రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం


► వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు

► కేంద్ర కార్యనిర్వాహక మండల సభ్యుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి




గన్నేరువరం: రైతుల సంక్షేమమే తమ ధ్యేయమంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. పూర్తిగా రైతులను విస్మరిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. మండలంలోని గుండ్లపల్లిలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.


రైతులకు నాల్గో విడుత రుణామాఫీ, ఐకేపీ, సహకార సంఘాల వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని తెలిపారు. మూడేళ్లుగా రైతులకు సహకార ప్రాథమిక సంఘాల్లో 6 శాతం రాయితీ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. జీఎస్టీతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రైతులకు సంబంధించిన ఎరువులు, విత్తనాలపై సడలించాలన్నారు. డీజిల్‌తో పాటు మధ్యంపై జీఎస్టీని అమలు చేయాలని సూచించారు.



ఈ ఏడాది నుంచే అమలు చేయాలి..

ఈ ఏడాది నుంచే రైతులకు పెట్టుబడి రూ.8 వేల ఆర్థిక సహాయాన్ని అమలు చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసం వచ్చే ఏడాది నుంచి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్నారని తెలిపారు.


అలాగే మామిడిపండ్లకు సంబంధించి కార్బేట్‌ నిషేధంతో ఆ రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. రైతులకు ట్రాక్టర్ల పంపిణీలో గోల్‌మాల్‌ జరుగుతోందని ఆరోపించారు. రైతులు ఏడ్చిన చోట, ఎద్దు ఏడ్చిన రాజ్యం నిలువదన్నారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పారుపల్లి వేణుగోపాల్‌రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, రాష్ట్ర యూత్‌ కార్యదర్శి దుబ్బాక సంపత్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top