కడుపునిండా తింటూ అడ్డగోలు వ్యాఖ్యలా?

కడుపునిండా తింటూ అడ్డగోలు వ్యాఖ్యలా? - Sakshi


హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షపై రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిరాహార దీక్ష చేస్తున్న జగన్ షుగర్ లెవెల్స్ తగ్గడానికి బదులు పెరుగుతున్నాయని అంటూ.. పరోక్షంగా ఆయన సరిగా దీక్ష చేయడం లేదన్నట్లు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆయన దీక్ష మీద తమకు అనుమానాలు ఉన్నాయని, రాత్రి కంటే ఉదయానికి షుగర్ ఎలా పెరిగిందో విచారణ చేయిస్తామని కూడా అన్నారు.



అయితే.. కొంతమంది నాయకుల్లా దొంగ దీక్షలు చేయడం వైఎస్ జగన్కు అలవాటు లేదన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలి. రాష్ట్ర విభజనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో దానికి నిరసనగా.. చంచల్గూడ జైల్లో ఐదు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఎవరు చూసినా, చూడకపోయినా ఆయన తన దీక్షను కొనసాగించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో.. నాటి ప్రభుత్వం బలవంతంగా తొలుత ఉస్మానియా ఆస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి నిమ్స్కు తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు.



ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా గాంధేయమార్గంలో నిరాహార దీక్షలు చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనం. ఎవరు చూసినా చూడకపోయినా తాను నమ్ముకున్న విధానాన్ని మనసా వాచా కర్మణా ఆచరిస్తారు. అందుకే ఇప్పటివరకు అనేక దీక్షలు చేసిన దీక్షాదక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలో లక్ష్యదీక్ష, ఢిల్లీలో జల దీక్ష, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలంటూ నాలుగు రోజుల పాటు హరితయాత్ర, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా విశాఖలో జనదీక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కోసం హైదరాబాద్లో ఫీజుపోరు, రైతుల కోసం గుంటూరులో రెండు రోజుల నిరాహారదీక్ష.. ఆపై చంచల్గూడ జైల్లో ఐదు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆరు రోజులుగా గుంటూరు నల్లపాడు రోడ్డులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.



ప్రభుత్వాస్పత్రులు, వైద్య యంత్రాంగం తమ చేతుల్లో ఉంది కదాని వైఎస్ జగన్ మీద బురద చల్లేందుకు నివేదికలను ఇష్టం వచ్చినట్లు రూపొందిస్తున్నారు. తప్పుడు నివేదికలు ఇవ్వడం ద్వారా వాళ్లు ఏం సాధించాలనుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తమ నేత ఆరోగ్యం మరింత విషమించాలన్నది వాళ్ల లక్ష్యమా అని నిలదీస్తున్నారు. ఆరు రోజులుగా పచ్చిగంగ కూడా ముట్టకుండా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న నేతను ఉద్దేశించి మూడు పూటలా కడుపునిండా తింటున్నవాళ్లు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. రాజకీయాలను ఇంతగా దిగజార్చడం దారుణం అనిపిస్తోందంటున్నారు.



ప్రభుత్వం అంటే.. ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రప్పించేందుకు ప్రయత్నించాలి గానీ.. కుటిల, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మెడికల్ రిపోర్టులను కూడా తారుమారు చేసే స్థాయికి దిగజారకూడదని మండిపడుతున్నారు. కావాలంటే తామేం సాధించామో, ఏం చేశామో చెప్పుకోవాలి గానీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడకూడదని చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top