హడావుడిగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్కా?

హడావుడిగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్కా? - Sakshi


హైదరాబాద్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య అంశంపై బుధవారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రిషితేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించకుండా హోటల్కు పిలిపించుకున్న ఘటన మంత్రులదని, ఇక్కడే వారి సంస్కారం అర్థం అవుతుందన్నారు. రిషితేశ్వరి చనిపోయిన తర్వాత తీరిగ్గా నాలుగు రోజులకు ప్రెస్మీట్ పెట్టి...హడావుడిగా శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొనడానికి మంత్రి హైదరాబాద్ వచ్చారని, అదే చిత్తశుద్ధి ర్యాగింగ్ అరికట్టేందుకు చిత్తశుద్ధే ఉంటే పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకునేవారు కాదన్నారు.



రోజా ఏం మాట్లాడారంటే... 'నాగార్జున వర్సిటీలో లైంగిక వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలపై రిషితేశ్వరి డైరీలో రాసుకుంది. ఆమె డైరీని చదివితే మనసున్నవారు ఎవరైనా కంటతడి పెట్టక మానరు. ర్యాగింగ్, లైంగిక వేధింపులే రిషితేశ్వరిని చంపేశాయని బాలసుబ్రహ్మణ్యం కమిటీ తేల్చింది. ముగ్గురిని అరెస్ట్ చేసి పనైపోయిందని సర్కార్ చేతులు దులుపుకుంటోంది. వర్సిటీలో చదువుకున్న అమ్మాయిలకే రక్షణ లేకపోతే...ఇక మిగతా వారికి ఎలా రక్షణ కల్పించగలరు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం ప్రిన్సిపాల్ బాబూరావే.



టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయి. కడపలోని నారాయణ కాలేజీలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను వేధిస్తున్నారని ప్రిన్సిపాల్కు రిషితేశ్వరి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ను నిరోధించాల్సింది పోయి ప్రిన్సిపాల్ బాబూరావు తాగి తందనాలు ఆడారు. వర్సిటీలో నిధులు దుర్వినియోగం చేశారంటూ బాబూరావు చెక్ పవర్ను రద్దుచేస్తే... ఆతర్వాత వచ్చిన వీసీ మళ్లీ మంజూరు చేశారు. బాబూరావు వెనక ఎవరున్నారో ఇట్టే అర్థం అవుతుంది. వర్సిటీ నిధులతో బాబూరావు మద్యాన్ని ఎలా కొనుగోలు చేయగలిగారు.





రిషితేశ్వరికి అవార్డు ప్రిన్సిపాల్ కాకుండా...వేధింపులకు గురి చేసిన అబ్బాయిలతో ఇప్పించారు. రిషితేశ్వరి ఘటన జరిగిన తర్వాత మంత్రులు వెంటనే ఎందుకు స్పందించలేదు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించలేదు. బాబూరావును ప్రాసిక్యూషన్ చేయాలని బాలసుబ్రహ్మణ్యం కమిటీ చెప్పినా సర్కారు చర్యలు తీసుకోలేదు. యాంటీ ర్యాగింగ్పై తాను తెచ్చిన చట్టాన్ని చంద్రబాబే ఎందుకు అమలు చేయటం లేదు' అని ప్రశ్నించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top