బాబును బంగాళాఖాతంలో కలుపుదాం

బాబును బంగాళాఖాతంలో కలుపుదాం - Sakshi


* అబద్ధాల సీఎంపై కలసికట్టుగా ఉద్యమిద్దాం

* ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు


సాక్షి ప్రతినిధి, గుంటూరు: అబద్ధాల కోరు ముఖ్యమంత్రి చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేందుకు రాబోయే రోజుల్లో కలసికట్టుగా ఉద్యమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి కాంస్య విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానుల హర్షధ్వానాల మధ్య వైఎస్ జగన్ అవిష్కరించారు.



ఈ కార్యక్రమానికి గ్రామం మొత్తం తరలివచ్చింది. వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ చైతన్యం...ఈ ఉత్సాహం చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగేవరకు కొనసాగాలని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన  మొత్తం అబద్ధాల మయంతో కొనసాగుతోందని, ఆయనంటే.. ప్రజల నుంచి మూడే మూడు మాటలు వస్తాయని, అవి మోసం.. మోసం.. మోసం అని చెప్పారు. ‘చంద్రబాబు పాలన ఎలా ఉందని రైతన్నలను అడిగితే.. బంగారం, పొలాల వేలం నోటీసులు వస్తున్నాయని, ఇంతకుమించి ఏమి చెప్పమంటారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



డ్వాక్రా అక్కచెల్లెళ్లను అడిగితే.. అన్నా.. జీవితంలో ఇంతకన్నా మోసగాడు మరొకర్ని చూడలేదంటున్నారు. పావలా వడ్డీకి రుణాలు రాక వారు రెండు రూపాయల వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చదువుకుంటున్న కుర్రోడు.. నిరుద్యోగిని అడిగితే.. అన్నా, ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. సీఎం అయిన తర్వాత అడిగితే నేనెప్పుడు చెప్పానంటున్నాడు.



ఇంతకన్నా క్రిమినల్ నంబర్‌వన్ దేశంలోనే లేడని అంటున్నారు. అధికారంలోకి రాకముందు అందరికీ ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఇప్పుడు నేనెప్పుడు కట్టిస్తానన్నానని అంటున్నాడు..’ అని జగన్ తెలిపారు. బాబు ప్రతి మాట అబద్ధమని, ఆయన ప్రతి అడుగులో మోసం దాగి ఉందని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ముందు చేసిన హామీలు అమలయ్యే విధంగా కలసికట్టుగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



దివంగత ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డిని నాన్న టైగర్ అంటూ పిలిచేవాడని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన విగ్రహావిష్కరణకు రెండు సంవత్సరాల క్రితమే రావాల్సి ఉన్నా రాలేక పోయానన్నారు. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కదిలిస్తున్నాయని, ప్రతి గుండె చప్పుడు తనకు వినిపిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తన హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్టారెడ్డి తదితరులు ప్రసంగించారు.

 

రాజధాని రైతుల సమస్యల్ని తెలుసుకున్న జగన్..

హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు వచ్చిన జగన్ ఉద్ధండరాయునిపాలెం, వ డ్లమాను గ్రామాల్లో పార్టీ నేతల ఇళ్లల్లో జరిగిన వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దారిలో తనను కలసిన  రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top