అండగా ఉంటా.. అధైర్యపడొద్దు

అండగా ఉంటా.. అధైర్యపడొద్దు - Sakshi


వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వరద బాధితులకు జగన్ భరోసా

 

 సాక్షి ప్రతినిధి, కడప/తిరుపతి: వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు తాము అండగా ఉంటామని, అధైర్య పడొద్దని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. మోకాలిలోతు నీటిలో పర్యటిస్తూ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వంపై పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన సోమవారం ఉదయం కుక్కలదొడ్డి ఎస్టీ కాలనీ నుంచి ప్రారంభమైంది. రెండు వారాలుగా ఎదుర్కొంటున్న బాధలను ప్రజలు ఆయనకు చెప్పుకున్నారు.



ఇళ్లు, పంటలు, సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పదిరోజులుగా నీటిలోనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు.ప్రభుత్వం కనీస సహాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్డు మార్గం ద్వారా చిత్తూరుజిల్లాకు చేరుకుని శ్రీకాళహస్తి, ఏర్పేడు నియోజకవర్గాల్లో వరదలవల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు.



 అందరికీ సాయం అందించలేదు: జగన్ సోమవారం ఉదయం 10.30 గంటలకు కుక్కలదొడ్డి గ్రామ సమీపంలోని ఎస్టీ కాలనీలోకి వెళ్లారు. పడిపోయిన ఇళ్లకు ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా? అని బాధితులను పలకరించారు. కొందరికి మాత్రమే బియ్యం, సరుకులు ఇచ్చారని, 15 రోజులుగా పనులు లే క ఇక్కట్లు పడుతున్నామని కుంభా పార్వతి అనే మహిళ తెలిపారు. ‘ఉన్న ఇల్లు కూలిపోయింది. మళ్లీ కట్టించుకునే శక్తి లేదు. కుటుంబ పెద్ద లేడు. ఇద్దరు పిల్లలున్నారు. నేనెట్టా బతకాల సామీ?’ అంటూ లక్షుమ్మ అనే మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను అండగా ఉంటానని,  జగన్ ఆమె కు ధైర్యం చెప్పారు.



నష్టపోయిన వారికందరికీ నష్టపరిహారం అందేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వస్తానని వివరించారు. ‘గుండెకు రంధ్రం పడింది.. ఆపరేషన్‌కు రూ.3 లక్షలు ముందుగా పెట్టుకోమంటున్నారు. అంత భరించే శక్తి మాకు లేదు’ అంటూ సరోజమ్మ అనే యువతి వాపోయింది. ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఆ కార్డు ద్వారా ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా? అని జగన్ ఆరా తీశారు. ‘ముందుగా మేం డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తారట సార్’ అని సరోజమ్మ తల్లి వాపోయింది. ఆ కుటుంబానికి అండగా నిలవాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ సూచించారు. అక్కడి నుంచి జగన్ జ్యోతినగర్ కాలనీకి చేరుకున్నారు.



ఇక్కడ నివసిస్తున్న వారమంతా కుష్ఠురోగులమని, తమకు వికలాంగ పెన్షన్లు అందడం లేదని తెలిపారు. కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కొందరికి ఇస్తున్నారని వివరించారు. పక్కా గృహాలు అవసరమున్నా మంజూరు చేయలేదని వాపోయారు. ‘మీ అందరి గురించి నేను ప్రభుత్వంతో పోరాడతాను. త్వరలోనే మంచి రోజులు వస్తాయి..’ అని వారికి ఆయన ధైర్యం చెప్పారు. అనంతరం శెట్టిగుంట ఎస్టీ కాలనీని పరిశీలించారు. కాలనీ అవతల భూములున్నాయని, శెట్టిగుంట చెరువు అలుగుతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని, వంతెన నిర్మించాలని వారు కోరారు.  శెట్టిగుంట ఎస్సీ కాలనీ నుంచి లక్ష్మిగారిపల్లెకు  జగన్ చేరుకున్నారు. ఇటీవల గోడకూలి మృతి చెందిన హర్షవర్ధన్ (5) అనే చిన్నారి కుటుంబీకులను  పరామర్శించారు. తమను బీసీ జాబితాలో చేర్చాలని గ్రామానికి చెందిన కొయ్య బొమ్మల తయారీదారులు కోరారు.గవర్నర్‌కు లేఖ రాస్తానని, వారి తరఫున కోర్టుకు వెళతామని జగన్ చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top