయాల కంటే తనకు తట్టిన ఆలోచనలు (గట్ ఫీలింగ్) కార్యరూపంలో పెట్టి విజయాలు సాధించిన సందర్భాలే ఎక్కువ. ప్రభుత్వంలోనూ అదే తీరు.



ముఖ్యమైన నిర్ణయాలన్నీ తానే తీసుకోవాలి. తానే ప్రకటించాలి. తానే అమలు చేయాలి. కలలు కనడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో, కొత్త పుంతలు తొక్కడంలో సంకోచం లేదు. మిషన్ కాకతీయ కానీ వాటర్ గ్రిడ్ పథకం కానీ తెలంగాణ అవసరాలకు తగిన బృహత్కార్యక్రమాలు. పాలమూరు ఎత్తిపోతల పథకం, దళితులకూ, ఆదివాసీలకూ మూడు ఎకరాల చొప్పున సాగుభూమి ఇవ్వడం, దళిత, ఆదివాసీ ఆడపిల్లల పెళ్లికి కల్యాణల క్ష్మి పథకం అమలు చేయడం మంచి ఆలోచన. కేజీ టూ పీజీ ఉచిత విద్యకు సంబంధించి కూడా కేసీఆర్ పరిశీలనలో పెద్ద పథకాలు ఉన్నాయి. ఎంతటి దీక్షాదక్షతలు ఉన్నా ఒక్క చేతి మీదుగా ప్రభుత్వం నడవడం సాధ్యం కాదు. సమర్థులను ఎంచుకొని మంత్రులుగా నియమించుకోవాలి. వారికి స్వేచ్ఛ ప్రసాదించాలి. వారిని విశ్వసించాలి. తాను పర్యవేక్షించాలి. కేసీఆర్‌తో పాటు హరీష్‌రావు, తారకరామారావు (కేటీఆర్) గట్టిగా పని చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. కీలకమైన రెండు శాఖలు నిర్వహిస్తున్న కేటీఆర్ కాస్త ఎక్కువ కనిపిస్తున్నారు. తక్కిన మంత్రులు కూడా తమ విధులు నిర్వర్తిస్తున్నారేమో కానీ మీడియాలో అంతగా కనిపించడం లేదు. ప్రభుత్వం విజయాలు సాధించాలంటే మంత్రుల కంటే ఉన్నతాధికారుల సహకారం చాలా అవసరం. ఎన్‌టి రామారావు వంటి అసాధారణ రాజకీయ నాయకుడినే విఫ లం చేసిన ఘనత మన ఉన్నతాధికారులది. కేసీఆర్ అధికారులకు లొంగక పోవచ్చు. కానీ ‘ఎస్ సర్, ష్యూర్ సర్’ అంటూ సవినయంగా సహకరిస్తున్నట్టు కనిపిస్తూనే ముఖ్యమంత్రి నిర్ణయాలను వమ్ము చేయగల తెలివైన అధికారులున్నారు.



ఉన్నతాధికారులను రెండు రాష్ట్రాల మధ్యా పంపిణీ చేసే కార్యక్రమం దాదాపు సంవత్సర కాలం తీసుకుంది. మొదటి ఆరు మాసాలు ప్రభుత్వం లేనట్టే లెక్క. అధికారులు సమకూరి సర్కార్ గాడిలో పడే సరికి రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సవ్యం గా అమలు జరగాలంటే అధికారులు అంకితభావంతో పనిచేయాలి. అందుకే అమెరికా అధ్యక్ష వ్యవస్థలో అధ్యక్షుడితో పాటు ఎన్నికలలో పని చేసినవారే ప్రభుత్వాధికారులుగా చేరతారు. శాశ్వత అధికార వ్యవస్థ (పర్మనెంట్ ఎగ్జిక్యు టీవ్) అభివృద్ధికి అవరోధంగా పరిణమించిన దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఢిల్లీలో నరేంద్ర మోదీకైనా, హైదరాబాద్‌లో కేసీఆర్‌కైనా అధికార యంత్రాం గంతో సమర్థంగా పని చేయించడం ఎట్లాగన్నదే సమస్య.



 పెరుగుతున్న అశాంతి

 యువతలో అశాంతి మొదలయింది. లక్ష ఉద్యోగాలు ఎక్కడంటూ ప్రశ్నిస్తు న్నారు. నోటిఫికేషన్లు రానందుకు నిరసన వెలిబుచ్చుతున్నారు. ఉన్నత విద్య అస్తవ్యస్తంగా ఉంది. ఉన్న పది విశ్వవిద్యాలయాలకూ వైస్‌చాన్సలర్లు లేరు. విద్యుదుత్పాదన ప్రభుత్వ రంగంలోనే విస్తరించాలన్నది మంచి నిర్ణయం. ఐడీహెచ్ కాలనీ నిర్మాణం ప్రభుత్వం పట్ల ప్రజలలో విశ్వాసం పెంచుతుంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత కూడా ఇదే స్ఫూర్తి కొన సాగాలి. సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ సాధించి దర్జాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెరాస తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్‌పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్స హించడం, ఎన్నికలలో తెరాస అభ్యర్థులను ఓడించినవారిని స్వాగతించి మంత్రి పదవులతో సత్కరించడం రాజకీయ, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. మైనారిటీ ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు తాపత్రయపడితే అర్థం చేసుకోవచ్చును కానీ ప్రతిపక్షాలను బలహీనపరచడమే లక్ష్యంగా అడ్డ గోలుగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలలో ఎన్నింటిని నెరవేర్చగలరో తెలియదు. కానీ తెరాస చేయని వాగ్దానం ఒకటుం ది. అది రైతుల ఆత్మహత్యలకు సంబంధించింది. అన్నదాతల బల వన్మరణా లను గుర్తించడానికే నిరాకరించడం పలాయనవాదం.



http://img.sakshi.net/images/cms/2015-05/81433012148_Unknown.jpgజాతీయస్థాయిలోనే వ్యవసాయాన్ని గిట్టుబాటు చేయడానికి పెను ప్రయత్నం జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల సంఖ్యలో కౌలురైతులు అప్పులకు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటుంటే వారి ప్రస్తావన లేకుండా, వారిని ఆదుకునే ప్రయ త్నం లేకుండా సంబురాలు చేసుకోవడంలో ఔచిత్యం ఏమిటి?  ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలలో ఎన్నింటిని నెరవేర్చగలరో తెలియదు. కానీ తెరాస చేయనివాగ్దానం ఒకటుంది. అది రైతుల ఆత్మహత్యలకు సంబంధించింది. అన్నదాతల బలవన్మరణాలను గుర్తించడానికే నిరాకరించడం పలాయనవాదం. జాతీయస్థాయిలోనే వ్యవసాయాన్ని గిట్టుబాటు చేయడానికి పెను ప్రయత్నం జరగాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top