చంద్రబాబుకూ, జగన్‌మోహన్‌రెడ్డికీ అదే తేడా

చంద్రబాబుకూ, జగన్‌మోహన్‌రెడ్డికీ అదే తేడా - Sakshi


రాజధాని రైతులకు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు

అందుకే కేసులకు భయపడి మోదీకి సాష్టాంగపడుతున్నాడు

స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. ప్యాకేజీ చాలంటున్నాడు

ఆనాడు సోనియా, బాబు కలసి కేసులు పెట్టినా నేను భయపడలేదు.. పోరాడాను

చంద్రబాబుకూ, జగన్‌మోహన్‌రెడ్డికీ అదే తేడా

హోదాకోసం 29న జరిగే బంద్‌ను విజయవంతం చేయాలి

చంద్రబాబు, బీజేపీ మెడలు వంచైనా హోదా తెచ్చుకోవాలి

త్వరలో రానున్నది మన ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వం

బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ రైతులకు తిరిగిస్తాం



ఆరోజు అధికారంలో ఉన్న సోనియాగాంధీ, ఇదే చంద్రబాబు కలసి నాపై కేసులు పెట్టారు. అయినా నేను భయపడలేదు. అధికారంలో ఉన్న సోనియాపై పోరాటం చేశాను. ఈరోజు బాబుపైనా, నామీదా కేసులున్నాయి. నేను పోరాడుతూనే ఉన్నాను. కానీ బాబు మోదీ వద్ద సాష్టాంగపడుతున్నాడు. ప్రత్యేక హోదాను వద్దని చెబుతున్నాడు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నాడు. అదే.. ఆయనకూ, నాకూ తేడా. ఒక్కటి చెబుతున్నా... తలరాత రాసేది వీళ్లుకాదు, పైనున్న దేవుడు. అందుకే భయంలేదు నాకు. నా నుదుటిన రాసివుంటే చంద్రబాబు కాదు కదా వాళ్ల నాయన కూడా నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకుండా ఆపలేడు. మనం ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులం. ప్రజలు మనవైపు చూస్తున్నారు. ఆ ప్రజలవైపు మనం ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి.

 

విజయవాడ బ్యూరో: చంద్రబాబూ... అధికారం ఎల్లకాలం నీ దగ్గరుండదు... నీ ప్రభుత్వం రెండేళ్లలో పోతుందో, మూడేళ్లలో పోతుందో చెప్పలేను... కానీ బంగాళాఖాతంలో కలిసేరోజు త్వరలోనే వస్తుంది... ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే... ప్రజాప్రభుత్వం... అప్పుడు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూముల్ని పువ్వుల్లో పెట్టి తిరిగిచ్చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంత రైతులకు భరోసా ఇచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు కూడా అబద్ధాలు చెప్పి రైతుల భూములు లాక్కొని చంద్రబాబు కట్టేది ప్రజారాజధానికాదని, కార్పొరేట్ రాజధానని ధ్వజమెత్తారు.



అప్పట్లో అధికారంలో ఉన్న సోనియాగాంధీ, చంద్రబాబుతో కలిసి తనపై కేసులు పెట్టినా తాను భయపడకుండా పోరాడానని, పోరాడుతూనే ఉన్నాననీ చెప్పారు. కానీ చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నాడని, నరేంద్ర మోదీకి సాష్టాంగపడుతున్నాడని దుయ్యబట్టారు. విభజనచట్టంలో ఉన్న అంశాలనే కొత్తగా ప్యాక్‌చేసి ప్రత్యేకప్యాకేజీ అంటూ ప్రకటించాలని కేంద్రానికి చెబుతున్నాడని విమర్శించారు. రాజధానిలో భూసేకరణను వ్యతిరేకిస్తూ బుధవారం సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట వేలాదిమందితో జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయం లోనికి వెళ్లగా కమిషనర్, అదనపు కమిషనర్ లేరని సిబ్బంది సమాధానమిచ్చారు. ముందస్తు సమాచారం ఇచ్చినా ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరసనగా కార్యాలయం గోడకు వినతిపత్రాన్ని అంటించి వెనుతిరిగారు. ఈ ధర్నాకు వైఎస్సార్‌సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు  పార్థసారథి అధ్యక్షత వహించగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.



ధర్నా సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..



కార్పొరేట్ రాజధాని

‘‘ఈ ప్రభుత్వం ప్రజా రాజధానిని పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థల కోసం రాజధాని నిర్మించాలనుకుంటోంది. ప్రజల ఆక్రోశంతో, కన్నీటితో రాజధాని నిర్మించాలనుకుంటున్నారు. అధికారం ఉంది కదా అని మదమెక్కిన మనస్తత్వంతో రైతులు ఒప్పుకోకపోయినా బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. బాధితులకు అండగా ఉండేందుకే ఈ ఆందోళన చేస్తున్నాం. రైతుల భూములు లాక్కునేందుకు బాబు అబద్ధాలు కూడా చెబుతున్నాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు లాంటి సంస్థ. తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని కొందరు రైతులు అందులో కేసు వేశారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది.



అందులో రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే భూములు లేవు, అసలు జరీబు భూములే లేవు, కేవలం రెండు వేల ఎకరాలే జరీబు, మిగిలినవన్నీ మెట్ట భూములని చెప్పారు. సాక్షాత్తూ ప్రభుత్వమే అబద్ధాలు చెబుతూ కోర్టులను తప్పుదారి పట్టిస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. ఇదే గ్రీన్ ట్రిబ్యునల్ భూములను యథాతథంగా ఉంచాలని స్టే ఇచ్చింది. కానీ దాన్ని పట్టించుకోకుండా భూసేకరణ కోసం చంద్రబాబు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. అందులో పేర్లు తెలీదు, పేర్లు తెలీదు అని రాశారు. అంటే వీటిమీద కోర్టుకుపోయే అవకాశం కూడా రైతులకు లేకుండా కుట్ర చేశారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు ఆగస్టు 31వ తేదీ వరకే సమయముంది. బాబు ఆలోపే భూమి లాక్కోవాలని భూసేకరణ నోటిఫికేషన్ జారీచేశారు. ప్రభుత్వమే ఇంత అన్యా యం చేస్తుంటే ప్రజలు ఎక్కడికెళ్లాలి? సీఎం బాబులాంటి భూబకాసురుడు కాకూడదు.



బాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు

చంద్రబాబు పరిపాలనంతా మోసం... మోసం... మోసం అనే మూడక్షరాలపై నడుస్తోంది. జాబు కావాలంటే బాబు రావాలని, రైతుల రుణాలు బేషరతుగా మాఫీ కావాలంటే... బ్యాంకుల్లో బంగారం బయటకు రావాలంటే...  బాబు ముఖ్యమంత్రి కావాలని గోడలపై రాసి, టీవీల్లో ప్రచారం చేశారు. ఒకవేళ జాబు రాకపోతే ప్రతి నిరుద్యోగికి రూ.రెండువేలు నిరుద్యోగభృతి  ఇస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని అప్పుడు అడిగాడు చంద్రబాబునాయుడు. ఎన్నికలైపోగానే ఓట్లేసిన ప్రజల ను వెన్నుపోటు పొడిచాడు. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను నట్టేట ముంచాడు. పెన్షన్లు ఇచ్చేది కొందరికి, కత్తిరించేది చాలామందికి.’’



ఈ ధర్నాలో వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, శాసనసభలో పార్టీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆర్‌కే రోజా, జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నేతలు అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ, గౌతంరెడ్డి, సామినేని ఉదయభాను, మర్రి రాజశేఖర్, జోగి రమేష్, విశ్వరూప్, వంగవీటి రాధా, తలశిల రఘురాం పాల్గొన్నారు.



ప్రత్యేక హోదాను నీరుగార్చుతున్నాడు

ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఉమ్మడిరాష్ట్రంలో 70% పరిశ్రమలు, 95% సర్వీస్ సెక్టార్ హైదరాబాద్‌లో కేంద్రీకృతమైంది. దీంతో సాఫ్ట్‌వేర్ లాంటి ఉద్యోగాలు ఏపీ యువత కోల్పోతున్నందువల్ల, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేకహోదా కల్పిస్తున్నామని అప్పటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే గ్రాంట్లు 90%, అప్పులు పది శాతం ఇస్తారు. గ్రాంటు అంటే డబ్బును వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేక హోదా లేకపోతే 30% గ్రాంటు వస్తుంది. ప్రత్యేకహోదావల్ల ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్‌పై రాయితీలుంటాయి.



వీటికోసం పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తారు. పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తాయి. ఎన్నికలప్పుడు ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా కావాలని బీజేపీని పక్కనపెట్టుకుని మరీ అడిగాడు చంద్రబాబు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని చెబుతున్నాడు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇది చేస్తాం, అది చేస్తాం అని చట్టంలో రాశారు. పోలవరం ప్రాజెక్టు మిగతా అన్నింటినీ కలపి ఇంత సొమ్మవుతుందని లెక్కేసి దాన్ని ప్యాకేజీగా ఇస్తామంటున్నారు. అయినా బాబు ఎందుకు మాట్లాడడంలేదు? ఎందుకు కేంద్రం పై ఒత్తిడి తీసుకురావడంలేదు? కేంద్రంలో ఉన్న మంత్రులను ఎందుకు ఉపసంహరించుకోవడంలేదు? కారణం ఓటుకు కోట్లు కేసు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేలను కొనేందుకు ఓటు కోసం కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబునాయుడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి 20 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. 8మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుకున్నాడు. ఒక ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ సాక్షాత్తూ చంద్రబాబు వీడియో, ఆడియో టేపుల్లో దొరికిపోయాడు. ఆ కేసు నుంచి బయటపడేందుకు బీజేపీ ప్రభుత్వం దగ్గర, నరేంద్ర మోదీ కాళ్లమీద సాష్టాంగపడుతున్నాడు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని పణంగాపెట్టి రాజకీయం చేస్తున్నాడు.

 

29న బంద్‌ను విజయవంతం చేసుకోవాలి

29న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాం. ఇది జగన్‌కోసం కాదు. జనం కోసం చేసే బంద్. రాష్ట్ర భవిష్యత్తుకోసం చేస్తున్న పోరాటం. మన పిల్లల భవిష్యత్తుకోసం చేస్తున్న ఉద్యమం. ఈ బంద్ జరక్కుండా ఉండేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నాడు.  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేయబోతున్నాడు. ఎవరిని అరెస్టు చేసినా, ఎందరిని అరెస్టుచేసినా ప్రజలు ముందుకు రావాలి. సత్తా చూపిం చాలి. బాబు, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తెచ్చుకోవాలి. బంద్‌ను అందరం కలిసికట్టుగా విజయవంతం చేసుకుందాం. ఈరోజు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ధర్నా చేశాం. ఈరోజు నేను ముఖ్యమంత్రిని కాకపోవచ్చు. జరుగుతున్న అన్యాయాన్ని నేను ఆపలేకపోవచ్చు. కానీ పైనుంచి దేవుడు అన్నీ చూస్తున్నాడు. చంద్రబాబు బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ పువ్వుల్లో పెట్టి రైతులకు తిరిగిస్తాం. మళ్లీ సాగులోకి తెస్తాం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top