మందకొడి పనులు

మందకొడి పనులు - Sakshi

పోలవరం : పోలవరం ప్రాజెక్టు పనులు మందకొడిగా జరుగుతున్నాయి. నిర్ధేశించిన లక్ష్యానికి చేరుకోలేకపోతున్నాయి. ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్‌ పనులు, రాయి తొలగింపు పనుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 14 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2.5 లక్షల క్యూబిక్‌మీటర్ల పనులు జరిగాయి. రోజుకు 3,500 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం 1500 క్యూబిక్‌ మీటర్ల పనులు మాత్రమే జరుగుతున్నాయి. అవి కూడా తరచూ ఆగిపోతున్నాయి. కొండను తొలగించే పనులు రోజుకు 40 నుంచి 45 వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే జరుగుతున్నాయి.



కనీసం లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా పనులు జరగాల్సి ఉంది. స్పిల్‌వే కాంక్రీట్‌ పనులకు ఇబ్బంది లేకుండా మాత్రమే ఈ రాయి తొలగింపు పనులు జరుగుతున్నాయి. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి సంబంధించి 660 మీటర్ల పునాది పనులు జరగాల్సి ఉండగా, 580 మీటర్ల పునాది పనులు జరిగాయి. గోదావరి వరద కారణంగా ఆ పనులు నిలిచిపోయాయి. గేట్ల పనులు జరుగుతున్నాయి. పనులు మందకొడిగా జరుగుతున్న నేపధ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ హుకుంసింగ్‌ ఆధ్వర్యంలో బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కాపర్‌డ్యామ్‌ నిర్మాణానికి సంబంధించి కనీసం ఇంకా డిజై¯ŒSలు కూడా ఖరారు కాలేదు. ఈ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం తప్ప ఏ విధమైన పురోగతిలేదు.



ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు పనులు మందకొడిగా జరగడం, నిధుల వినియోగం, నిబంధనలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా అనే అంశాలను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలించనుంది. కాపర్‌ డ్యామ్‌ పరిస్థితిపై కూడా ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం మేరకు  2018 మార్చి నాటికి పనులు పూర్తయ్యే అవకాశం లేదని, పనుల్లో నిబంధనలు పాటించలేదని, గతంలో మసూద్‌ హుస్సేన్‌ కమిటీ ఇచ్చిన నివేదికకు కేంద్రం స్పందించింది. దీనికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పనులపై నిగ్గు తేల్చేందుకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని పంపుతోంది. ఇప్పటి వరకు కేంద్రం ఈ ప్రాజెక్టుకు 3364 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకపోవడం, అంచనా వ్యయం భారీగా పెంచడంపై కూడా మసూద్‌ హుస్సేన్‌ బృందం తప్పుపట్టింది. ఈ అంశాలపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించనుంది.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top