ఆర్యవైశ్యులకు బాసట

ఆర్యవైశ్యులకు   బాసట - Sakshi


అధికారంలోకి వచ్చాక మూడు నెలలకే ప్రత్యేక కార్పొరేషన్‌

►  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ

► చంద్రబాబు పాలనను సాగనంపుదామని పిలుపు

► 11వ రోజూ భారీ జనసందోహం మధ్య కొనసాగిన రోడ్‌షో

►  పోటెత్తిన వీధులు.. అడుగడుగునా నీరాజనాలు




సాక్షి బృందం, నంద్యాల : ‘నంద్యాలలోనే కాదు.. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటాం. వారికి ప్రత్యేక కార్పొరేషన్‌ను మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఏర్పాటు చేస్తామ’ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నంద్యాల పట్టణాభివృద్ధిని తనకు వదిలేయాలని,  మోసాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును సాగనంపేందుకు  ఈ ఎన్నికల్లో ధర్మం, న్యాయం వైపు నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రోడ్‌షో 11వ రోజు శనివారం సంజీవనగర్‌ రామాలయం వద్ద నుంచి కొనసాగింది. ఈ రోడ్‌షోకు జనాలు పోటెత్తారు.


అన్ని వార్డుల్లో  కిక్కిరిసి పోయారు. జననేతతో సెల్ఫీలు దిగుతూ.. అడుగడుగునా హారతులు ఇస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.  ఉదయం తొమ్మిది గంటలకు  సంజీవనగర్‌ రామాలయం వద్ద ప్రారంభమైన రోడ్‌షో శాంతినికేతన్‌స్కూల్, శేషయ్య చికెన్‌ సెంటర్, బయటిపేట, పెద్దబండ సత్రం, రేణుక ఎల్లమ్మ దేవాలయం, మెయిన్‌ బజార్‌ మీదుగా తెలుగుపేట వరకు  కొనసాగింది. రోడ్‌షో ముగిసేసరికి రాత్రి 8.30 గంటలు అయ్యింది. జనం పోటెత్తడంతో 39, 40 వార్డుల్లో దాదాపు ఎనిమిది గంటల సమయం పట్టింది.  



ఆత్మీయ ఆలింగనం

జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసిన ఆనందంలో  ప్రజలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ముస్లిం సోదరులు ఖాశీంసా, ఇస్మాయిల్, జాకీర్‌లు.. జగన్‌తో కరచాలనం చేయడంతో వారిని ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. బైటిపేటలో రమీజాబీ అనే 80 ఏళ్ల వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉండటంతో జగన్‌ ఆమె వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ప్రతి రోజు దువా చేయాలని చెప్పడంతో ఆమె ఎంతగానో పొంగిపోయింది.  షహీంసా అనే వృద్ధుడు..జననేత జగన్‌తో కరచాలనం చేసి ఎంతగానో సంతోషపడ్డాడు.


  రామసుబ్బమ్మ అనే వృద్ధురాలిని జగన్‌ పలకరించగా.. ‘మీ నాన్న చనిపోయాడు. దేవుడు నీ వైపే ఉన్నాడు. ధర్మం నీ వెంటే ఉంద’ని తెలపడంతో తనను ఆశీర్వదించాలని జగన్‌ కోరారు. సుందరమ్మ, రజనీబాయి కూడా జగన్‌తో కరచాలనం చేయగా.. ‘అవ్వా బాగున్నారా’ అంటూ పలకరించారు.  ‘మేము నీ వైపే నాయనా’ అంటూ వారు సంబరపడ్డారు. షాలిని, కల్యాణి, ఆసియా అనే బాలికలు జగనన్నతో పోటీ పడి సెల్ఫీ తీసుకున్నారు.


ఉసేన్‌బీ, మహమ్మద్‌ సుబాని, షహీనా, రహమ్మద్‌బీ, హర్షియా అనే ముస్లిం మహిళలు జగనన్నతో సెల్ఫీ తీసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. స్పందన అనే మహిళ రచన అనే నాలుగు నెలల పాపను జగనన్న చేతికిచ్చి సెల్ఫీ తీసుకుంది. వెంకట లక్ష్మమ్మ, పక్కీరమ్మ అనే వృద్ధురాళ్లతో జగన్‌ మాట్లాడుతూ.. వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చెప్పారు. దీంతో వారు ‘మా మనవడు వచ్చాడంటూ’ ఆత్మీయత వ్యక్తం చేశారు.



చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపుదాం..

ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచాక ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపాలని  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్ద బండ వద్ద రోడ్‌షోలో భాగంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ అబద్ధాలు ఆడనివ్యక్తి సత్యహరిశ్చంద్రుడని, అబద్ధాలు ఆడే వ్యక్తి దేశంలో ఉన్నాడంటే ఒక్క చంద్రబాబునాయుడేనని చెప్పడంతో ప్రజలు నిజమేనంటూ జగన్‌ ప్రసంగానికి మాట కలిపారు.


నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ఎన్నికకంటే ముందు ఒక్కసారైనా రోడ్ల వెంట కన్పించారా అని అడగడంతో  లేదు.. లేదంటూ రెండు చేతులు ఊపి ప్రజలు సమాధానం ఇచ్చారు. సాగుభూమి ఒక్క ఎకరా అయినా ఇచ్చారా.. ఒక్క పక్కా గృహమైనా పేదలకు మంజూరైందా.. బెల్ట్‌షాపులు తొలగించారా... రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ జరిగిందా అంటూ ప్రజలను అడగడంతో లేదు.. లేదంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. నంద్యాలలో భారీ వర్షాలకు కుందూనదికి వరద వచ్చి ముంపునకు గురవుతున్నా పరిస్థితి నివారణకు చంద్రబాబు నిధులు మంజూరు చేశారా అని అడగడంతో లేదంటూ ప్రజలు సమాధానం ఇచ్చారు.  



దారి పొడవునా వినతులే

రోడ్‌ షోలో దారిపొడవునా జనం వైఎస్‌ జగన్‌కు వినతులు అందించారు. సంజీవనగర్‌ రామాలయం వద్ద ఆదర్శ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్రంలో 46వేల మంది ఆదర్శరైతులుండేవారని, టీడీపీ అధికారంలోకి రాగానే అందరినీ తొలగించారని జగన్‌ దృష్టికి తెచ్చారు.


అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేయాలని కోరారు. జిలానీబాషా అనే వికలాంగుడు తనకు ఉద్యోగం చూపాలని కోరగా మన ప్రభుత్వం లేదని జగన్‌ తెలియజేస్తూ అధికారంలోకి  వస్తే వికలాంగులకు రూ. 3వేల పింఛన్‌ అందజేస్తామని తెలిపారు. తనకు ట్రైసైకిల్‌ కావాలని వినతిపత్రం అందజేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పగా మనం అధికారంలోకి వచ్చాక వికలాంగులకు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top