అవి జన విద్రోహ యాత్రలు

అవి జన విద్రోహ యాత్రలు - Sakshi


♦ వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం

♦ ఏ ముఖం పెట్టుకుని జనంలోకి వెళుతున్నారు బాబూ..

♦ రైతుల రుణాలన్నీ మాఫీ అన్నారు.. ఏడువేల కోట్లిచ్చి సరిపెట్టారు..

♦ తమ ప్రజాబ్యాలెట్‌కు సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్

 

 సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహిస్తున్నవి జనచైతన్యయాత్రలు కావని, అవి జనవిద్రోహ యాత్రలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? ఈ ఏడాదిన్నర పాలనలో ఏ హామీని పూర్తిగా అమలు చేశారని ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళుతున్నారు? అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. ‘‘రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్నారు. రూ.7,000 కోట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు.



తరువాత లక్ష రూపాయలన్నారు. ఆ తర్వాత పదివేలన్నారు. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా వారి రుణాల్ని మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగమిస్తామన్నారు. రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్కరికైనా నిరుద్యోగభృతి ఇచ్చారా?’’ అని అంబటి నిలదీశారు. ఈ హామీల్లో వేటినీ నెరవేర్చకుండా ఏం చైతన్యం తెద్దామని వెళుతున్నారని ఆయన ప్రశ్నిస్తూ.. ప్రజల్ని మోసం చేయడానికి వెళుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు హామీలపై వంద ప్రశ్నలతో తాము ఒక ప్రజాబ్యాలెట్‌ను విడుదల చేశామని, వీటిలో ఒక్కటైనా నెరవేర్చారేమో ఆయన సమాధానం చెప్పాలని, ప్రజలూ గమనించాలని అంబటి కోరారు. ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి, పరిష్కరించడానికి జనంలోకి చంద్రబాబు వెళ్లట్లేదని, లోకేశ్‌ను ప్రమోట్(ప్రాచుర్యం) చేసుకునేందుకు వెళుతున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు.  



 కృష్ణాలో ప్రజలపై దండయాత్ర

 కృష్ణా జిల్లాలోని కరగ్రహారంలో తమ వద్ద నుంచి పోర్టుకోసమని తీసుకుని ప్రైవేటు కంపెనీలకిచ్చిన భూముల్ని తిరిగి ఇవ్వాలంటూ స్థానిక రైతులు జనచైతన్యయాత్రలో పాల్గొ న్న మంత్రిని కోరితే.. వారిపై టీడీపీ తాబేదార్లు దౌర్జన్యం చేయడం దారుణమని అంబటి అన్నారు. రైతులకు సమాధానం చెప్పాలిగానీ.. వాళ్ల మెళ్లో గొలుసులు లాక్కుని కొట్టించడం ఏం పద్ధతని ప్రశ్నించారు. మిగతాచోట్ల విద్రోహయాత్రలుగా జరుగుతున్న జనచైతన్యయాత్రలు కృష్ణా జిల్లాలో జనంపై దండయాత్రగా సాగుతున్నాయన్నారు.



 ఇదేనా మీ అనుభవం?

 అనుభవ జ్ఞుడని చంద్రబాబును సీఎంను చేస్తే ఆయన ప్రజలతో ప్రయోగాలు చేస్తున్నారని అంబటి విమర్శించారు. ‘‘ఇసుక తవ్వకాలపై డ్వాక్రా మహిళలకు హక్కులిస్తూ నిర్ణయం తీసుకున్నామని, అది విఫలమైనందువల్ల ఆ విధానాన్ని సమీక్షించి మారుస్తామని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. అలాగే ప్రభుత్వమే మద్యం అమ్మాలని నిర్ణయం తీసుకుని పదిశాతం షాపుల్ని ప్రభుత్వంతో నడిపించి భంగపడ్డారు. దీంతో మద్యం షాపుల్ని పాతపద్ధతిలోనే వేలం వేయడానికి సిద్ధమయ్యారు.



తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఇదేనా?’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించనందుకు నిరసనగా కాపునేత ముద్రగడ పద్మనాభం జనవరి 1న భారీఎత్తున బహిరంగసభ నిర్వహించబోతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు రిజర్వేషన్లపై కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారని అంబటి తెలిపారు. కాపుల సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.ఐదువేల కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారని, ఈ రెండేళ్లకు రూ.2,000 కోట్లను కనుక కేటాయించి ఖర్చుచేస్తే బాబు చిత్తశుద్ధిని నమ్మవచ్చని అంబటి ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top