10 లక్షల ఉద్యోగాలు అంటూ..

ఆయన తప్పు చేస్తే... శిక్ష మాకా!!


కర్నూలు : బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల సందర్భంగా ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు చేసిందేమీ లేదని  బీటెక్ విద్యార్థిని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆమె మంగళవారమిక్కడ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి అయ్యాక పెట్టుబడులు తెస్తామంటూ చంద్రబాబు ఫారిన్ టూర్ వెళ్లి వచ్చారు కదా. విదేశీ పర్యటనల తర్వాత రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయని’  ఆమె అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ... చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో పోరాటం చేసేవారన్నారు.



ప్రత్యేక హోదా వస్తే...ఆయన పెట్టుబడుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.  చంద్రబాబు ఈ మధ్య కాలంలో విశాఖలో విదేశాలతో ఎంవోయూలు అని...  నాలుగు లక్షల 67 కోట్ల పెట్టుబడులు, పది లక్షల మందికి ఉద్యోగాలు అంటూ డబ్బాలు కొట్టారన్నారు. అయితే ఆయన ఒక్క ఉద్యోగాన్ని కూడా తీసుకు రాలేదన్నారు. ఉద్యోగాలు రావాలంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు   ప్రత్యేక హోదా ఇచ్చేలా నిలదీయాలన్నారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో చంద్రబాబు చేసింది శూన్యమన్నారు.


పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొన్నదన్నారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు రావడం అటుంచి ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని, విశాఖ నుంచి హెచ్ఎస్బీసీ ఇప్పటికే వెళ్లిపోయిందన్నారు. మన్నవరం ప్రాజెక్టు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చిందని, స్పిన్నింగ్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గడమే అందుకు నిదర్శనమన్నారు.



మరో బీటెక్ విద్యార్థిని జోత్స్య మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు తప్పు చేసి.. దాని నుంచి తప్పించుకొనేందుకు హోదాను తాకట్టు పెట్టారని, ఆయన తప్పు చేస్తే.. శిక్ష మాకా అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు ఏ విషయాన్ని అయినా మేనేజ్ చేసుకోవటం బాగా తెలుసు అని, ఆయన తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. విద్యార్థులనే కాకుండా రాష్ట్ర ప్రజలందర్ని మోసం చేశారన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top