‘భిక్షాటన’ కన్పించలేదా ‘బాబూ’!!

‘భిక్షాటన’ కన్పించలేదా ‘బాబూ’!! - Sakshi


– ‘అన్నదాత భిక్షాటన’పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్షనేత వైఎస్‌ జగన్‌

– డబ్బు ఆశతోనే రైతులు వలసెళుతున్నారని మంత్రి అయ్యన్న సమాధానం

– బతికేందుకు భిక్షాటన చేస్తుంటే రైతుల బతుకులను హేళన చేసేలా ప్రభుత్వ తీరు

– మూణ్నెళ్లుగా కూలీలకు అందని వేతనాలు..150రోజుల పనిదినాలు ఉత్తిదే

– కూలీలకు రోజు సగటు కూలి రూ.60–110 మాత్రమే వస్తున్న వైనం

– ఈ స్థితిలో వలసలు పోకుండా ఉపాధి పనికి ఎలా వెళతారంటున్న రాజకీయపార్టీలు

– వాస్తవాలు విస్మరించి ‘డ్వామా అధికారుల’ లెక్కలే నిజమనుకుంటున్న జిల్లా యంత్రాంగం




(సాక్షిప్రతినిధి, అనంతపురం)



ఇదిగో ఈ ఫొటోలో దీనంగా ఉన్న రైతు పేరు భాస్కర్‌రెడ్డి. ఊరు పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం గూనిపల్లి. మంచిపలుకుబడి ఉన్న రైతు. 1978లో పదో తరగతి వరకు చదివాడు. తనకున్న 8ఎకరాల్లో కంది సాగు చేశాడు. మారాల సిండికేట్‌ బ్యాంకులో రూ.లక్ష పంటరుణం తీసుకున్నాడు. గతేడాది ఆగస్టులో వర్షాభావంతో పంటపూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సెప్టెంబరులో కేరళకు వలసొచ్చాడు. వారంలో ఒకరోజు పని ఉంటే మూడు రోజులు ఉండదు. దీంతో భిక్షాటన చేస్తూ బతుకీడిస్తున్నాడు.



ఈ ఫొటోలోని రైతుపేరు గంగిరెడ్డి. పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ. రెండెకరాల పొలం ఉంది. వేరుశనగ సాగు చేశాడు. రూ.40 వేలు పెట్టుబడి అయింది. రూ.30 వేలు బ్యాంకులోన్‌ తీసుకున్నాడు. పంట తుడిచిపెట్టుకుపోయింది. బతికేందుకు కేరళకు వచ్చాడు. ఇక్కడా పనులు అంతంత మాత్రంగానే ఉండటంతో భిక్షాటన చేస్తున్నారు. రోజంతా భిక్షం ఎత్తితే రెండొందలు వస్తుంది. డబ్బుతో పాటు అన్నం కూడా భిక్షంగా వేస్తారు. అన్నం తిని వచ్చిన డబ్బును దాచుకుని ఇంటివద్ద ఉన్న భార్య అంజనమ్మకు పంపిస్తాడు.



‘ఉపాధి’ లేక బతికేందుకు కేరళలోని కొచ్చిన్‌కు వెళ్లిన వారి దీనస్థితి ఇది. ఇలా వీరిద్దరే కాదు...వేలాది మంది దుర్భరజీవితం గడుపుతున్నారు. కేరళలోని ‘అనంత’ రైతుల దుర్భర జీవితంపై అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరి 1, 2, 3తేదీల్లో ‘సాక్షి’ కొచ్చికి వెళ్లింది. రైతుల కష్టాలపై అదే నెల 6న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆపై సీపీఐ నేతలు ‘అనంత’ నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధుల బృందాన్ని కేరళ, కర్ణాటకకు తీసుకెళ్లారు. వీరు కూడా రైతుల భిక్షాటనను కళ్లకు కట్టేలా చూపించారు. ప్రపంచానికి మొత్తం తెలిసిన ఈ దీనగాథలు ప్రభుత్వానికి మాత్రం కన్పించలేదు. ఉపాధి లేక కేరళకు వెళ్లలేదని, డబ్బు ఆశతో వెళుతున్నారని ప్రభుత్వం వ్యాఖ్యానించడం చూస్తే ‘అనంత’ కరువురైతులపై ఏమేరకు చిత్తశుద్ధి ఉందో ఇట్టే తెలుస్తోంది.  



అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్షనేత

అనంత రైతుల కష్టాలపై ‘అన్నదాత భిక్షాటన’ పేరుతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని శనివారం విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వలసెళ్లినవారు రోజూ రూ.500 డబ్బు వస్తుందనే ఆశతో వెళుతున్నారని, ఉపాధి లేక కాదని రైతు బతుకులను హేళన చేసేలా మాట్లాడారు. రైతులు భిక్షాటన చేస్తున్నారంటే అధిక డబ్బులు వస్తాయనే ఆశతో వెళుతున్నారని చెప్పడం దౌర్భాగ్యమని జగన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన ఈ చర్చపై శనివారం అనంతపురంలోని రైతులు, రైతుకూలీలు, రాజకీయ, మేధావి వర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది. బాధ్యత లేకుండా మంత్రి అయ్యన్న మాట్లాడటాన్ని సర్వత్రా ఖండించారు.



మూడు నెలలుగా వేతనాలు ఇవ్వని అధికారులు:

బతికేందుకు మరోమార్గం లేక ఉపాధిపనికి వెళితే నెలల తరబడి కూలి డబ్బులు ఇవ్వని పరిస్థితి. ‘అనంత’లో మూడు నెలలుగా ఉపాధి పనులు చేసినవారికి కూలి డబ్బులు అందలేదు. డిసెంబర్‌లో పనికి వెళ్లినవారికి కూడా నేటి వరకూ కూలి అందలేదు. 2009 వరకు వారం రోజులు పనికి వెళితే శనివారం రోజు కూలి డబ్బులు చేతికొచ్చేవి. ఇప్పుడు నెలల తరబడి రాని పరిస్థితి. ఈ క్రమంలో వలసపోకుండా ‘ఉపాధి’ పనులకు ఎందుకు వెళతామని రైతులు, కూలీలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బకాయి డబ్బులు వచ్చాయని అధికారులు శుక్రవారం ప్రకటించారు. అయితే ఈ సొమ్మును వ్యవసాయ, డ్వాక్రా రుణాల అప్పుల్లోకి జమ చేసుకోవాలని బ్యాంకర్లు యోచిస్తున్నారు. అప్పుల్లోకి జమ చేసుకోవద్దని కలెక్టర్‌ ఆదేశించినా బ్యాంకర్లు మాత్రం మొదట బకాయిలు రాబట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.



150 పనిదినాలు ఒక్క కుటుంబానికీ కల్పించని వైనం

జిల్లాలో 40.57లక్షల జనాభా ఉంది. ఇందులో 7.85 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో వందరోజులు పూర్తి చేసుకున్నవారి కుటుంబాలు జనవరి వరకు 41,650 ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సంఖ్య 68వేలకు చేరింది. ‘అనంత’లో 150 పనిదినాలు కల్పించాలనే ఉత్తర్వులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ 150రోజుల పనిదినాలు కల్పించలేదు. పేరుకు ఎన్నిరోజులైనా పనికల్పిస్తామని డ్వామా అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఇలా ఉంది. పైగా రోజూ రూ.194 చొప్పున కూలి చెల్లిస్తున్నామని మంత్రి అయ్యన్న వ్యాఖ్యానించారు. కానీ జిల్లాలో సగటున రూ.154 వస్తోందని డ్వామా అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇది అతిస్వల్పంగా వస్తోంది. అధికశాతం మందికి రోజూ రూ.60 నుంచి రూ.110 మాత్రమే వస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే జిల్లా కీలక అధికారులు కూడా డ్వామా అధికారులు ఏది చెబితే అదే నిజమనే భ్రమలో ఉన్నారు. పల్లెలకు వెళ్లి కూలీలను ఆరా తీస్తే నిజంగా ఎంత కూలీ వస్తుందనే విషయం తేటతెల్లమవుతుంది.



కూలిలో సగం ఖర్చులకే

రోజుకు రూ.500 వస్తుందని మంత్రి అయ్యన్న చెబుతున్నా కూలికి వెళ్లేవారికి రోజుకు రూ.300 వస్తుంది. కొందరికి రూ.500 వస్తోంది. అయితే వీరు అక్కడ అద్దెకుండే గదులు, భోజనం ఖర్చు, ఇతర ఖర్చులు కలిపి రోజూ సగం డబ్బులు ఖర్చవుతాయి. పురుషులైతే సాయంత్రం వరకు కష్టపడి ఒళ్లునొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం తాగుతారు. దీనికి మరింత ఖర్చవుతుంది. ఇలా సంపాదించుకుని వచ్చేది అరకొరే! రోజూ రూ.250–300 కూలి ఇస్తే ఊరు విడిచి బయటకు రాబోమని వలస రైతులు ‘సాక్షి’తో చెబుతున్నారు.



ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ లెక్కలు?

ఉపాధి కల్పనలో దేశంలోనే ‘అనంత’ మొదటి స్థానంలో ఉందని డ్వామా పీడీ నాగభూషణం చెబుతున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.500 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. వైఎస్‌ హయాంలో 97.5శాతం నిధులు కూలీలకు ఖర్చుచేస్తే, ఇప్పుడు 40 శాతానికి తగ్గించారు. ఈ లెక్కన రూ.500 కోట్లలో అంగన్‌వాడీ భవనాలు, సిమెంట్‌రోడ్లు, పంచాయతీరాజ్‌ భనవాలు ఇతర అవసరాలకు నిధులను మళ్లిస్తున్నారు. ఇందులో కూలీలకు అందింది స్వల్పం. వాస్తవాలు ఇలా ఉంటే ఖర్చయిన మొత్తం నిధులను కూలీలకే చెల్లించామన్నట్లు ఉపాధి కల్పనలో దేశంలోనే ప్రథమమని చెప్పుకోవడం సిగ్గుచేటు కాక మరేంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top