ఎల్లో ట్యాక్స్ కట్టలేం

ఎల్లో ట్యాక్స్ కట్టలేం - Sakshi


- స్పష్టంచేసిన ఓబులవారిపల్లి - కృష్ణపట్నం రైల్వే కాంట్రాక్టు కంపెనీ

- రూ. ఐదు కోట్లు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్

 

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం పనుల్లో తనకు 25 శాతం కమిషన్ ఇవ్వాలని స్పీకర్ శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్లు మీద దౌర్జన్యం చేసిన సంఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటన మరొకటి బయట పడింది. ఓబులవారిపల్లి- కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులు చేస్తున్న గుజరాత్‌కు చెందిన మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులను నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్మే కరుగొండ్ల రామకృష్ణ రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. ఆ కంపెనీ సెక్రటరీ కల్పేష్ దేశాయ్ ఇతర అధికారులు నెల్లూరులో సోమవారం  విలేకరుల వద్ద ఎమ్మెల్యే బెదిరింపులు, దౌర్జన్యాలను బట్టబయలు చేశారు. తమ సైట్ మేనేజర్ రామును ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన ఆడియో సీడీలను మీడియాకు అందించారు.



రూ.183 కోట్ల పనిలో 5 శాతం కానీ, లేదా రూ.5 కోట్లు కానీ పర్సెంటేజీ కింద ఇవ్వాలని ఎమ్మెల్యే రామకృష్ణ తమ మీద ఒత్తిడి చేస్తున్నారని కల్పేష్ దేశాయ్ వెల్లడించారు. తాము తక్కువ మొత్తంతో ఈ కాంట్రాక్టు దక్కించుకున్నందువల్ల అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ సంస్థ అధికారులను బూతులు తిడుతున్నారనీ, పనులు చేస్తున్న సిబ్బంది మీద తన అనుచరులతో దాడులు చేయించడంతో వారు బెదిరిపోయి పనులకు రావడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే నుంచి తమకు రక్షణ కల్పించి పనులు జరిపించకపోతే రైల్వే శాఖకు చెప్పి పనులు పూర్తిగా నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయం గురించి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, రైల్వే ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు.

 

 కంపెనీ మేనేజర్ రాము, ఎమ్మెల్యే రామకృష్ణ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ

 మేనేజర్: నమస్తే సర్ నేను రాము.  నేను మా కంపెనీ జీఎంకు ఫోన్ చేసి మీ నాలుగు డిమాండ్లు చెప్పినా ను.  శుక్రవారం సాయంత్రం లేదా శనివారానికి వస్తామని చెప్పినారు. అంతవర కు పనిచేయించడానికి అడ్డు చెప్పొద్దు సార్.

 ఎమ్మెల్యే: ఇలాంటివన్నీ వద్దు.. మీకు ఎన్నిసార్లు చెప్పినాను.

 మేనేజర్: కాదు సార్ ఎమ్మెల్యే రామకృష్ణ మాకు అన్నలాంటోడు, మేం మాట్లాడుకుంటామని అంటున్నారు.

 ఎమ్మెల్యే: అవన్నీ ఏం కుదరదు.. వాళ్లకు... పగలగొడతా (బూతులు తిట్టారు).

 మేనేజర్: సార్ అలా అనద్దండి. శుక్రవారం నాటికి నేను వాళ్లను పిలిపిస్తా. అంతవరకు పనులు ఆగకుండా చేయిస్తే నేను కూడా చెప్పుకునే దానికి ఉంటుంది. ఎమ్మెల్యే జెంటిల్‌మెన్ నా మాటకు విలువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. శుక్రవారం నాటికి మా వాళ్లు వచ్చి సెటిల్ చేసుకోకపోతే శనివారం నేనే పనులు నిలిపివేయిస్తా.

 ఎమ్మెల్యే: సరేలే మా వాళ్లతో చెబుతా.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top