శ్వేతపత్రం విడుదల చేయాలి

శ్వేతపత్రం విడుదల చేయాలి - Sakshi


వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్‌



సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విదేశీ పర్యటనలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. ఓ వైపు డబ్బులు లేవంటూనే మరో వైపు వందల కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి పైసా పెట్టుబడి తీసుకురాకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు దావోస్‌కు ఎందుకు వెళ్లి వస్తున్నారో అర్థం కావడం లేదని..‘సింగడు అద్దంకి వెళ్లినట్టు వచ్చినట్టు’ ఆయన విదేశాలకు వెళ్లివస్తున్నారని ఎద్దేవా చేశారు.  ఇంతవరకు 13 సార్లు చంద్రబాబు దావోస్‌ వెళ్లివచ్చారని, స్విస్‌ బ్యాంకు లెక్కలు సరి చూసుకోవడానికే అక్కడికి వెళ్తున్నారనే అని అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు చేస్తున్నవన్నీ 420 పనులేనన్నారు.

 

హోదాకు బాబే అడ్డంకి: ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డంకి అని ఆయన హోదాను నీరుగార్చుతున్నారని విమర్శించారు. జల్లికట్టు ఉద్యమానికి ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటని చంద్రబాబు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. జల్లికట్టు సంస్కృతి అయితే, ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వంపై మాత్రమే కాదని కేంద్రానికి మద్దతు ఇస్తున్న టీడీపీ, చంద్రబాబులపై మీద తిరగబడాలని పిలుపునివ్వాలని అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26న నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో పార్టీ శ్రేణులే కాకుండా హోదా కోరుకునే ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.



లోకేష్‌ కుట్ర: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని పర్యటనలో ఉండగా జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ ప్రాంతానికి రాక వెనుక నారా లోకేష్‌ కుట్ర దాగుందని అంబటి విమర్శించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top