'జర్నలిస్టుల విషయంలో వైఎస్ నాకు స్ఫూర్తి'

'జర్నలిస్టుల విషయంలో వైఎస్ నాకు స్ఫూర్తి' - Sakshi


గుంటూరు: రాజకీయ వ్యవస్థను మార్చగలిగే, శాసించే సత్తా జర్నలిజానికి ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ముగింపు మహాసభకు హాజరయిన ఆయన మాట్లాడారు. . విలేకరులతో ఎప్పటికీ విభేదాలు ఉండవని, ఉండొద్దని తన తండ్రి, ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చెప్పిన సంగతిని వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు.  మున్ముందు తనకు కూడా వైఎస్సారే స్ఫూర్తి అని, జర్నలిస్టులపై వైఎస్సార్కు ఎలాంటి అభిప్రాయం ఉండేదో తనకూ అలాంటి అభిప్రాయమే ఉంటుందని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత  వైఎస్సార్ కే దక్కుతుందన్నారు.



ఇక ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడు తీరును ఆయన ఎండగట్టారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ను టీడీపీ, బీజేపీ మోసం చేశాయని అన్నారు. దొంగతనానికి పాల్పడిన వారిపై సైతం 420 కేసులు పెడుతున్నారని.. అలాంటప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబునాయుడిపై ఎలాంటి కేసులు పెట్టాలని జగన్ ప్రశ్నించారు. అసలు ఇలాంటి వారిని సరిగా ప్రశ్నించగలుగుతున్నామా అని అన్నారు. మనందరికీ ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నించగలిగినప్పుడే అన్ని సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుందని వైఎస్ జగన్ చెప్పారు.



ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన వారు నేడు పక్కా పథకం ప్రకారం ఆ విషయాన్ని పక్కకు నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను నిలువరించేందుకే వైఎస్సార్సీపీ ముందడుగు వేస్తోందని చెప్పారు. ఈ నెల 29న ఇచ్చిన బంద్ పిలుపు తన కోసమో, తన కుటుంబం కోసమో కాదని, యావత్ ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్ కోసమని గుర్తు చేశారు. ఈ బంద్ను విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి కుట్రలు చేస్తారని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆ రోజూ బంద్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top