విషమం.. ఆందోళనకరం

విషమం.. ఆందోళనకరం - Sakshi


► బాగా నీరసించిపోయిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్

► శరీరంలో ప్రమాదకరస్థాయిలో కీటోన్స్

► దీక్ష కొనసాగితే కోమాలోకే..

► వైద్యుల హెచ్చరిక

► హుటాహుటిన దీక్షాశిబిరం వద్దకు విజయమ్మ, భారతి

► కన్నీటిపర్యంతమవుతున్న అభిమానులు

► పార్టీలకు అతీతంగా నేతల సంఘీభావం

► శిబిరం వద్ద ఆత్మాహుతికి ప్రయత్నించిన ఓ యువకుడు

► జగన్‌ను పరామర్శించిన సోదరి షర్మిల


 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు

 ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏడురోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం బాగా విషమించింది. బాగా నీరసించిపోయారు. సోమవారం మూడుసార్లు పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. దీక్షను ఆపి తక్షణం ఆహారం తీసుకోకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు సోమవారం రాత్రి జగన్‌కు వివరించారు. అయితే తన ప్రాణాల కన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే ముఖ్యమంటూ దీక్షను కొనసాగించడానికే జగన్ నిర్ణయించుకున్నారు.



ఆహారం తీసుకోవాలంటూ తాము చేసిన సూచనలను జగన్ తోసిపుచ్చారని వైద్యులు తెలిపారు. జగన్ రక్తపరీక్షల్లో చక్కెర నిల్వలు బాగా పడిపోయి 61 ఎంజీకి చేరుకున్నాయని, ‘కీటోన్ బాడీస్ స్థాయి 3 ప్లస్’గా ఉందని వెల్లడైంది కనుక మూత్రపిండాల పనితీరుపైనా, మెదడు పనితీరుపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు. శరీరంలో ‘పొటాషియం’ నిల్వలు అసాధారణ స్థాయికి చేరుకుంటాయని, అపుడు పరిస్థితి ఇంకా విషమిస్తుందని, కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం తలెత్తుతుందని వైద్యులు హెచ్చరించారు. దీక్షను ఇంకా

 మిగతా 6వ పేజీలో ఠ

 

 కొనసాగించడమంటే అది సాహసమే అవుతుందని వారు చెబుతున్నారు. సోమవారం ఉదయం 7.30లకు జరిపిన పరీక్షల్లో జగన్ 72.7 కిలోల బరువున్నారు. బీపీ 130/ 90, పల్స్ 80గా ఉన్నాయి. షుగర్ ల్యాబ్‌లో పరీక్షిస్తే 61 ఎంజీగా, స్ట్రిప్‌పై 84 ఎంజీగా ఉంది. తేడా ఉండటం వల్ల వైద్యాధికారులు షుగర్ రిపోర్టు ప్రకటించకుండా నిలిపివేశారు. మద్యాహ్నం 1.30కి జరిపిన పరీక్షల్లో బీపీ 130/80, పల్స్ 80 ఉండగా బరువు 72.7 కిలోలు ఉన్నారు. రాత్రి 9.00 గంటలకు  పరీక్షల్లో బీపీ 130/ 80, పల్స్ 77 ఉండగా బరువు 72.4 కిలోలున్నారు. బాగా నీరసించి పోవడంతో సోమవారం కొద్ది సేపు మాత్రమే జగన్ కూర్చోగలిగారు. కళ్లు బాగా వేడెక్కుతూ ఉండటంతో కళ్లపై చల్లని బట్టను కప్పుకుని పూర్తిగా పడుకుండి పోయారు.



 ఉద్విగ్న భరిత వాతావరణం

 జగన్ దీక్షా వేదిక వద్ద సోమవారం ఉదయం నుంచీ ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. ఆయన ఆరోగ్యం గంట, గంటకూ ప్రమాదస్థాయికి చేరుకుంటోందని టీవీల ద్వారా తెలుసుకున్న ప్రజలు, అభిమానులు వెల్లువలాగా తరలి వచ్చారు. గుంటూరు పరిసరాల్లో నుంచి భారీగా తరలి వచ్చిన జనం  వేదికకు దగ్గరగా వెళ్లి చూడడానికి ప్రయత్నించడం, చూడలేనివారు నిరాశ పడడం కనిపించింది. జగన్ ఆరోగ్య పరిస్థితిపై వారందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జగన్ స్థితిని  వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెరలపై చూసి మహిళలు  కన్నీటి పర్యంతం అయ్యారు. జగన్ దీక్షను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెడుతూ మహిళలు పెద్దపెట్టున రోదించడం కనిపించింది. యువకులైతే ఆగ్రహావేశాలతో ఊగి పోతూ నినాదాలు చేశారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, సీనియర్లు చంద్రబాబు వైఖరిని, కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ప్రసంగించారు.



 మరోమారు జగన్ వద్దకు విజయమ్మ, భారతి

 తనయుని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలిసి ఆందోళన చెందిన జగన్ మాతృమూర్తి , పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన సతీమణి వైఎస్ భారతి హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. దీక్షా శిబిరానికి చేరుకున్నారు. (ఆదివారమే ఇక్కడకు వచ్చి వెళ్లిన భారతి ఆందోళనతో మళ్లీ సోమవారం భర్త వద్దకు చేరుకున్నారు) నీరసంగా, మాట్లాడలేకుండా ఉన్న తనయుని చూసి ఆవేదన చెందిన విజయమ్మ ఆయనకు సపర్యలు చేస్తూ పక్కనే ఉండి పోయారు.  భర్త యోగక్షేమాల సమాచారం గురించి వైద్యులతో వాకబు చేస్తూ భారతి కూడా వేదికపై జగన్ పక్కనే కింద కూర్చుండిపోయారు. జగన్ పరిస్థితి, విజయమ్మ, భారతి విషణ్ణ వదనాలను గమనించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరింత ఉద్వేగానికి లోనయ్యారు. కాగా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా సోమవారం సాయంత్రానికి దీక్షాశిబిరాన్ని సందర్శించారు. జగన్‌ను పరామర్శించి కొద్దిసేపు ఉండి వెళ్లారు.



 రగిలిన రాష్ర్టం

 ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని, ప్రత్తిపాటి అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడంపై సోమవారం రాష్ర్టవ్యాప్తంగా నిరసనలు మిన్నుముట్టాయి. ఒకవైపు జగన్ నిరాహార దీక్షకు సంఘీభావంగా రిలేనిరాహార దీక్షలు చేస్తున్న పార్టీ నాయకులు,కార్యకర్తలు సోమవారం మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు పనిచేయని పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నివేదికల ఆధారంగా జగన్‌పై విమర్శలకు పూనుకోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. జగన్ ఆరోగ్యం కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. రాత్రి రాష్ర్టవ్యాప్తంగా పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి.



 ఆత్మాహుతి యత్నాలు..

 బాధ్యతగలిగిన ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాాష్ర్ట శ్రేయస్సుకోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా ఆయన ఆరోగ్యం గురించి గానీ, ఆయన చేస్తున్న డిమాండ్ గురించి గానీ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆందోళన చెందుతూ, రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ రాష్ర్టంలో పలువురు ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. మొత్తం ఐదు చోట్ల ఆత్మాహుతి యత్నాలు జరిగినట్లు వార్తలందడం చూస్తుంటే రాష్ర్ట ప్రజలు ప్రత్యేక హోదా గురించి, ప్రతిపక్ష నేత ఆరోగ్యం గురించి ఎంతగా ఆందోళన చెందుతున్నారో అర్ధం చేసుకోవచ్చునని పరిశీలకులంటున్నారు.



దీక్షా శిబిరానికి వచ్చిన ఓ యువకుడు జగన్ పరిస్థితి చూసి చలించిపోయి పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించడంతో నాయకులు,కార్యకర్తలు అడ్డుకుని రక్షించారు. ఆ యువకుడిని గుంటూరునగరానికి చెందిన దగ్గుమల్లి పూర్ణ వెంకటసాయిగా గుర్తించారు. గుంటూరుజిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ సైదా, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మునగాల కృష్ణారెడ్డి, తిరుపతి ఎస్వీయూలో మాసుమయ్య అనే విద్యార్థి పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నిస్తే పక్కనున్నవారు అప్రమత్తమై కాపాడారు. వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరులో రాస్తారోకోలో పాల్గొన్న తురకపల్లి కేశమ్మ అలియాస్ రంగమ్మ విష గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.



 సీపీఐ సంఘీభావం

 జగన్ ప్రత్యేక హోదా దీక్షకు సోమవారం సీపీఐ నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌కు తాము సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వారు వచ్చినపుడు కూడా జగన్ లేవలేని స్థితిలో ఉన్నారు. జగన్ దీక్షపై ఏపీ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తూండటాన్ని సీపీఐ నేతలు తప్పు పట్టారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీక్ష విరమణకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22 వ తేదీన రాష్ట్రానికి వస్తున్నందున అంతకు ముందే ప్రత్యేక హోదాపై ఒక విస్పష్టమై ప్రకటన చేయాలని కోరారు.

 

  ఉదయం 7.30లకు.. (సోమవారం)

 బరువు    72.9 కిలోలు

 బీపీ    130/90

 పల్స్    80

  మధ్యాహ్నం 1.30కి

 బరువు    72.7 కిలోలు

 బీపీ    130/80

 పల్స్    80

  రాత్రి 9.00కి

 బరువు    72.4 కిలోలు

 బీపీ    130/80

 పల్స్    77


 షుగర్... ల్యాబ్‌లో పరీక్షిస్తే 61 ఎంజీగా, స్ట్రిప్‌పై 84 ఎంజీగా ఉంది. తేడా ఉండటం వల్ల వైద్యాధికారులు షుగర్ రిపోర్టు ప్రకటించకుండా నిలిపివేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top