యువ నైరాశ్యం

సెట్విజ్‌ కార్యాలయం

లక్ష్యానికి దూరంగా యువతకు ఉపాధి

ఉత్సవ విగ్రహంలా యువజన సర్వీసుల శాఖ, 

రెండేళ్ళుగా నిలిచిపోయిన స్వయం ఉపాధి రుణాలు.. 

నిర్వీర్యమౌతున్న సంఘాలు... పెడదారి పడుతున్న యువత..

 

జిల్లాలోని యువత: 7,66,510

యువతులు: 388033

యువకులు: 378477

ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్నవారు:: సుమారు 61,000

ఉత్తీర్ణులయినా నమోదు చేసుకోని వారు : 23,000

రిజిస్టర్డ్‌ సంఘాలు: 560

ప్రస్తుతం పనిచేస్తున్నవి: 150

కార్యక్రమాలు నిర్వహిస్తున్నవి: 45

 

విజయనగరం కంటోన్మెంట్‌: కొంతమంది యువకులు ... ముందుతరం దూతలు... పావన నవజీవన బృందావన నిర్మాతలు. వారిని సాదరంగా ఆహ్వానించాలి. వారిలో చైతన్య స్ఫూర్తిని నింపాలి. వారి స్వయం ఉపాధికి మార్గం చూపాలి. వారిలోని నైపుణ్యాన్ని మరింత మెరుగు పర్చాలి. వారి ఉపాధికి రుణాలు పంపిణీ చేసి... చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన యువజన సర్వీసుల శాఖ చేష్టలుడిగి చూస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సెట్విజ్‌కార్యాలయం ఉత్సవ విగ్రహంలా తయారైంది. పూర్వ వైభవం కోసం పరితపిస్తోంది. కొన్నాళ్ల క్రితం యువజన సంఘాలు బలోపేతంగా ఉండేవి. ఆ సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలందేవి. కానీ నేడు ఆవి కనుమరుగయ్యాయి. జిల్లాలో 560 రిజిస్టర్డ్‌ యువజన సంఘాలుండగా ఇందులో చిన్నా... చితకా... కార్యక్రమాలు నిర్వహిస్తున్నవి వేళ్లపై లెక్కపెట్టొచ్చంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రోత్సాహం కరువవడంతో ఆయా సంఘాలు కూడా నిర్వీర్యమైపోతున్నాయి. చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గ్రామాలు, పట్టణాల్లోని యువతకు గతంలో ఇచ్చే క్రీడా పరికరాలు, క్రికెట్‌ కిట్లు, వాలీబాల్‌ వంటివి అందజేసి వారిలో చైతన్యాన్ని రగిల్చే కార్యక్రమాలు కనిపించడం లేదు. అసలు యువజన సంఘాలను బలోపేతం చేయాలనే తలంపు కూడా ప్రభుత్వానికి కనిపించడం లేదని దీంతో యువత పెడదారి పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

 

మూడేళ్లుగా నిలిచిపోయిన రాజీవ్‌ యువశక్తి రుణాలు! 

గతంలో సెట్విజ్‌ కార్యాలయం నుంచి సీఎంఈవై, రాజీవ్‌ యువశక్తి వంటి రుణాలు సబ్సిడీపై ఇచ్చి వారి స్వయం ఉపాధికి ప్రోత్సహించేవారు. ఇప్పుడా రుణాలు మూడేళ్లుగా నిలిచిపోవడంతో యువత రుణాల కోసం ఎదురు చూస్తోంది. బీసీ, ఎస్సీ,  కార్పొరేషన్‌ రుణాలన్నీ రాజకీయ పరంగా మారిపోవడంతో యువతకు ఎటూ ప్రయోజనం కలగడం లేదు. ఫలితంగా చాలా మంది వలసలు పోవడం లేదా వక్రమార్గాల్లో వెళ్లడం కనిపిస్తున్నది. వారిని సంఘాలుగా మార్చి నిరంతరం మానిటరింగ్‌ చేసే వ్యవస్థ ఇప్పుడు కనిపించడం లేదు. ఏదయినా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు వస్తే వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారు. లేదా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప యువతపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. 

 

 

ఎక్కడ రైడ్‌?

రిమోట్‌ ఇంటీరియల్‌  ఏరియా డెవలప్‌మెంట్‌(రైడ్‌) కార్యక్రమం కింద మారుమూల ప్రాంతాల అభివృద్ధి పథకం గతంలో అమలయ్యేది. దీని కింద రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, మంచినీటి సదుపాయం వంటి కార్యక్రమాలు నిర్వహించి యువత నక్సలిజం, వేర్పాటు వాదం వైపు ఆకర్షితులవకుండా చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గిరిజన యువతను అభివృద్ధి పథం వైపు మళ్లించడానికి తీసుకున్న చర్యలూ కానరావడం లేదు. తల్లిదండ్రులు తీసుకుంటున్న శ్రద్ధ తప్ప ప్రభుత్వ పరంగా వారికి కల్పించాల్సిన చైతన్య కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదు. దీనివల్ల యువత ఇప్పుడు సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ల వద్దే కాలం గడుపుతోంది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు కన్నెత్తి చూడటం లేదు. సెట్విజ్‌ కార్యాలయం చాలా మంది యువత తమ తల్లి దండ్రుల ఆర్ధిక స్థితిని బట్టి పోటీ పరీక్షలు, వివిధ జాబ్‌ మేళాల ద్వారా ఉద్యోగాలకు ఎంపికవుతుంటే, పేద, మధ్య తరగతి యువత తీవ్ర ఇబ్బందుల మధ్య ఉపాధి మార్గాల కోసం ఎదురుతెన్నులు చూస్తోంది. గ్రంధాలయాల ద్వారా పోటీ పరీక్షలకు అవసరమయిన పూర్తి స్థాయి సహాయాలు అందడం లేదనే వాదన వినిపిస్తోంది. నిరుపేద యువకులకు అత్యధిక ఫీజులు, కోచింగ్‌ సెంటర్లలో ఉండి తర్ఫీదు అయ్యే పరిస్థితులు లేవు. అందువల్ల వారు మధ్యలోనే చదువును ఆపేసి పనులకు వెళ్లిపోతున్నారు. వీరికి అవసరమయిన సమాచారం అందడం లేదు. ]

 

 

మరమ్మతుల్లో సెట్విజ్‌ కార్యాలయం:

జిల్లా యువతను నిత్యం తర్ఫీదునిచ్చి, మానిటరింగ్‌ చేసే కార్యక్రమాల్లో ముందుండాల్సిన సెట్విజ్‌ కార్యాలయం నిధుల్లేక నీరసించిపోతోంది. ఒకప్పుడు నిత్యం యువతతో కళకళ లాడాల్సిన ఈ కార్యాలయం ఇప్పుడు మరమ్మతులతో దీనావస్థలో ఉంది. ఈ కార్యాలయం కోసం నిర్మించిన భవనాన్ని మీసేవా కార్యాలయాల శిక్షణకు అప్పగించడంతో సిబ్బంది పాత భవనంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top