జగన్‌పై విమర్శలకేనా మహానాడు?

జగన్‌పై విమర్శలకేనా మహానాడు? - Sakshi


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన



 సాక్షి,హైదరాబాద్‌: టీడీపీ మహానాడు..తమ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై విమర్శలు చేయడానికే నిర్వహిస్తున్నట్లు ఉందిగానీ, ప్రజలకిచ్చిన హామీల అమలు, గడిచిన రెండేళ్లలో ఆ పార్టీ తప్పొప్పులపై చర్చించుకోవడానికి కాదన్నట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు.శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలోని వారు అవినీతికి పాల్పడుతుంటే వాటిని ప్రశ్నించిన వారిని అభివృద్ధి నిరోధకులంటూ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. ‘వేంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతి ఎన్నికల సభలో అనేక వాగ్దానాలు చేశారు.  దానిపై చర్చలేదు. విభజన సమయంలో రాష్ట్రానికిచ్చిన హామీలు ఎంత వరకు నెరవేరాయి.అన్న దానిపైనా ప్రస్తావనే లేదు.



రైతులకు రుణ మాఫీ ప్రకటనను రెండేళ్లుగా తీర్చలేకపోయారు. డ్వాక్రా మహిళలకు రుణాల రద్దు వాగ్దానం అమలుపైనా మహానాడులో ఒక్క మాట లేదు’ అని తూర్పారపట్టారు.అమరావతి పరిసరాల్లో భూములు కొని రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న టీడీపీ నేతల అవినీతిని మాత్రమే ైవె ఎస్సార్‌సీపీ తప్పుపడుతోంది తప్ప.. రాజధానికి తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. హైదరాబాద్ రింగురోడ్డు విషయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించి తప్పులేదని నిరూపించుకున్న తీరునే నేతల భూ కొనుగోళ్లపై విచారణకు చంద్రబాబు సిద్ధపడాలన్నారు.



 సిగ్గులజ్జా ఉంటే విచారణ జరిపించు..: తుని సంఘటనపై జగన్‌మోహన్‌రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. దమ్ము ధైర్యం, సిగ్గు లజ్జా ఉంటే సీబీఐతోనో సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిపించాలని భూమన సవాల్ విసిరారు.



 పరిటాల కేసు నిందితులను అక్కున చేర్చుకుంది బాబేగా..: పరిటాల రవి హత్యకేసులో ఆరోపణలున్న జేసీ దివాకర్‌రెడ్డిని అక్కున చేర్చుకుంది చంద్రబాబు కాదా అని భూమన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొంటానన్న వాగ్దానం చేయకపోయినా చంద్రబాబు దాన్ని అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top