పదో రోజూ..అదే హోరు

పదో రోజూ..అదే హోరు - Sakshi


► జగనన్న రోడ్‌షోకు పోటెత్తిన జనం

► అడుగడుగునా మహిళల నీరాజనాలు

► 2 కి.మీ. రోడ్‌షోకు పది గంటలు

►  చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలపై జననేత మండిపాటు




సాక్షి బృందం, నంద్యాల : నంద్యాల పట్టణంలో జగనన్న రోడ్‌షోలకు జనం పోటెత్తుతూనే ఉన్నారు. పదో రోజు శుక్రవారం కూడా అశేషసంఖ్యలో తరలివచ్చారు. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. దారి పొడవునా గజమాలలు, వీర తిలకం దిద్దుతూ మహిళలు హారతులిచ్చారు. జగనన్న సెల్ఫీ కోసం యువకులు పోటీ పడ్డారు.


దీంతో మొత్తం రెండు కి.మీ. రోడ్‌షోకు పది గంటల సమయం పట్టింది. దేవనగర్‌ ప్రాంతంలో జగనన్న కోసం గంటల తరబడి వేచివుండి.. ఆయన్ను చూశాకే జనం వెళ్లారు. ఒక్క సాయిబాబానగర్‌లోనే  రోడ్‌షో నాలుగు గంటల  పాటు సాగింది. ప్రతి వీధి అభిమానులతో కిక్కిరిసింది.  రోడ్‌షో ఉదయం 9.30గంటలకు సాయిబాబానగర్‌ ఆర్చి సెంటర్‌ నుంచి ప్రారంభమైంది.  దేవనగర్‌ క్రాస్‌రోడ్, వెంకటేశ్వర స్టోర్, పార్కురోడ్‌ సెంటర్, నాగులకట్ట సెంటర్, దేవనగర్‌ సెంటర్‌ మీదుగా నూరాని మసీదుసెంటర్‌ వరకు సాగింది.



అడుగడుగునా ఆహ్వానాలు

జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోలో ప్రజలు అడుగడుగునా తమ ఇళ్లలోకి రావాలంటూ ఆహ్వానించారు. సాయిబాబానగర్‌లో గుడ్‌డే స్కూల్‌ కరస్పాండెంట్‌ రసూల్‌ అబ్దుల్‌ఖాన్‌ తన ఇంట్లోకి ఆహ్వానించారు. జగన్‌ ఇంట్లోకి చేరగానే..ముస్లిం మత పెద్దలు దువా చేశారు. అనంతరం కరస్పాండెంట్‌ రసూల్‌ అబ్దుల్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘మీ నాన్న, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముస్లిం మైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పించడం వల్ల ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందాయ’ని తెలిపారు. ముస్లిం మైనార్టీల్లో ఎన్నో పేద కుటుంబాలు ఉన్నాయని, వైఎస్‌ లాగా మీరు కూడా ముస్లింల అభ్యున్నతికి మంచి పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు.


ఇందుకు జననేత స్పందిస్తూ  దేవుని దయతో సంతోషంగా చేద్దామన్నారు.  అదే నగర్‌లో మద్దమ్మ అనే మహిళ జగనన్నను ఆప్యాయంగా పలకరించింది.  ‘జాగ్రత్తమ్మా..’ అంటూ చెప్పడంతో ఆమె ఎంతగానో పొంగిపోయింది. శ్రీగణేష్‌ బ్రాహ్మణ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడి కుటుంబ సభ్యులు జగనన్నకు వారి ఇంటి వద్ద వీరతిలకం దిద్దారు. అలాగే ఇంట్లోకి ఆహ్వానించారు. వారిని ఆప్యాయంగా పలకరించడంతో మురిసిపోయారు. రిటైర్డు ఉపాధ్యాయుడు, పింఛన్‌దారుల సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ రంగనాయకులు తమ ఇంటి వద్ద హారతులిచ్చి.. వీరతిలకం దిద్ది.. పూలమాలతో స్వాగతం పలికారు. 


ప్రత్యేక హోదా ఎంతో మంది నిరుద్యోగులకు ప్రాణమని, అది సాధించాలంటే మీ ఒక్కరితోనే సాధ్యమని రంగనాయకులు చెప్పడంతో ‘దేవున్ని ప్రార్థిద్దాం.. ఆయన్నే చూస్తాడ’ని జగన్‌ అన్నారు. శ్యామల, ఇమాంబీ, ప్రదీప్, రమా, మౌనికలు సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు. దేవనగర్‌లో ప్రవీణ్, కుసుమ దంపతులు తమ ఇంట్లోకి రావాలని ఆహ్వానించడంతో జగన్‌ వెళ్లి ఇంట్లో కాసేపు కూర్చొన్నారు. ‘వస్తానమ్మా’ అంటూ బయటకు రావడంతో ఆ దంపతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇలా పలు కుటుంబాల వారు ఆప్యాయతతో జననేతను ఇళ్లలోకి ఆహ్వానించారు.



సెల్ఫీ కోసం పోటీ పడ్డ యువకులు

జగన్‌ రోడ్‌షోలో ముఖ్యంగా యువకులు సెల్ఫీకోసం పోటీ పడ్డారు. అన్ని కాలనీల్లో యువకులు, యువతులు, మహిళలు పెద్దసంఖ్యలో సెల్ఫీలు తీసుకుంటూ, తమ అభిమాన నేత జగన్‌కు పూలమాలలు వేస్తూ, రాఖీలు కట్టి సంబరపడ్డారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బంగారయ్య, రామునాయక్, సంజీవరాయుడు, నరసింహులు జగన్‌ను కలిసి సెల్ఫీ తీసుకొని ఉప్పొంగిపోయారు. దేవనగర్‌కు చెందిన మల్లిక అనే మహిళ నెల రోజుల చిన్నారిని జగన్‌ చేతికి అందించడంతో ‘చిట్టితల్లి’ అంటూ సంబోధించారు.


ఆమె పొంగిపోతూ తన కుమార్తెకు ఇంకా పేరు పెట్టలేదని, జగనన్న చిట్టితల్లి అని పిలిచారని, అదే పేరు పెడతామంటూ ఆనందంగా> చెప్పింది. కరీష్మా అనే మహిళ జగన్‌ను కలిసి.. సెల్‌లో నుంచి వీడియో కాల్‌ చేసి గిద్దలూరులో ఉన్న తన భర్త హుసేన్‌తో మాట్లాడించింది. తాను మీ అభిమానినంటూ హుసేన్‌ పేర్కొనడంతో ‘హాయ్‌.. హాయ్‌..’ అంటూ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. దేవనగర్‌లో 80 ఏళ్ల పర్వీన్‌బీ(80)ని జగన్‌ కలిసి ‘బాగున్నావా’ అని పలకరించారు. దువా చేయమని చెప్పడంతో ఆమె ఆనందంగా పొంగిపోయింది.



నేనడుగుతా.. సమాధానం మీరే చెప్పాలి

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రోడ్‌షోలో భాగంగా సాయిబాబానగర్, నూరానుమసీదు వద్ద ప్రసంగించే సమయంలో ‘నేనే అడుగుతాను. మీరు అవునా.. కాదా’ అంటూ సమాధానం ఇవ్వాలని జగన్‌ కోరారు.  మహిళలకు రుణమాఫీ జరిగిందా అంటూ జగన్‌ అడగ్గా.. ‘లేదు.. లేదు’ అంటూ సమాధానం ఇచ్చారు. చౌక డిపోలో తొమ్మిది సరుకులు అందుతున్నాయా అనగా.. లేదంటూ చెప్పారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, పక్కాగృహాలు తదితర అన్ని విషయాలపై జనం నుంచి ఇదేవిధమైన సమాధానం వచ్చింది. వారు రెండు చేతులు ఊపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 

చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు నమ్మవద్దు


చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దని, ధర్మం, న్యాయం వైపు ఓటర్లు తీర్పు ఇవ్వాలని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల అభివృద్ధి తనకు వదిలి వేయాలని, పులివెందుల తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. వాల్మీకుల రిజర్వేషన్‌ విషయంపై తాను పోరాడుతానని, ఈ విషయం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పారు. ఎస్టీలుగా చేసే విషయంపై తాను అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, దేవనగర్‌ బాషా, ప్రభాకర్, జక్కల ఆదిశేషు, చంద్రశేఖర్, శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top