పాలన బాగుంటే ‘పత్రా’లెందుకు?

పాలన బాగుంటే ‘పత్రా’లెందుకు? - Sakshi


చంద్రబాబు తీరుపై వైఎస్సార్‌సీపీ ధ్వజం

♦ నిజాలు కప్పిపుచ్చడానికి న్యూస్ పేపర్లు, వైట్ పేపర్లను నమ్ముకున్నారు

♦ ఇసుక దోపిడీలో టీడీపీ నేతల పాత్ర లేదని  నమ్మించడానికి సీఎం తంటాలు

♦ {పభుత్వానికి 12 ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన బాగుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిదానికీ శ్వేతప్రతాలతో హడావుడి చేయడం ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోయినా అన్నీ చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి.. అవన్నీ నిజమేనని నమ్మించడానికి రెండురకాల పేపర్లను నమ్ముకున్నారని పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అందులో ఒకటి న్యూస్ పేపర్ కాగా రెండోది వైట్ పేపర్ (శ్వేతపత్రం) అని ఎద్దేవా చేశారు. ‘వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోయినా పూర్తిగా మాఫీ చేశానంటారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేశానంటారు.



విద్యుత్ నిరంతరాయంగా వస్తోందంటారు..’ ఇలాంటివి మరెన్నో రాయటానికి, నిజాలను కప్పిపుచ్చటానికి చంద్రబాబు న్యూస్ పేపర్లు, వైట్ పేపర్లను ఆశ్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గత 18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, గ్రామస్థాయి నాయకుల పాత్ర లేదని నమ్మించడానికి శ్వేతపత్రం పేరుతో ముఖ్యమంత్రి నానా తంటాలు పడ్డారన్నారు. ఇసుక ధరను సామాన్యుడి అందుబాటులోకి తేలవాలన్న పట్టుదల, జరుగుతున్న దోపిడీని అరికట్టాలనే చిత్తశుద్ధి ఉండాలే గానీ శ్వేతపత్రాల పేరుతో డ్రామాలెందుకని ప్రశ్నించారు.



చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఇసుక ధర అమాంతం పెరిగి నిర్మాణ ఖర్చులు ఆకాశాన్నంటాయన్నారు. నిర్మాణాలన్నీ మధ్యలో ఆగిపోవడంతో కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఇసుక విధానంపై విడుదల చేసిన శ్వేతప్రతానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ పరంగా 12 ప్రశ్నలను సంధించారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.



 ఒక్క మహిళనైనా లక్షాధికారిగా మార్చారా?

► డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌లు అప్పగించి, ఇసుక వేలం ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం వారికి ఇవ్వడం ద్వారా వారందర్నీ లక్షాధికారులను చేస్తామని పదే పదే ప్రకటించారు. ఈ 18 నెలల్లో ఎంతమందిని లక్షాధికారులుగా చేశారు? కనీసం ఒక్కరినైనా లక్షాధికారిగా మార్చగలిగారా?

► ఇసుక బాధ్యతలతోపాటు ఇసుక అక్రమాలకు సంబంధించిన కేసులు డ్వాక్రా మహిళల మీద పెట్టించిన ఘనత మీ ప్రభుత్వానిది కాదా? దోపిడీ సొమ్ములు మీవి, కేసులు మాత్రం డ్వాక్రా మహిళలవి అనే విధానంలో మీ ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడటం అందరికీ తెలిసిన విషయం కాదా?

► నిజాలు చెప్పే ప్రభుత్వ పత్రాన్ని శ్వేతపత్రం అంటారు. అబద్ధాలు చెప్పే పత్రాన్ని కూడా శ్వేతపత్రం అనే అంటారా?

► ఇసుకపై ప్రభుత్వానికి వచ్చే రాయల్టీని వంద శాతం పెంచినమాట వాస్తవం కాదా? ఏటా రూ.2.5 వేల కోట్ల మేరకు ఇసుక రీచ్‌ల ద్వారా ఆదాయం వస్తుందని గతంలో మీరే చెప్పారు. అలాంటిది గత 15 నెలల్లో ఇసుక ద్వారా పొందిన ఆదాయం కేవలం రూ.831 కోట్లు మాత్రమే అంటే.. మిగతా ఇసుకనంతా ఎవరు దోచేశారు? ఎక్కడికి పోయాయి వేల కోట్లు?

► 18 నెలలుగా మీ ప్రభుత్వం సహజ సంపద లూటీలో ప్రపంచ రికార్డును నెలకొల్పటం నిజం కాదా? చివరికి ఇసుకను కూడా వదలని అధికార పార్టీని ఇంతకుముందు ఏనాడైనా చూశామా?



 ‘మీ మీడియా’ కథనాలకేం  జవాబు చెబుతారు?

► మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసుకుంటూ భారీగా సొమ్ములు మూటకట్టుకుంటున్నారని మీకు అనుకూల మీడియానే పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించింది. మరి వాటికేం సమాధానం చెబుతారు?

► మీరు విడుదల చేసిన శ్వేతపత్రం 4వ పేజీలో జిల్లాల వారీగా ఇసుక ద్వారా వచ్చిన ఆదాయాన్ని బార్ డయాగ్రమ్‌లో ఇచ్చారు. అక్కడ జిల్లాల పేర్ల బదులు శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడుకు, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమకు, చింతమనేని ప్రభాకర్‌కు, తూర్పు గోదావరిలో యనమల రామకృష్ణుడు కుటుంబానికి... ఇలా జిల్లాల వారీగా మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అంతకు పదింతలు దోపిడీ సొమ్ము దక్కిందని కూడా బార్ డయాగ్రమ్‌లో ఇస్తే బాగుండేది కదా?

► మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఛోటా మోటా నాయకులపై.. ఇసుక దోపిడీకి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకే జనవరి 1 నుంచి ఇసుక విధానంలో మార్పులు అంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నది నిజం కాదా?

► కొత్త విధానానికి అర్థం.. డ్వాక్రా మహిళలను తప్పించి టీడీపీ నేతలు, మీకు కావాల్సిన వ్యక్తులకు ఇసుక దోపిడీకి  లెసైన్స్‌లు ఇవ్వటమే కాదా?

► ఏడాదిన్నర క్రితం ట్రాక్టర్ ఇసుక ఖరీదు రూ.1,000 లోపుంటే ఇప్పుడది రూ.3 వేలకు పైగా పలుకుతోంది. అంటే ఇల్లు కట్టుకునే సామాన్యుడి మీద 3 రెట్లు భారం పడింది. మరి ప్రభుత్వ ఆదాయం ఇదే నిష్పత్తిలో కనపడటం లేదంటే ఇసుకను తెలుగుదేశం శ్రేణులు నిలువుదోపిడీ చేస్తున్నట్టు రుజువు అవుతోంది కదా.

► ‘మా గ్రామం లేదా జిల్లాలో ఎటువంటి ఇసుక దోపిడీ జరగటం లేదు, అధికార పార్టీ వారి అండదండలు ఇసుక దోపిడీకి లేవు..’ అని చెప్పగలిగే పరిస్థితి 13 జిల్లాల్లో ఒక్కచోటనైనా ఉందా?

► ఒకప్పుడు మాఫియా అనే పదం వింటే ముంబై గుర్తొచ్చేది. దావూద్ ఇబ్రహీం లేదా ఛోటా రాజన్ గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు గ్రామ గ్రామాన ఇసుక మాఫియాను వ్యవస్థీకృతం చేసిన ఘనత మీది కాదా? చివరికి చింతమనేని ప్రభాకర్‌ను చట్టాన్ని పరిరక్షిం చే వ్యక్తిగా, డ్వాక్రా మహిళల్ని రక్షించే బాధ్యతలో ఉన్న వ్యక్తిగా చిత్రించేందుకు శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీరు చేసిన ప్రయత్నం చూసినప్పుడు బిన్ లాడెన్‌ను కూడా మీరు గాంధేయవాదిగా చెప్పే ప్రయత్నం చేస్తారేమోనని మాకు భయమేస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top