ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు


శ్రీకాకుళం అర్బన్: అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో సీఎం చంద్రబాబునాయుడు విశ్వాసం కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

  శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పలుమార్లు పర్యటించి వాగ్దానాలు ఇచ్చి వెళ్లారే తప్ప అమలు చేయలేదన్నారు. జిల్లాలో కళింగపట్నంలో విమానాశ్రయం, బావనపాడులో షిప్పింగ్‌హార్బర్, ట్రైబల్ యూనివర్సిటీ, తదితరవి ఏర్పాటు చేస్తామన్నారని, ఇవేవీ అమలు కాలేదన్నారు. ఇదేనా మీ పాలన అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో 11 కేంద్ర సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చిందని తెలిపారు. ఇప్పటికే 9 సంస్థలు ప్రారంభమయ్యాయన్నారు.

 

  మరో రెండు సంస్థలు ప్రారంభించాల్సి ఉందన్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు వీటిలో ఒక్క కేంద్ర సంస్థనైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన మంత్రి, విప్, ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర సంస్థను శ్రీకాకుళంలో నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు ఒత్తిడి తేవడం లేద న్నారు. ఇదేనా జిల్లాపై వారికి గల ప్రేమ అని అడిగారు. పోలాకి థర్మల్ ప్లాంట్‌ను ప్రజలు వ్యతిరేకిస్తుంటే పోలీసులతో లాఠీఛార్జి చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సోంపేట, కాకరాపల్లి కాల్పుల అనంతరం ప్రతిపక్ష హోదాలో జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఈ ప్లాంట్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

 

  అధికారం చేపట్టిన తర్వాత మాట మార్చి థర్మల్, అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధపడడం దారుణమన్నారు. ప్రజల నమ్మకాన్ని చంద్రబాబునాయుడు కోల్పోయారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ నేతలు సనపల నారాయణరావు, శిమ్మ వెంకటరావు, కోరాడ రమేష్, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top