వైఎస్సార్‌ కలల ప్రాజెక్టు ప్రాణహిత–చేవెళ్ల

వైఎస్సార్‌ కలల ప్రాజెక్టు ప్రాణహిత–చేవెళ్ల - Sakshi


22వ ప్యాకేజీకి లైన్‌ క్లియర్‌

త్వరలోనే జీవో విడుదలవుతుంది

శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ


కామారెడ్డి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన ప్రాణహిత–చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని యథావిధిగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తెలిపారు. సోమవారం కామారెడ్డిలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి దివంగత సీఎం వైఎస్‌ ప్రాణహిత –చేవెళ్ల పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఈ పథకంలోని 22వ ప్యాకేజీలో మంచిప్ప నుంచి భూంపల్లి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.



అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టు రీడిజైన్‌ పేరుతో 22వ ప్యాకేజీని నిలిపివేసిందని, మల్లన్నసాగర్‌ నుంచి నీటిని ఇస్తామని చెప్పి సర్వేలు చేయించిందన్నారు. అది సాధ్యం కాకపోవడంతో మిడ్‌మానేరు నుంచి నీరు ఇస్తామన్నారని, అది కూడా సాధ్యం కాదని తేలిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులను పలుమార్లు కలిసి 22వ ప్యాకేజీని యథావిధిగా కొనసాగించాలని కోరామని తెలిపారు. భూంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించవచ్చని, భూసేకరణ కూడా చాలా వరకు జరిగిందని సీఎంకు వివరించామన్నారు. ఇదే విషయమై ఇటీవల ఇరిగేషన్‌ అధికారులు తనతో చర్చించారని, పాత ప్రణాళికతోనే సాధ్యమని తాను వారికి వివరించానని పేర్కొన్నారు. అధికారులు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు సరైన సూచనలు చేశారని, దీంతో వారు 22వ ప్యాకేజీకే మొగ్గుచూపారని తెలిపారు.



ఈ విషయాన్ని ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు తనకు చెప్పారన్నారు. త్వరలోనే జీవో విడుదలవుతుందన్నారు. ఈ ప్యాకేజీ పనులకు దివంగత సీఎం వైఎస్సార్‌ కామారెడ్డిలో శంకుస్థాపన చేశారన్నారు. పనులను ప్రారంభిస్తే ఏడాదిన్నరలో ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ప్రాణహిత –చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని తిరిగి చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సీఎం, భారీనీటిపారుదల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నల్లమడుగు సురేందర్, నల్లవెల్లి అశోక్, కైలాస్‌ శ్రీనివాస్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top