చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! - Sakshi


రిత్ర చేసిన గాయాలను త్వరగా మాన్పించే దివ్యౌషధం కోసం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎదురు చూస్తున్నది. ఆ గాయాలు మానితే చాలు, జవసత్వాలు కూడదీసుకుని ప్రగతి బాటలో పరుగులు పెట్టగల ధీరత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నది. అద్భుతమైన సహజ వనరులు ఈ ప్రాంతం ఆస్తి. అద్వితీయమైన మానవ వనరులు గొప్ప ఆలంబన. కానీ, తాను చేయని యుద్ధంలో తగిలిన గాయాలతో ఈ రాష్ట్రం ఇప్పుడు సతమతమైపోతున్నది. ఈ గాయాలను ఉపశమింప చేయగల ఏకైక సంజీవని ప్రత్యేక హోదా మాత్రమేనన్న అభిప్రాయం ఎల్లెడలా వ్యక్తమవుతున్నది.



సాక్షి మీడియా ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న చైతన్యవేదిక సదస్సులకు హాజరవుతున్న విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, వయోధికులు ముక్త కంఠంతో తిరుమంత్రంలాగా ప్రత్యేక హోదాను జపిస్తున్న తీరు ప్రజాభిప్రాయానికి అద్దం పడుతున్నది.



ఎంతో ఘనమైన చరిత్రను కడుపులో దాచుకున్న కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు (నవ్యాంధ్రప్రదేశ్) చారిత్రక కారణాల వల్ల సుదీర్ఘకాలం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంతో సహజీవనం చేయవలసి వచ్చింది. ఇక్కడ వ్యవసాయరంగంలో మిగులు సాధించిన ఉన్నతవర్గాల వారందరూ ఆ సొమ్మును మద్రాసు పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులుగా పెట్టారు. పరిశ్రమలు స్థాపించారు. వారు కల్పించిన ఉద్యోగాల్లో సింహభాగం తమిళులకే దక్కాయి. తెలుగువారి కొక రాష్ట్రంకావాలని ఎన్నో యేళ్లపాటు సాగిన ఉద్యమం, అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మబలిదానం ఫలితంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. అనతి కాలంలోనే తెలంగాణాతో కలిసి హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆర్థిక చరిత్ర పునరావృతమైంది.



ఆంధ్రప్రాంతం వారు హైదరాబాద్ చుట్టూ పెట్టుబడులు పెట్టారు. పరిశ్రమలు స్థాపించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో ప్రభుత్వరంగంలో, భారీ పరిశ్రమలు వచ్చాయి. అవన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనాయి. ఆంధ్రప్రాంతంలో డిగ్రీ పూర్తిచేయగానే ఉపాధికోసం హైదరాబాద్ బండెక్కవలసిన పరిస్థితి దశాబ్దాల పాటు కొనసాగింది. ఈ స్థితిలో జరిగింది రాష్ట్రవిభజన. కామధేనువులాంటి హైదరాబాద్ తెలంగాణాకు సొంతమైంది. సీతమ్మవారిని అపహరించుకుపోతున్న తరుణంలో రావణబ్రహ్మ వంటి రాక్షస ప్రభువును ప్రతిఘటించడానికి కూడా వెనుకాడని బలశాలి జటాయు అనే పక్షిరాజు రావణాసురుని ఆగ్రహంతో రెక్కలు తెగి నిస్సహాయ స్థితిలో పడిపోయింది. నాటి జటాయు స్థితే నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మళ్లీ రెక్కలు తొడిగి పరాక్రమించాలంటే ఒకే ఒక్క సంజీవని ప్రత్యేక హోదా.

 

పార్లమెంట్ సాక్షిగా అన్ని రాజకీయ పక్షాల అంగీకారంతో నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ వలన ఆంధ్రప్రదేశ్‌కు హక్కు భుక్తంగా ప్రత్యేక హోదా సంక్రమించింది. ఆ హక్కును అమలు చేయండని కోరుతూ ప్రతిపక్షాలు ఉద్యమాలు చేయవలసి రావడం, విపక్షనేత దీక్షలకు దిగవలసిరావడం ఒక విషాదం. బేషరతుగా అమలు కావలసిన ఈ హక్కు ఎందుకు దూరంగా పోతున్నది? ఎందుకన్నది... ఇప్పుడు రాష్ట్రప్రజలందరికీ సినిమా చూసినంత స్పష్టంగా అర్థమైంది. అవినీతి కారణంగా సంక్రమించిన అసమర్థత వలన రాష్ట్రపాలకుడు కేంద్రాన్ని నిగ్గదీసి అడుగలేని నిస్సహాయస్థితి. ప్రత్యేక హోదాను అడుగలేకపోవడమే కాదు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలకు సైతం అంటకత్తెర వేసి ఇదిగో మీ ప్యాకేజీ తీసుకుపోండని అరుణ్‌జైట్లీ ఈసడిస్తే, పావుకేజీకూడా లేని ఆ ప్యాకేజీ పొట్లాన్ని మహాప్రసాదంగా స్వీకరించి కృతజ్ఞతలు చెప్పుకున్న దౌర్బాగ్య, దౌర్భల్య బేలతనం మన ముఖ్యమంత్రిది.

 

గడిచిన వందయేళ్లుగా అన్యాయానికి గురవుతున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రత్యేక హోదా సాధించకపోతే మరో వందేళ్ల వెనకబాటుతనం తప్పదు. ప్రస్థుత రాష్ట్ర జనాభాలో కోటిన్నరమంది యువతీ యువకులు. ఉపాధికోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకహాదా వస్తే పరిశ్రమలు వాటంతట అవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయన్నది వర్తమాన పరిణామాలు చెబుతున్న పాఠం. హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు వందలాది పరిశ్రమలు వచ్చాయి. లక్షల మందికి ఉపాధి లభించింది. పర్వత ప్రాంతాలైన ఆ రాష్ట్రాల పరిస్థితే అలావుంటే ఇక ఆంధ్రప్రదేశ్ విజయగాథను ఊహించలేమా? వెయ్యికిలోమీటర్ల సముద్ర తీరం మన సొంతం. అపార ఖనిజ నిక్షేపాలను కడుపులో దాచుకున్న తూరుపుకనుమల అనంత శ్రేణి మన చెరగని ఖజానా. శాతవాహనుల కాలంలోనే సాగరకెరటాలను సవాల్ చేస్తూ రతనాల రాసుల నౌకలపై రోమ్‌నగరంతో వర్తకం చేసిన వణిక్ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న మానవ వనరులు మనకున్నాయి.



ఇన్ని అనుకూలతలున్న ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాయతీలు లభిస్తే, వేలాది పరిశ్రమలతో ఆంధ్రావని అలరాలదా? లక్షలాది మంది మన యవతీ యువకులు ప్రపంచంతో పోటీ పడుతూ పరుగులు తీయరా? మన రాజధాని నగరానికి అమరావతి అనే పేరు పెట్టుకుంటే చాలదు. శాతవాహనుల నాటి గత వైభవ పతాకం మళ్లీ రెపరెపలాడాలంటే ప్రత్యేక హోదాను సాధించి తీరవలసిందే. అవినీతితో అర్భకంగా తయారైన రాజకీయ వ్యవస్థ అందుకు అడ్డం పడితే, అడ్డంకిని తొలగించుకునే సత్తా మన యువతరానికి వుంది. పలనాటి బాలచంద్రుని వారసులు మన యువకులు. మగువ మాంచాలవలె తెగువచూపగల సాహసులు మన యువతులు. సంక్షోభ సమయంలో జాతిని తట్టి లేపడానికి కీర్తిశేషులు వేములపల్లి శ్రీకృష్ణ రాసిన గేయం ఈ సందర్భంగా మళ్లీ గుర్తుకు వస్తున్నది.

చెయ్యత్తి జై కొట్టు తెలుగోడా !

గతమెంతో ఘనకీర్తి గలవాడా!!

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top