'లోకేష్, రమేష్ లే ప్రలోభ వీరులు'

'లోకేష్, రమేష్ లే ప్రలోభ వీరులు' - Sakshi


-వెనుక చంద్రబాబు మంత్రాంగం

-మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు

-రాజధానిలో ఎకరా భూమి, రూ. 20 కోట్లు క్యాష్ ఇస్తామన్నారు

-నీతిమాలిన ఎమ్మెల్యేగా నిలవదల్చుకోలేదు






విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో ఆయన తనయుడు లోకేశ్, ఎంపీ సీఎం రమేశ్లు ప్రలోభాల పర్వాన్ని కొనసాగిస్తున్నారని విశాఖ జిల్లా మాడుగుల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆరోపించారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వారిరువురూ తననూ ప్రలోభ పెట్టారని, టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఫిరాయింపులకు బ్రోకరేజ్ చేస్తున్నారని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో ఎకరా భూమి, రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు డబ్బు, పెద్దఎత్తున కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఎర వేశారన్నారు.



'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రస్తుతం నేను నిజాయితీ కలిగిన ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉన్నాను. మీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా మిగిలిపోతాను' అని వారికి స్పష్టం చేశానన్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు కూడా ఎంపీల నుంచి ఫోన్లు వచ్చాయని.. తాము చెప్పిన ప్యాకేజీలు నచ్చకపోతే.. కావాల్సినవి చెప్పుకునేందుకు లోకేశ్‌తో భేటీ ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు. తాను వారిని ఒక్కటే అడిగానని, లోకేశ్ వాళ్ల నాన్న కుర్చీ నాకు ఇవ్వగలడా?.. ఇస్తానంటే అప్పుడు ఆలోచిస్తా అని చెప్పగానే ఫోన్ కట్ చేశారని.. ఆ రోజు నుంచి మళ్లీ ఫోన్లు రాలేదన్నారు.



ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి రావద్దని ఆ పార్టీకి చెందిన ఒక సర్పంచ్ తనకు సలహా ఇచ్చారని, అంటే చంద్రబాబును ఆ పార్టీ నేతలు ఎంతలా అసహ్యించుకుంటున్నారో దాన్ని బట్టి అర్థమవుతోందని ముత్యాలనాయుడు అన్నారు. వచ్చే మూడేళ్ల ఆస్తులు సంపాదించుకోవడమే లక్ష్యంగా కొందరు వంచన బాబు పంచన చేరుతున్నారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారన్నారు. చంద్రబాబు అండతో బాక్సైట్ గనులను తవ్వుకోవచ్చున్న ఆశతో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరితే.. ఏజెన్సీలో వైఎస్సార్‌సీపీ ఖాళీ అయిపోయిందని పత్రికల్లో కధనాలు రాయించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.


చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కిడారితో కలసి అరకులో నువ్వు సభ పెట్టు.. అదే రోజు మేము అక్కడే మా జగన్‌తో సభ పెడతాం.. గిరిజనం ఎవరి వెంట ఉన్నారో తేలిపోతుందని ఆయన సవాల్ చేశారు. ఒక ఎమ్మెల్యే వెళ్తే.. వందమంది ఎమ్మెల్యేలను తయారుచేయగల సత్తా మా పార్టీ నాయకుడు జగన్‌కు ఉందన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు 150 ఎకరాల కోసం టీడీపీలో చేరారని విమర్శించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top