‘రొచ్చు’ భారత్‌!

ఇంట్లోకి  మురుగునీరు రాకుండా తోడుకుంటున్న ప్రియదర్శిని

పొంగిపొర్లుతున్న మురుగుకాలువలు

ఇంట్లోకి చొచ్చుకొస్తున్న మురుగునీరు

వరాహాల జలకాలాటలతో వ్యాధులు

 

 

పార్వతీపురం రూరల్‌: పొంగిపొర్లే మురుగు కాలువలు. జలకాలాడే వరాహాలు. రక్తం పీల్చిపిప్పి చేసే దోమలు. ఇంట్లోకి వచ్చే మురుగునీరు. దుర్గంధం భరించలేక అవస్థలు. రోగాలతో ఆస్పత్రుల పాలు..  25వ వార్డు పరిధిలోని శివారు ప్రాంతమైన రెల్లివీధిలో పారిశుద్ధ్యం దిగజారిపోయింది. ఎటుచూసినా అస్థవ్యస్తమైన కాలువ నిర్మాణాలతో మురుగునీరు పొంగిపొరలుతోంది. మలేరియా, డయేరియా, టైఫాయిడ్‌ వంటి రోగాల బారిన పడుతున్నారు. వీధిలో నివసిస్తున్న గండి ప్రియదర్శిని అనే మహిళ ఇంట్లోకి నేరుగా మురుగునీరు వెళ్తుండటంతో ఆ కుటుంబం నరకయాతన పడుతోంది. నిరంతరం ఈ ఇంట్లో నివసిస్తున్నవారు ఇంట్లోకి మురుగునీరు చొరపడకుండా తోడుతుంటారు. వర్షం కురిసినప్పుడు వారి యాతన వర్ణనాతీతం. ఇంతటి దారుణంగా పారిశుద్ధ్యం దిగిజారిపోయినా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ వీధిలో తాగునీటిని పట్టుకొనేందుకు ఏర్పాటు చేసిన కుళాయిల కోసం తవ్విన మూడడుగుల లోతున్న గోతుల్లో నిరంతరం మురుగునీరు నిల్వ ఉంటుంది. వాటిలో ఈగలు, దోమలు విలయతాండవం చేస్తుంటాయి. స్వచ్ఛ భారత్‌ నినాదంతో ప్రధాని మోదీ దేశాన్ని ఉత్తేజపరుస్తుంటే.. మున్సిపల్‌ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

 

 

విద్యుత్‌ స్తంభాలు వేయాలి: నిమ్మకాయల ఏలీసా,  రెల్లివీధి

మొత్తం రెల్లికులస్తులుండే మూడోవీధిలో ఒక్క విద్యుత్‌ స్తంభమే ఉంది. దీంతో రాత్రి వేళల్లో వీధిలో చీకట్లోనే వెళ్లాలి. మరో రెండు స్తంభాలు అమర్చి దీపాలు ఏర్పాటు చేయాలి.

 

 

రొచ్చు నుంచి కాపాడండి: గండి ప్రియదర్శిని, రెల్లివీధి

కాలువల నుంచి వచ్చే మురుగు నీరంతా మా ఇంట్లోకి చొచ్చుకొస్తోంది. నిరంతరం బురద నీటిని తోడాల్సి వస్తోంది. దోమలు పెట్రేగిపోవడంతో వంటినిండా దద్దుర్లు పుడుతున్నాయి. వెంటనే మా ఇంట్లోకి మురుగునీరు రాకుండా కాలువ నిర్మించాలి. 

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top