వైఎస్సార్‌సీపీ నాయకుల గృహ నిర్బంధం


విజయనగరం మున్సిపాలిటీ: భోగాపురం మండలంలో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాలను అవలంబించడం దారుణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు.  బుధవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా..అల్లర్లు సృష్టిస్తారన్న  నెపంతో పోలీసు యంత్రాంగంతో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు మజ్జి.శ్రీనివాసరావు, భోగాపురం మండల నాయకుడు ఉప్పాడ.సూర్యనారాయణలను మజ్జి శ్రీనివాసరావు ఇంట్లో గృహనిర్బంధం చేశారు. ప్రతిపక్ష నాయకులు ఉదయం నుంచి  బయటకు వెళ్లకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు.



 రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ప్రజా కంటక పాలన సాగుతోందన్నారు.భోగాపురం ప్రాంత ప్రజలు, రైతులు తమకు విమానాశ్రయం అవసరం లేదని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, జిల్లాకు చెందిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజులు మొండిగా వ్యవహరిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారన్నారు. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకోవడంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం బాధిత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటం చేస్తున్నవారిపై  గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసు బలగాలతో ప్రజా ఉద్యమాలను అణిచివేయలేరని, అక్కడి ప్రజల మనోభావాల మేరకు వారి పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం  చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top