గ్రామీణ దళితుల జీవనం దయనీయం

గ్రామీణ దళితుల జీవనం దయనీయం - Sakshi


సాక్షి, మంచిర్యాల : అణగారిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న కోట్ల రూపాయల లెక్కలు వెక్కిరిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 52 మండలాలలోని గ్రామీణ దళిత వర్గాల పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామీణ ఎస్సీ జనాభాలో రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్‌ తరువాత ఉమ్మడి ఆదిలాబాద్‌ రెండోస్థానంలో ఉండగా, వారి ఆర్థిక, సామాజిక జీవన స్థితిగతులు మాత్రం అథమస్థానంలో ఉన్నాయి.. జిల్లాలోని ఎస్సీ కుటుంబాలలో కడుపు నిండా భోజనం, మెరుగైన జీవితం గడుపుతున్నవి కేవలం 4.6 శాతం మాత్రమే ఉంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, కోటపల్లి మండలంలో కేవలం ఒకే ఒక్క కుటుంబానికి సర్కారీ నౌకరీ ఉండడం వారి జీవనస్థితిని తెలియజేస్తుంది. విద్య, వ్యవసాయం, ఉద్యోగ రంగాల్లో జిల్లాలోని ఎస్సీ కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువనే కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) ఫలితాలు తెలియజేస్తున్నాయి.




కోటపల్లిలో 40.68 శాతం

రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాలు 18.02 శాతం ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 19.59 శాతం ఉన్నాయి. కోటపల్లి మండలంలో అత్యధికంగా 40.68 శాతం దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ మండలంలోని మొత్తం 8,279 గృహాలకు గాను 3,368 కుటుంబాలు ఎస్సీలవే. ఆ తరువాత స్థానాల్లో దహేగాం (37.62శాతం), బెజ్జూరు (35.16 శాతం), జైపూర్‌ (35.10శాతం), నెన్నెల (33.69 శాతం) ఉన్నాయి. అతి తక్కువ ఎస్సీ కుటుంబాలు ఉన్న మండలం సిర్పూర్‌. ఈ మండలంలోని 5,867 కుటుంబాలకు కేవలం 5.05 శాతం మాత్రమే ఎస్సీ వర్గానికి చెందిన వారు. కోటపల్లి మండలంలోని 96 శాతం కుటుంబాలు రూ.5వేల లోపు నెలసరి సంపాదనతోనే దుర్భర జీవితం గడుపుతున్నాయి. తరువాత జైపూర్, నెన్నెలలో సైతం 90 శాతానికి పైగా కుటుంబాలది ఇదే పరిస్థితి.



నెలసరి సంపాదన అత్యల్పం

ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో సైతం ఒక కుటుంబం జీవనానికి నెలకు రూ.5వేలు ఎందుకూ కొరగావు. రూ.5వేల నుంచి రూ.10వేల మధ్య సంపాదన ఉన్న మధ్యతరగతి కుటుంబాలే కష్టంగా కుటుంబాన్ని ఈడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 4,75,708 గ్రామీణ కుటుంబాల్లో దళిత వర్గాలకు చెందినవి 93,213. ఇందులో రూ.5వేల కన్నా తక్కువ సంపాదించే దళిత కుటుంబాలు ఏకంగా 81,708 (87.65 శాతం ). ఇందులో నెలకు రూ.500 నుంచి రూ.4,999 వరకు సంపాదించే కుటుంబాలు ఉండడం గమనార్హం. రూ.5వేల నుంచి రూ.10వేల లోపు సంపాదన గల గ్రామీణ దళిత కుటుంబాలు 7,143 (7.66 శాతం) మాత్రమే.


ఇక రూ.10వేల పైన సంపాదించే కుటుంబాలు 4,347 (4.66 శాతం) ఉన్నాయి. ఈ దళిత కుటుంబాలు మాత్రమే ఉమ్మడి జిల్లాలో కొంత మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే జైనథ్‌ మండలంలోని గ్రామాల్లో కేవలం రెండు కుటుంబాలే రూ.10వేలకు పైబడి సంపాదన ఉన్నవి కాగా, భీమినిలో నాలుగు, మామడలో ఐదు, నేరేడిగొండలో ఆరు కుటుంబాలకు ఈ పరిస్థితి ఉంది. ఒక్క మంచిర్యాల ఉమ్మడి మండలంలోనే 1,077 దళిత కుటుంబాలు రూ.10వేలకు పైగా సంపాదించే కేటగిరీలో ఉన్నాయి.



సర్కారీ కొలువులు ఏపాటి..?

నిరక్షరాస్యత కారణంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లోని ఎస్సీలకు ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. దేశవ్యాప్తంగా 0.77 శాతం గ్రామీణ దళితులు సర్కార్‌ కొలువుల్లో ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్‌లో 0.66 శాతం మందికే ప్రభుత్వ ఉద్యోగం ఉంది. వాటిలో కూడా కిందిస్థాయి ఉద్యోగాలే అధికం. ఉమ్మడి జిల్లాలోని 5.31 లక్షల గృహాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న దళిత కుటుంబాలు కేవలం 3,137 మాత్రమే. వీరు కాకుండా మరో 1673 ఎస్సీ కుటుంబాల్లో ప్రైవేటు ఉద్యోగులు ఉండగా, 309 కుటుంబాల్లో పబ్లిక్‌ రంగంలోని ఉద్యోగులున్నారు.


ఇక జిల్లాలో దళిత కుటుంబాలు అధికంగా ఉన్న కోటపల్లి మండలంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది ఒక్కరికే. ప్రైవేటు, పబ్లిక్‌ సెక్టార్‌లలో ఒక్కరు కూడా లేకపోవడం ఈ మండంలోని ఎస్సీల దయనీయ పరిస్థితిని ఎత్తిచూపుతోంది. సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియా గల మంచిర్యాల (నస్పూర్, హాజీపూర్‌తో కలిపి) మండలం పరిధిలోని గ్రామాల్లో అధికంగా 899 కుటుంబాలు, మందమర్రిలో 480 కుటుంబాలకు సర్కారీ ఉద్యోగం ఉంది. చెన్నూరు మండలంలోని 3,569 దళిత కుటుంబాల్లో ప్రైవేటు ఉద్యోగి ఒక్కరు కూడా లేదు. తిర్యాణిలో ఇద్దరు, సిర్పూర్, జైనూరు, కెరమెరిలో నాలుగేసి కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం ఉండడం గమనార్హం.



కూలీతోనే జీవనం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మొత్తం 93,213 దళిత కుటుంబాలలో 55,192 రోజువారీ కూలీతో వచ్చే ఆదాయంతోనే బతుకు వెళ్లదీస్తున్నారు. అంటే 59 శాతం కుటుంబాలకు కూలీ జీవనాధారం కాగా, మరో 19,148 (13.65 శాతం) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను నమ్ముకొని బతుకుతున్నారు. 3,178 దళిత కుటుంబాలు వ్యవసాయంతో సంబంధం లేని ఇతర పనులపై ఆధారపడ్డారు. 12,766 కుటుంబాలు మాత్రం వ్యవసాయం, కూలీతో సంబంధం లేని ఇతర రంగాల్లో ఉన్నట్లు ఎస్‌ఈసీసీ లెక్కలు చెపుతున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top