ఏరువాక..

ఏరువాక.. - Sakshi


నేటి పండుగకు ఏర్పాట్లలో రైతన్న బిజీ

ఎడ్లకు అలంకరణలు

సామగ్రి కొనుగోళ్లలో రైతులు

పౌర్ణమి సందర్భంగా ఊరూరా ఎడ్ల బండ్లతో ఊరేగింపు




జహీరాబాద్‌: ఏరువాక పున్నమికి రైతులు సన్నద్ధమయ్యారు. ఖరీఫ్‌ సీజన్‌కు ముందు వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. దీన్ని పండుగలా నిర్వహిస్తారు. ఇందుకోసం రైతులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎడ్లు, ఆవులను రంగులతో అలంకరించనున్నారు.



ఈ ఏడాది వర్షాలు ముందుగానే మొదలు కావడంతో రైతులు ఏరువాకను ఉత్సాహంగా జరుపుకునే వీలుంది. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని ఊరూరా ఏరువాక పండుగను  జరుపుకుంటారు. ఉదయమే పశువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. తరువాత వాటిని అందంగా ముస్తాబు చేస్తారు.



కొమ్ములకు పనతాళ్లు కడతారు. మూతికి చిల్‌మల్‌క తాళ్లతో  అలంకరిస్తారు. ఎడ్ల మెడలో గంటలు కడతారు. ఎడ్లతోపాటు బండ్లను కూడా అలంకరిస్తారు. అనంతరం పశువులకు ప్రత్యేక వంటకాలు తినిపిస్తారు. ముఖ్యంగా భక్షాలు(పోలెలు) తినిపిస్తారు. పులుగం పేరుతో అన్నం కూడా వండి పెడతారు. వర్షాకాలంలో చలి, వర్షానికి తట్టుకుంటాయనే ఉద్దేశంతో కోడి గుడ్లను సైతం తినిపిస్తారు. వంటకాల్లో ఇంగువ కూడా వేస్తారు.



గ్రామాల్లో బండ్ల ఊరేగింపు...

అలంకరించిన ఎడ్ల బండ్లను గ్రామంలో ఊరేగిస్తారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపులు సాగుతుంది. ఈ వేడుకల్లో రైతులు, ప్రజలు, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు.


ట్రాక్టర్ల రాకతో కళ తప్పిన ఏరువాక

గతంలో ప్రతి ఇంట్లో ఏరువాక సందడి కన్పించేది. 99 శాతం గ్రామాల్లో రైతు, రైతు కూలీల కుటుంబాలే ఉండడంతో ప్రతి ఇంట్లో పశువులు ఉండేవి. దీంతో ఏరువాక రోజు ప్రతి ఇంట్లోని పశువులను వారు అలంకరించేవారు. కాలానుగుణంగా ఎడ్లు, పశువుల సంఖ్య తగ్గిపోయింది. వాటి స్థానంలో ట్రాక్టర్లు రావడంతో క్రమంగా ఏరువాక ఉత్సవాలు కళ తప్పుతున్నాయి.



ఉత్సవాలతో ఉల్లాసం..

ఏరువాక పండుగాను జరుపుకోవడం ద్వారా వ్యవసాయ పనులు చేసేందుకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ ఉత్సవాలను విస్మరిస్తే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఎడ్లను అలంకరించుకునేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసుకుని వెళ్లేందుకు ప్రత్యేకంగా జహీరాబాద్‌ వచ్చా. ఏటా ఎడ్లను అందంగా అలంకరిస్తా.  ఈసారి కూడా అవసరమైన గొండలు, నూలు తాళ్లను కొన్నా.

– స్వామిదాస్, రైతు, ఈదులపల్లి



50 ఏళ్లుగా ఉత్సవాలు..

ఏరువాక ఉత్సవాలను నేను చిన్ననాటి నుంచి జరుపుకుంటున్నా. గత 50 ఏళ్లుగా ఏటా మా వద్ద ఉన్న ఎడ్లను అలంకరించి పండుగ చేస్తున్నాం. గతంలో మాదిరిగా ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగడం లేదు. పశువుల సంఖ్య తగ్గింది. అనేక మంది ట్రాక్టర్లపై ఆధారపడ్డారు. ఎడ్లు, ఆవులు ఉన్న వారు మాత్రమే పండు చేస్తున్నారు.  అప్పట్లో ఊరంతా ఉత్సవాలు జరుపుకొనేవారు. ఈ సారి పండుగ కోసం ఎడ్ల అలంకరణ సామగ్రి కొన్నా. పండుగను ఘనంగా జరుపుకుంటా.

– తుల్జారాం, రైతు, గినియార్‌పల్లి

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top