మోసకారికి ప్రజలు ఇంకెలా బుద్ధి చెబుతారు?

మోసకారికి ప్రజలు ఇంకెలా బుద్ధి చెబుతారు? - Sakshi


అలాంటి మనిషిని చెప్పులతో కొడితే తప్పా: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 

- చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చకుండా రైతన్నల ఆత్మహత్యలకు కారకుడయ్యారు

- ఓటుకు కోట్లు కేసుకు భయపడే అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ను నిలదీయలేదు

- ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు రూ.600 కోట్లు ఖర్చు చేశారు

-‘అనంత’లో 3వ రోజు రైతుభరోసా యాత్రలో విపక్ష నేత జగన్

 

 సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేర్చలేదు. ఈ రెండేళ్లలో రుణమాఫీ చేయకపోవడంతో ఆయన మాటలు నమ్మి మోసపోయి అప్పుల పాలైన రైతులు, చేనేతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు తప్పుడు హామీలే వీరి ఆత్మహత్యలకు కారణం. అనంతపురం జిల్లాలోనే ఇప్పటిదాకా 79 కుటుంబాలను పరామర్శించా. చంద్రబాబు రెండేళ్లపాలన పూర్తి అవినీతిమయం. వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రజలను పూర్తిగా మోసం చేసిన మనిషిని చెప్పులతో కొడితే తప్పా? అని అడుగుతున్నా.



కనీసం ప్రజలు చెప్పులు చూపించినప్పుడైనా జ్ఞానోద యమై ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తాయి. అప్పుడు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తారు. నరేంద్రమోదీకి అల్టిమేటం ఇస్తారు’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న ఐదోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా మూడోరోజు శుక్రవారం ఆయన తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో పర్యటించారు. పెద్దపప్పూరు మండలం రామకోటిలో ఆత్మహత్యచేసుకున్న నాగరాజు కుటుం బాన్ని, ముచ్చుకోట గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న లీలా కృష్ణమూర్తి అనే రైతు కుటుంబానికి భరోసా కల్పించారు. యాడికిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...



 ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబే...

 ప్రభుత్వ మోసపూరిత హామీలతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు తోడుగా నిలబడి, ఆదుకునేందుకే రైతుభరోసా యాత్ర చేస్తున్నాం. అనంతపురం జిల్లాలోనే ఇప్పటిదాకా 79 కుటుంబాలను పరామర్శించా. వీరంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని చంద్రబాబు ఒక్కసారి చేతులను గుండెలపై వేసుకుని సమీక్షించుకోవాల్సింది పోయి అంతా ఆనందంగా ఉన్నారని అవహేళన చేస్తూ అసెంబ్లీసాక్షిగా మాట్లాడారు. ‘ఎన్నికలప్పుడు ఏం చెప్పారు.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఆత్మహత్యలకు మీది బాధ్యత కాదా?’ అని చంద్రబాబును నిలదీశాను. ‘బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలన్నా.. రుణాలు పూర్తిగా మాఫీ కావాలన్నా... చేనేత రుణాలు మాఫీ కావాలన్నా.. బాబు ముఖ్యమంత్రి కావాలి’ అని ఎన్నికలకు ముందు టీవీ ఆన్‌చేసినా, ఎక్కడ ఫ్లెక్సీలు చూసినా ప్రకటనలు కనిపించేవి. సీఎం పదవి కోసం ఎవ్వరినీ వదలకుండా అందరినీ మోసం చేశారు.



జాబు కావాలంటే బాబు రావాలన్నారు. బాబుకు ముఖ్యమంత్రి జాబు వచ్చింది... కానీ ఆయన మాత్రం ఉన్న జాబులను తీసేస్తున్నారు. జాబు లేకపోతే ఇంటికి రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తామని ఆయన సంతకం ఉన్న కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లకు భృతి ఇస్తామన్నారు. ఈ రెండేళ్లలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. రైతులు, మహిళలు, చేనేతలు, నిరుద్యోగులు.. ఇలా అందరికీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారు. ఈ రెండేళ్లలో ఆయన చేసిందేమిటంటే విచ్చలవిడి అవినీతి. ఇసుక నుంచి బొగ్గుదాకా, రాజధాని భూముల నుంచి దేవాలయ భూముల దాకా అవినీతికి తెగబడ్డారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారు. ఇలాంటి వ్యక్తి సిగ్గులేకుండా అవినీతి గురించి, అవినీతి రహిత రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. పిల్లలతో కూడా నవ నిర్మాణదీక్ష అంటూ ప్రమాణం చేయిస్తున్నారు.



 ప్రతిపక్షం లేకుండా చేసేందుకే..    

 ప్రజల గొంతు విన్పించకూడదని, ప్రతిపక్షం లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నావు. ఒక్కొక్కరికి రూ.30-40 కోట్లు ఖర్చు చేసి ఇప్పటివరకూ 18-19 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశావు. దీనికి రూ. 600కోట్ల దాకా ఖర్చయ్యింది. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వ చ్చింది? ఇదంతా అవినీతి డబ్బని ఆరేళ్ల చిన్నపిల్లోళ్లకూ తెలుసు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ, సూట్‌కేసుల్లో బ్లాక్‌మనీ నింపి ఇస్తూ ఆడియో, వీడియో రికార్డుల్లో అడ్డంగా చిక్కారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యాంలోకి నీరు రాకుండా.. 800 అడుగుల నుంచే నీళ్లు తోడేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అయినా కృష్ణా, గోదావరిపై అక్రమ ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని కేసీఆర్‌ను నిలదీయడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులు బయటకు తీసి కేసీఆర్ జైళ్లో పెట్టిస్తారనే భయం.



 సీబీఐ కేసులకు భయపడే ప్రత్యేక హోదా నిర్వీర్యం

 ప్రత్యేక హోదా వస్తే  పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు వస్తాయి. ఇన్‌కం ట్యాక్స్ భారం తగ్గుతుంది. రాయితీ కరెంటు వస్తుంది. మరిన్ని రాయితీలు వర్తిస్తాయి. దీంతో సింగపూర్, దుబాయికి వెళ్లకుండా పరిశ్రమలు మన రాష్ట్రానికే వస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా తెలిసినా చంద్రబాబు తన స్వార్థం కోసం ఐదుకోట్ల మందిని నడిరోడ్డున నిలబెట్టారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే మా మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుంటామని ఎందుకు కేంద్రానికి అల్టిమేటం ఇవ్వలేదు? నరేంద్రమోదీని గట్టిగా అడిగితే రెండేళ్ల అక్రమాలపై సీబీఐ కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతారని భయం.



 చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

 చంద్రబాబు మాటలు నమ్మి అప్పుల పాలైన చేనేత కార్మికులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. నిన్న పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో ఆత్మహత్య చేసుకున్న నాగరాజు అనే చేనేత కుటుంబాన్ని పరామర్శించా. కేవలం రూ.40వేలు రుణం మాఫీ కాక నాగరాజు చనిపోయారు. గతంలో ముడిసరుకుపై రూ.600-1000 సబ్సిడీ వచ్చేది. చేనేత రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. రుణాలు మాఫీ చేసి ప్రతి కుటుంబానికి రూ.లక్ష అదనంగా రుణాలు ఇస్తామన్నారు. అందరికీ ఇళ్లు కట్టిస్తాం, రూ.1.50 లక్షలతో షెడ్డు నిర్మిస్తామన్నారు... ఏవీ చేయలేదు. దీంతో ప్రతి చేనేత కార్మికుడు బోరున ఏడుస్తున్నారు. చేనేత కార్మికుల గోడు విన్పించలేదా? అని అసెంబ్లీలో గట్టిగా అడిగినా స్పందించలేదు.

 

 చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి


 చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రూ. 87 వేల కోట్ల రుణాలుండేవి. ఈ రెండేళ్లలో వడ్డీనే రూ.25 వేల కోట్లయ్యింది. కానీ చంద్రబాబు వడ్డీలో మూడోవంతు కూడా మాఫీ చేయలేదు. పైగా ముష్టివేసినట్లు  రూ.3వేలు ఇచ్చి డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారు. ఇలాంటి విషయాలపై నిలదీస్తే తప్పట! చంద్రబాబూ.. తప్పుచేస్తున్నావని గట్టిగా చెప్పడం నేరమట! సాక్షాత్తూ మీ ఎమ్మెల్యే (జేసీ ప్రభాకర్‌రెడ్డి) వార్నింగ్ ఇచ్చి చెబుతున్నారు. చంద్రబాబు ఎవర్ని మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా ప్రశ్నించకూడదట. తప్పుచేసినా ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం బతకదు. తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి కాలువ ఉంది. ఒక్కసారి గుండెలపై చేయివేసుకుని  కాలువ ఎవరి హయాంలో వచ్చిందో చెప్పాలని తాడిపత్రి ఎమ్మెల్యేను అడగండి. ప్రస్తుతం కాలువకు నీళ్లురాక పండ్ల తోటలన్నీ ఎండిపోతున్నాయి. దీనికి కారణం చంద్రబాబే! ఆయనలో మార్పు రావాలంటే ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. ఎన్నికలు త్వరగా వస్తే.. టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిస్తే... అప్పుడు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. అందుకు మనమంతా కలసి పోరాడాలి. అందుకు మీ ఆశీస్సులు, తోడ్పాటు, దీవెనలు కావాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top