అడుగడుగునా వైఫల్యం

అడుగడుగునా వైఫల్యం - Sakshi


 సీఎం చంద్రబాబుపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

 

సాక్షి ప్రతినిధి, కడప: ‘‘వరద బాధితులు సర్వస్వం కోల్పోయారు. అధికారులు ఇలా వచ్చి అలా చూసి వెళ్లారు. ఎన్ని ఇళ్లు నష్టపోయాయి? ఎంత మంది బాధితులు ఉన్నారు? అన్న విషయాలను ఇష్టమొచ్చినట్లు నమోదు చేసుకుంటున్నారు. నమోదు చేసుకున్నవాటికి పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. స్వయంగా ముఖ్యమంత్రి సైతం ఈ ప్రాంతంలో పర్యటించినా ప్రజలకు ఒరిగిందేం లేదు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాధితులను ఆదుకునేందుకు నిధులివ్వకుండా ముఖ్యమంత్రి అధికారులను దబాయిస్తున్నారని దుయ్యబట్టారు.



వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో సోమవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ‘‘అన్నా.. సర్వస్వం కోల్పోయాం.. మమ్మల్ని పలకరించే నాథుడే లేడు. ఉచితంగా ఇచ్చే బియ్యం కూడా ఒకటి, రెండు ఇళ్లకు ఇచ్చి వెళుతున్నారు. పదిహేను రోజులుగా బతకడమే కష్టంగా ఉంది’’ అని ప్రతి గ్రామంలో వరద బాధితులు ఆయనతో చెప్పుకుని వాపోయారు. అనంతరం రైల్వేకోడూరులోని గుంజనేరు వద్ద జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘25 కిలోలు చొప్పున బియ్యం కొన్ని కుటుంబాలకు మాత్రమే అందించారు. కనీసం పావువంతు బాధితులకు కూడా బియ్యం అందలేదు. 15 రోజులుగా ఉపాధి లేదు. మరో 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి రూ.4 వేలు ఆర్థికసాయం చేయాలి. బాధిత కుటుంబాలన్నింటికీ 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర, ఇతర నిత్యావసర సరుకులు అందించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.



 నిధులివ్వకుండా దబాయింపు ఏమిటి?

 వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను దబాయిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం నిధులు, వనరులిస్తేనే అధికారులు ప్రజలకు సహాయ పడగలరని చెప్పారు. అవి ఇవ్వకుండా ఉత్త దబాయింపుల వల్ల ఉపయోగం లేదన్నారు. ‘‘గ్రామ గ్రామాన వరద బాధితులను పలుకరిస్తూ వచ్చాం.. బతకడమే కష్టంగా ఉందని బాధితులు వాపోతున్నారు. వరద సహాయక చర్యలు అరకొరగానే కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి వంద శాతం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది.



ప్రభుత్వం బాధితులకు మద్దతుగా నిలవాల్సిన తరుణమిదే’’ అని చెప్పారు. వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీడియా వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్తే వారి బాధలు, ఆవేదన ఏమిటో విడమరచి చెబుతారని చెప్పారు. మీడియాద్వారానైనా చంద్రబాబులో మార్పు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి వెంట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, పార్టీ రైల్వేకోడూరు సమన్వయకర్త కొల్లం బ్రహ్మనందరెడ్డి, పోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఉన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top