'సీబీసీఐడీతో విచారణ జరపాలి'


►  రూ.కోట్లు మింగేసిన పెద్దలను పట్టుకోవాలి

 ► ఉపకార వేతనాలపై ఎమ్మెల్యే కళావతి


 

శ్రీకాకుళం: కోట్లాది రూపాయల ఉపకార వేతనాలను కాజేసిన పెద్దలను పట్టుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి డిమాండ్ చేశారు. మండలంలోని వడ్డంగి, నులకజోడు, చిన్నదిమిలి గ్రామాల్లో ఆమె ఆదివారం పర్యటించారు. ప్రజా సమస్యలు గుర్తించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2009 సంవత్సరం నుంచి జిల్లాలో ఉపకారవేతనాల స్వాహాకు తెరలేచిందన్నారు. దీనిపై సీబీసీఐడీ విచారణ జరపాలని కోరారు. కుంభకోణంతో సంబంధమున్న చాలామంది పెద్దలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్నారు. వారిని బయటకు లాగాలన్నారు. చిరుద్యోగులను బలిచేసి బడాబాబులను వదిలేయడం విచారణ అధికారులకు తగదన్నారు.

 

కరువు నిరసనకు పిలుపు

 వర్షాభావంతో జిల్లాలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అక్రమాలకు తావిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందన్నారు. కరువు సాయం అందజేసేవరకు పోరాటం సాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాగునీటి వెతలు తీర్చాలని అధికారులను నిలదీయాలని కోరారు. చివరిగా నులకజోడుకు చెందిన పి.శ్రీనివాసరావు మృతిచెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నదిమిలిలో మాతృవియోగం పొందిన ఆర్‌ఐ ఎస్.రాంబాబును పరామర్శించారు. ఆమె వెంట మనుమ కొండ ఎంపీటీసీ సభ్యురాలు బోదెపు స్వాతి, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు తోట సింహాచలం, సహకార డెరైక్టర్ బోదెపు  రఘుపతినాయుడు, రైతు విభాగం అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, ఎస్టీ సెల్ కార్యదర్శి పి.శ్రీను, మాజీ సర్పంచ్ అర్లిరాజు, కిల్లాన భూషణరావు, నీటి సంఘ అధ్యక్షుడు ఎస్.విశ్వనాథం, వలరౌతు పాపినాయుడు, ఏఎంసీ మాజీ చెర్మైన్ కె.చిరంజీవి, బి.ధర్మారావులు ఉన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top